ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు
బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారు జాము నుంచి వివిధ ఆలయాల్లో దీపాలు వెలిగించి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో ఉదయం 9.30 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దశ సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.
విద్యానగర్‌లోని కొల్లాపుర మహాలక్ష్మి, గంగామాత, వెంకటేశ్వర, ఎస్ఎన్.పేట్, పటేల్‌నగర్ లక్ష్మివెంకటేశ్వర స్వామి, బాలాంజనేయస్వామి, మిల్లర్‌పేట్ మల్నాడు దుర్గమ్మ, ఏళుమక్కళ తాయమ్మ, కన్యకా పరమేశ్వరి, నగరేశ్వరి, నీలకంఠేశ్వరి, షిరిడీసాయి బాబా, నగర ఆరాధ్య దైవం శ్రీ కనకదుర్గమ్మ ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. బళ్లారి సమీపంలోని హగరి నదిలో మరికొంత మంది భక్తులు కార్తీక దీపాలను నీటిలో వదిలి పూజలు జరుపుకున్నారు.
కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో లక్ష దీపోత్సవం
బళ్లారి టౌన్: నగరంలోని విమానాశ్రయం రోడ్డులోని కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం ధర్మకర్త గట్టు రాములు అర్చకుల వేదమంత్రాల మధ్య గరుడ స్తంభ దీపానికి పూజలు నిర్వహించి అనంతరం లక్షవత్తులు గల దీపాన్ని వెలిగించారు. అనంతరం ఆలయంలో టైలర్ నారాయణప్ప బృందం సంగీత కార్యక్రమాన్ని, రవిశంకర్ గురూజీ శిష్యబృందం పూర్ణచంద్ర యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఘనంగా గౌరీదేవికి హారతులు
బళ్లారి అర్బన్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక పటేల్‌నగర్‌లో శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో గౌరిదేవికి మహిళలు, చిన్నారులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు పట్టారు. ఉదయం గౌరిదేవిని కొలువు దీర్చి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస్ ఆచారి తెలిపారు. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా ఆలయంలో గౌరిదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నోములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం మహిళా భక్తులు విశేషంగా పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది. ఓ పక్క కార్తీక దీపాలు వెలిగిస్తూ మరో వైపు గౌరిదేవికి నోములు నోచి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం సాయంత్రం ఊరేగింపుగా అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారు.