యునెటైడ్ బ్రూవరీస్ జీఎంపై దాడి
తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
అధికార పార్టీ నేత అనుచరుల పనే ?
కలెక్టరేట్ ఎదుట కార్మికుల నిరసన
సాక్షి, హైదరాబాద్ : మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి శివారులోని యునెటైడ్ బ్రూవరీస్ (గోల్కొండ) యూనిట్ జనరల్ మేనేజర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. జీఎం సతీష్ భట్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఫ్యాక్టరీకి వెళ్తుండగా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో ఆయన వెళ్తున్న కారును గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించారు. అందులో ఉన్న జీఎంను బయటకు లాగి కొట్టారు. ఈలోగా స్థానికులు గుమికూడటంతో గుర్తు తెలియని వ్యక్తులు తాము వచ్చిన కారు (ఏపీ 29ఎ 8923)ను వదిలి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సతీష్‌ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి నిందితుల కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో జీఎం నుంచి వివరాలు సేకరించారు. జీఎం డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా యూబీ గ్రూపు కంపెనీల సిబ్బంది కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
మాట వినడం లేదనే?
సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న అధికార పార్టీ నేత ఈ ఘటనకు కారకుడని ఆరోపణలు వస్తున్నాయి. సదరు నేత ముఖ్య అనుచరుడు దాడి ఘటనను ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేత ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బీరు కంపెనీల ప్రతినిధుల సమావేశానికి యూబీ జీఎం వెళ్లకపోవడమే దాడికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్టరీ వ్యవహారాల్లో తన మాట చెల్లుబాటు కావడంలేదనే ఆక్కసుతోనే దాడికి పురమాయించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడికి క్లీన్చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్‌తో సహా పట్టుబడిన కారు ఎవరిదనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలతో స్థానికులకు ఉపాధి దక్కకుండా పోతుందని యూబీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మల్లేశం ఆందోళన వ్యక్తం చేశారు.