టైటిల్ : రత్నం
నటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులు
నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
దర్శకత్వం: హరి
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024
‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్‌లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్‌కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం.
ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మాస్ సినిమాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్‌తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది.
1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్‌గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్‌గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
ఎమ్మెల్యే పన్నీర్‌గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment