అంతిమ విజయం ధర్మానిదే
విజయవాడ కల్చరల్ : ధర్మం ఉన్న చోట జయం ఉంటుందని ఇస్కాన్ సౌత్ ఇండియా డివిజన్ కౌన్సిల్ చైర్మన్ సత్యచగోపీనాథ్ ప్రభూజీ వివరించారు. ఇస్కాన్ సంస్థ స్వర్ణోత్సవాలు స్వరాజ్యమైదానంలో రెండురోజులుగా జరిగాయి. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన బాల బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యగోపీనాథ్ మాట్లాడుతూ భారతదేశం నిరంతరం ధర్మం కోసం పాటుపడుతున్నందునే ప్రపంచ దేశాలు మన దేశంవైపు చూస్తున్నాయని చెప్పారు. సక్రమంగా సంపాదించిన ధనమే నిలుస్తుందని, అక్రమ మార్గంలో వచ్చిన సంపాదన నిలువదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు కేటగిరీలో నిర్వహించిన పోటీల్లో 30 వేలమందికి పైగా పాల్గొన్నారని చెప్పారు. దాదాపు రూ. 20 లక్షలను ప్రైజ్ మనీగా అందిస్తున్నామన్నారు.
ఇస్కాన్ విశేష సేవలు : మంత్రి ప్రత్తిపాటి
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ సేవలు ఇతర సేవా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరారవు మాట్లాడారు. వివిధ కేటగిరిలో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు.
విజేతలు వీరే ..
ఆరు నుంచి పదో తరగతి వరకు మెదటి బహుమతి రూ. 1 లక్ష వడలి కాకినాడకు చెందిన సుబ్రహ్మమణ్వేశ్వరశర్మ, ద్వితీయ రూ.75 వేలు అనంతపురానికి చెందిన టి.సాయిలిఖిత, తృతీయ రూ. 50 వేలు అనంతపురానికి చెందిన బి.మహేష్‌బాబు, రెండో కేటగిరీలో మొదటి బహుమతి రేణిగుంటకు చెందిన పాసల మహేష్, ద్వితీయ బహుమతి కాకినాడకు చెందిన బి. వెంకటసాయి, తృతీయ బహుమతి పి. సాయిగాయత్రి, మూడో విభాగంలో మెదటి బహుమతి విజయవాడకు చెందిన డాక్టర్ జె. ప్రసన్న, ద్వితీయ బహుమతి ఎస్. కృష్ణ ప్రసాద్, తృతీయ బహుమతి బి. శ్రీనివాసులు సాధించారు. వీరితోపాటు ప్రతి జిల్లాలోనూ గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బరంపురానికి చెందిన ప్రిన్సి గ్రూప్ నృత్య దర్శకుడు టి. కృష్ణారెడ్డి నృత్య దర్శకత్వంలో శ్రీకృష్ణలీలలు, కాళీయ మర్దనం, శ్రీకృష్ణుని రాసలీలలు, కృష్ణడు అర్జనునికి గీతను బోధించడం అంశాలన ప్రదర్శించారు.
నేటి కార్యక్రమాలు
సాయంత్రం 7 గంటలకు సంకీర్తన, 7.30 సత్యగోపీనాథ్ భాగవతం అంశంగా ప్రసంగం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు