ఆ విషయంపై స్పందించను : మంత్రి
యశవంతపుర : మాజీ మంత్రి రమేశ్ జారకిహొళెని బుజ్జగించే విషయం ముగిసిన అధ్యాయమని అయన సోదరుడు, అటవీశాఖ మంత్రి సతీశ్ జారకిహొళె స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం పతనమైతే విధానసభకు ఎన్నికలు అనివార్యమని ఆయన చేసిన వ్యాఖ్యలు అశ్చర్యాన్ని కలిగించాయి. లోకసభ ఎన్నికలలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి రెండు పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి సతీశ్ జారకిహొళె చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో ప్రకంపనలను రేపుతున్నాయి. ఆయన సోమవారం బెళగావి సాంబ్రా విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి కొందరు మంత్రులు రాజీనామా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం కుమారస్వామి నేతత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, మాజీ మంత్రి రమేశ్ జారకీహొళె కలవటంపై తాను స్పందించన్నారు.