బృహస్పతి... ఉపగ్రహాల రాజు.. డజను చంద్రుల గుర్తింపు
కేప్ కెనవెరాల్ (యూఎస్): సౌరకుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం (బృహస్పతి) చుట్టూ మరో 12 ఉపగ్రహాలను సైంటిస్టులు కనిపెట్టారు. దీంతో దాని ఉపగ్రహాల సంఖ్య ఏకంగా 92కు పెరిగింది. తద్వారా 83 ఉపగ్రహాలున్న శని గ్రహాన్ని వెనక్కు నెట్టి సౌరమండలంలో అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహంగా నిలిచింది. హవాయి, చిలిల్లోని టెలిస్కోప్ల సాయంతో 2021, 2022ల్లోనే గురు గ్రహపు కొత్త ఉపగ్రహాలను గుర్తించినా ఇంతకాలం పాటు నిశితంగా గమనించిన వాటి ఉనికిని తాజాగా నిర్ధారించారు.
ఏకంగా 92 ఉపగ్రహాలతో గురు గ్రహం ఓ మినీ సౌరకుటుంబంగా భాసిల్లుతోందని వీటిని కనిపెట్టిన సైంటిస్టు స్కాట్ షెపర్డ్ చమత్కరించారు. ‘‘అయితే ఇవన్నీ బుల్లి ఉపగ్రహాలే. ఒక్కోటీ కేవలం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉన్నాయి’’ అని వివరించారు. పూర్తి వాయుమయమైన గురు గ్రహాన్ని, మంచుతో కూడిన దాని అతి పెద్ద ఉపగ్రహాలను అధ్యయనం చేసేందుకు ఏప్రిల్లో ఒక అంతరిక్ష నౌకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపనుంది.
వీటిలో యూరోపా క్లిపర్ అనే ఉపగ్రహం ఉపరితలంపై పేరుకున్న అపారమైన మంచు కింద భారీ సముద్రం దాగుందని నాసా భావిస్తోంది. దాని అధ్యయనం కోసం 2024లో యూరోపా క్లిపర్ మిషన్ను ప్లాన్ చేస్తోంది. అది వాసయోగ్యమేనా అన్న అంశాన్ని పరిశోధించనుంది. బృహస్పతి, శని చుట్టూ ఉన్న భారీ ఉపగ్రహాలు బహుశా పరస్పరం ఢీకొని ఉంటాయని, ఇన్నేసి బుల్లి ఉపగ్రహాలుగా విడిపోయాయని షెపర్డ్ పేర్కొన్నారు. ‘‘యురేనస్, నెప్ట్యూన్లదీ ఇదే పరిస్థితి. కానీ అవి మరీ సుదూరాల్లో ఉన్న కారణంగా వాటి ఉపగ్రహాలను గుర్తించడం చాలా కష్టం’’ అని వివరించారు. యురేనస్కు 27, నెప్ట్యూన్కు 14, అంగారకునికి రెండు ఉపగ్రహాలున్నాయి. బుధ, శుక్ర గ్రహాలకు ఒక్కటి కూడా లేదు.