సత్యదేవుడి దివ్యదర్శనం
రాత్రి ఏడు గంటలకు ఐదు బస్సుల్లో శ్రీకాకుళం భక్తుల రాక
ఘన స్వాగతం పలికిన అధికారులు
అన్నింటా ఉచిత ఏర్పాట్లు
అన్నవరం:
పేదలకు దేవాలయ దర్శనం చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దివ్యదర్శనం’లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన భక్త బృందం 200 మంది ఐదు బస్సుల్లో శుక్రవారం రాత్రి అన్నవరం చేరుకుంది. వీరికి ఘాట్‌రోడ్ ముఖద్వారం వద్ద ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఈఓ కె.నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఏసీ రమేష్‌బాబు, దేవస్థానం పండితులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు ఈ బృందం రావాల్సి ఉండగా రెండుగంటలు ఆలస్యంగా వచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంఎల్ఏ, ఈఓ తదితరులు దేవస్థానంలో అన్నీ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు వసతి, అల్పాహారం, దర్శనం, ప్రసాదం ఉచితంగా అందచేస్తున్నట్లు తెలిపారు. తరువాత ఆ భక్తులను నేరుగా సత్యదేవుని దర్శనానికి తీసుకువెళ్లారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులందచేసి ప్రసాదాలు బహూకరించారు. వీరందరికీ సత్యగిరిపై ఉన్న విష్ణుసద¯ŒSలో బస ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం వీరు అల్పాహారం అయ్యాక విజయవాడ వెళ్తారని అధికారులు తెలిపారు.
కాగా వీరి వాహనాల రాకకు ఆలస్యంపై ఆరా తీయగా విశాఖజిల్లా వేంపాడు చెక్‌పోస్టు వద్ద టోల్ ఫీజు కట్టలేదని దివ్యదర్శనం బస్‌లు ఆపేశారని, కలెక్టర్ జోక్యంతో వాటిని అనుమతించారని తెలిపారు.
భక్తులకు అతిథి మర్యాదల్లో భాగంగా మహిళా భక్తులందరికీ మహిళా ఉద్యోగినుల చేత బొట్టు పెట్టించారు. వీరి కోసం సిబ్బందికి ప్రత్యేకంగా డ్యూటీలు వేశారు. దేవస్థానంలో వారికి వైద్యం అందజేయడానికి ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అధికారిక ఉత్తర్వుల మేరకే విధంగా చేయాల్సి వచ్చిందని ఓ అధికారి తెలిపారు.
కాగా, వచ్చే వారంలో విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన భక్తుల బృందాలు కూడా దివ్యదర్శనం పథకం కింద అన్నవరం రానున్నారు. వారికి కూడా ఇదే విదంగా అతిధి మర్యాదలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.