శని ఉపగ్రహంపై జీవం?
లాస్‌ఏంజెలెస్: భూమిపై జీవం ఏర్పడటానికి కారణం ద్రవరూపంలోని నీరే. కానీ శనిగ్రహపు అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్‌పై నీటి ఛాయలున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అక్కడి వాతావరణంలో హైడ్రోజన్ సైనేడ్ ఉన్నట్లు వీరు కనుగొన్నారు. ఈ రసాయన రూపాన్ని పాలీమైన్ అంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రూపొందించిన కాసినీ, హ్యూజెన్స్ మిషన్‌లు పంపిన సమాచారం ఆధారంగా వీరు ఈ విషయాన్ని నిర్ధారించారు. టైటాన్‌పైనున్న చల్లటి వాతావారణం కారణంగా పాలీమైన్ సూర్యుని శక్తిని సంగ్రహించి జీవ పరిణామానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
మన భూమిపై పూర్వం ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని వారు చెబుతున్నారు. కానీ టైటాన్ వాతావరణం మనకు పూర్తి విభిన్నమైనదని వారంటున్నారు. టైటాన్‌పై కూడా సరస్సులు, నదులు, సముద్రాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే దీనిపై ఇంకా లోతుగా పరిశోధన చేసి మరిన్ని విషయాలు కనుగొంటామని వారంటున్నారు.