రౌడీషీటర్ కారసాని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో సంచలనం రేకెత్తించిన కాంగ్రెస్ నేత, రౌడీషీటర్ కారసాని శ్రీనివాసరావు హత్య కేసులో ప్రధాన నిందితులైన నల్లపాటి శివయ్య, కత్తి బ్రహ్మారెడ్డిలకు జీవిత ఖైదుతోపాటు, రూ. 4 వేల జరిమానా విధిస్తూ గురువారం గుంటూరులోని ఆరో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ సంచలన తీర్పు ఇచ్చారు.
మిగిలిన నిందితులను నిర్దోషులుగా వదిలేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరు గ్రామానికి చెందిన కారసాని శ్రీనివాసరావు తండ్రి వెంకటరత్నం నాయుడు గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన యేటిగడ్డ హనిమిరెడ్డి అనుచరుల చేతిలో 1990లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో హనిమిరెడ్డి అనుచరుడుగా ఉన్న నల్లపాటి అంకమ్మరావు ప్రధాన నిందితుడు. తన తండ్రిని హత మార్చారని పగపెంచుకున్న వెంకటరత్నం కుమారుడు కారసాని శ్రీనివాసరావు పథకం ప్రకారం గుంటూరులోని హరిహరమహల్ థియేటర్ సమీపంలో 1992లో హనిమిరెడ్డిని హత్య చేశాడు. మరో మూడేళ్ళ తరువాత నల్లపాటి అంకమ్మరావును కూడా కారసాని వర్గీయులు ఇమాంవలీతో పాటు మరో ఆరుగురు కలిసి హత్య చేశారు.
దీంతో అంకమ్మరావు సోదరుడు నల్లపాటి శివయ్య కారసాని శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు. తన సోదరుడు అంకమ్మరావును దారుణంగా హతమార్చాడని, ఎలాగైనా కారసాని శ్రీనివాసరావును కూడా హతమార్చాలని పథకం రచించాడు. ముందుగా శ్రీనివాసరావుతో పాటు తన సోదరుడిని హతమార్చిన ఇద్దరు నిందితులను 2000 సంవత్సరంలో హతమార్చాడు. ఈ కేసులో శివయ్యకు జీవిత ఖైదు విధించగా, శిక్ష అనుభవించి 2007 అక్టోబరు 1న సెంట్రల్ జైలు నుంచి విడుదలై గుంటూరు చేరుకున్నాడు. అప్పటికే కారసాని కాంగ్రెస్ నేతగా పలు పదవులు నిర్వహిస్తున్నారు. పెదపలకలూరు, గుంటూరులోని కొరిటెపాడు కేంద్రాలుగా చేసుకుని తన అనుచరులతో కలిసి కార్యకలాపాలు సాగిస్తుండేవాడు. అతనిపై అప్పటికే 40 కేసులు నమోదు కావడంతోపాటు అరండల్‌పేట పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది.
పక్కా ప్రణాళికతో హత్య...
తన సోదరుడు హత్యకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న నల్లపాటి జైలు శిక్ష అనంతరం బయటకు వచ్చి వర్గాన్నికూడకట్టే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయిలో హత్యకు రూపకల్పన చేసి పలుమార్లు కారసాని సంచరిస్తున్న ప్రాంతాలు, వెళ్తున్న ఊర్లు వివరాలును ఆరా తీశారు. గుంటూరు నుంచి ఆయా ప్రాంతాలకు వెళుతున్న క్రమంలో కూడా కారసానిని హతమార్చేందుకు రూరల్ ప్రాంతాలకు వెళిన సందర్భాలున్నాయి. అయితే కారసాని పక్కన అనుచరులు, ప్రజలు అధికంగా ఉండటంతో ప్లాన్ విఫలమైంది. ఎలాగైనా కారసానిని హతమార్చాలని శివయ్య గుంటూరు నగరంలోనే ప్లాన్ మార్చారు. అనుచరులతో పాటు బాంబులు, కత్తులు, వేట కొడవళ్లను సిద్ధం చేసుకుని శ్రీనివాసరావు కదలికలపై అనుచరులతో రెక్కీ ప్రారంభించాడు.
సుమారు రెండు నెలల రెక్కీ అనంతరం 2008 మార్చి 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిసెంటర్‌లో ఉన్నాడని తెలియడంతో తోటి అనుచరులైన కత్తి బ్రహ్మారెడ్డి, కలుగూరి నాగరాజు, దోమల చిన యాకోబులతో కలిసి బయల్దేరాడు. శ్రీనివాసరావు లీలామహాల్ సెంటర్లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉండగా, తన పక్కన ఉన్న వారితో కలిసి కారసాని టీ తాగేందుకు పక్కనే ఉన్న అమన్ టీస్టాల్ వద్దకు వెళ్లారు. శ్రీనివాసరావు కోసం కాపు కాచి ఉన్న ప్రత్యర్థులు బాంబులు విసిరి వెంటాడి వేట కొడవళ్లతో దారుణంగా నరకడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
శివయ్య, బ్రహ్మారెడ్డిలతోపాటు, మరో 11 మందిని నిందితులుగా చూపుతూ అప్పటి కొత్తపేట సీఐ, ప్రస్తుతం సత్తెనపల్లి డీఎస్పీ ఆర్.విజయభాస్కర్‌రెడ్డి అప్పట్లో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ కొంత మేర జరిగిన తరువాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని మృతుడి బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడంతో కేసు విచారణ నిలిచిపోయింది. ఆరో అదనపు కోర్టు ఏపీపీగా నియమితులైన కట్టా కాళిదాసును నియమించడంతో మృతుడి బంధువులు స్పెషల్ పీపీ డిమాండ్‌ను విరమించుకున్నారు. ఏపీపీ ప్రాసిక్యూషన్ తరుపున సాక్షులను ప్రవేశపెట్టి ప్రాసిక్యూషన్ పూర్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నల్లపాటి శివయ్య, కత్తి బ్రహ్మారెడ్డిలను దోషులుగా తేలడంతో జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.