మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సీబీఐ నోటీసులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉత్తర కన్నడ జిల్లాలోని బెలెకెరె రేవు ద్వారా ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేశారన్న ఆరోపణలకు సంబంధించి సీబీఐ బళ్లారి జిల్లా విజయ నగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్రలకు నోటీసులు జారీ చేసింది. ఆదివారంలోగా దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశించింది. విదేశీ పర్యటనలో ఉన్న ఆనంద్ సింగ్ శనివారం వేకువ జామున నగరానికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం ఇక్కడి బళ్లారి రోడ్డులోని గంగా నగరలో ఉన్న సీబీఐ కార్యాలయంలో తన న్యాయవాదితో హాజరయ్యారు. అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాగేంద్ర కూడా ఆదివారంలోగా దర్యాప్తునకు హాజరు కావాల్సి ఉంది. వీరిద్దరిని ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
సతీశ్ శైల్‌కు సీబీఐ కస్టడీ
మరో వైపు శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన ఉత్తర కన్నడ జిల్లా కార్వార ఎమ్మెల్యే సతీశ్ శైల్‌ను సీబీఐ అధికారులు శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ఆయనను అరెస్టు చేశామని, మరింత దర్యాప్తు కోసం తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయాధికారిని కోరారు. దీనిపై సతీశ్ శైల్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింట్‌కు ఇదివరకే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. పైగా ఈ ఆరోపణలకు సంబంధించి పలు సార్లు శైల్‌ను ప్రశ్నించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. ఇరు వైపులా వాదనలను ఆలకించిన అనంతరం న్యాయాధికారి ఈ నెల 27 వరకు శైల్‌ను సీబీఐ కస్టడీకి ఆదేశించారు. ఈ నెల 24న ఆయన బెయిల్ దరఖాస్తుపై విచారణ చేపడతామని తెలిపారు.
అధికారులకూ నోటీసులు
అక్రమ మైనింగ్‌కు సహకరించారన్న ఆరోపణలపై రిటైర్డ్ జిల్లా కలెక్టర్ శివప్ప, పోలీసు అధికారి సీమంత కుమార్, అటవీ శాఖాధికారి ముత్తయ్య సహా పలువురు సీనియర్ అధికారులకు సీబీఐ అత్యవసర నోటీసులు జారీ చేసింది. స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.