Satyanarayanapuram police
-
తండ్రి, కుమార్తెను బలిగొన్న వాటర్ హీటర్
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న కూతురు, మనవళ్లకు అన్నీ తానై చూసుకుంటున్నాడు ఆ పెద్దాయన. విధి చిన్నచూపు చూడటంతో విద్యుదాఘాతానికి గురై తండ్రి, ఆయనను కాపాడే ప్రయత్నంలో కుమార్తె మృత్యువాత పడ్డారు. పదేళ్లు వయసు నిండని ఇద్దరు బిడ్డలను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన సత్యనారాయణపురంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రామకోటి మైదానం పాపిట్లవారివీధిలో నివాసం ఉంటున్న ఇప్పిలి సింహాచలం (60) పెయింటింగ్ పనులు చేసుకుంటూ భార్య వరాలమ్మతో కలసి పాత రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. అతని కుమార్తె పసుపులేటి మంగమ్మ (32) భర్తతో విభేదాల కారణంగా 6, 9 ఏళ్ల కుమారులతో కలసి పుట్టింట్లోనే ఉంటుంది. వారు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 1, 3వ తరగతి చదువుతున్నారు. సింహాచలానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలంగా పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్య వరాలమ్మ, కూతురు మంగమ్మ ఇళ్లలో పనులు, సాయంత్రం సమయంలో ఫుడ్‌కోర్డులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంగమ్మ తన ఇద్దరు పిల్లలకు స్నానం చేయించి ఇంటి సమీపంలోని ట్యూషన్‌కు పంపించింది. సింహాచలం కూడా స్నానం చేసే నిమిత్తం వేడినీళ్లు కాచుకోవడానికి ప్లాస్టిక్ బకెట్లో వాటర్ హీటర్ పెట్టి స్విచ్ వేశాడు. ఆ సమయంలో విద్యుత్‌షాక్ తగిలి కిందపడిపోయాడు. కాపాడే ప్రయత్నంలో కూతురు మంగమ్మ తండ్రిని పట్టుకోవడంతో ఆమెకు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వారిని కాపాడే క్రమంలో పక్క పోర్షన్లో ఉండే అక్కవరపు సీత(54)కు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. భర్త, కూతురు మృతి చెందటంతో ఆమె ఇద్దరు పిల్లలను చూసుకుని తల్లి వరాలమ్మ కుమిలిపోవడం స్థానికుల కలచివేసింది. సత్యనారాయణపురం సీఐ వెంకటనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సీఎంను దూషించిన కేసులో ఐదుగురి అరెస్ట్
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): ఇటీవల ఒక యూట్యూబ్ చానల్లో సీఎం వైఎస్ జగన్‌ను, మంత్రి పి.అనిల్ కుమార్‌యాదవ్‌ని దూషించిన ఐదుగుర్ని సత్యనారాయణపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామానికి చెందిన కుడిపూడి సోమశేఖర్ (46) పెయిడ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల వరద వల్ల తన పంటకు నష్టం వాటిల్లిందంటూ శేఖర్‌తోపాటు అదే గ్రామానికి చెందిన బొంతలపాటి శివప్రసాద్ అలియాస్ ప్రసాద్ (46), కొండూరి సీతారామయ్య (34), నిడుమోలు శివయ్య (35), అనంతవరం గ్రామానికి చెందిన సత్యేంద్ర (39) కలసి ప్రభుత్వ ప్రతిష్టను భంగపరచాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్, మంత్రి అనిల్‌లను దుర్భాషలాడారు. దీనిని తమ మొబైల్స్ ద్వారా వీడియో తీసి యూట్యూబ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీనిపై పలు సంఘాల నాయకులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నార్త్‌జోన్ ఏసీపీ షర్ఫుద్ధీన పర్యవేక్షణలో సత్యనారాయణపురం సీఐ బాలమురళీకృష్ణ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ ఐదుగురినీ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే బుకింగ్ సమీపంలో అరెస్ట్ చేసి, వీడియో తీసిన మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 505(2) రెడ్‌విత్ 34, 120బీ కింద కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా వచ్చే నెల 7 వరకు రిమాండ్ విధించారు. -
కుమారుడే కడతేర్చాడు
- భార్య, కుమార్తె సహకరించారు - వ్యక్తి హత్య కేసులో ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు - హతుడి వేధింపులు భరించలేకే.. సత్యనారాయణపురం : ఇటీవల శ్రీనగర్ కాలనీలో జరిగిన పగిడిపల్లి వెంకటేశ్వరరావు హత్యకేసులో నిందితులు ముగ్గురిని సత్యనారాయణపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్‌జోన్ ఏసీపీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. శ్రీనగర్ కాలనీ నాలుగో లైన్లో వెంకటేశ్వరరావు నివాసం ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన వెంకటేశ్వరరావు నిత్యం కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో ఘర్షణ పడేవాడు. ఈ నేపథ్యంలో అతడి కుమార్తె భవానికి కొత్తగూడేనికి చెందిన వ్యక్తితో ఈనెల ఏడో తేదీన నిశ్చితార్థం జరిగింది. వెంకటేశ్వరరావుకు ఇష్టం లేకపోయినా ఈ కార్యక్రమానికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఈ విషయమై భార్య అరుణ, కుమారుడు దుర్గారావు, కుమార్తె భవానితో ఘర్షణపడ్డాడు. నిశ్చితార్థం తర్వాత పలుమార్లు వారితో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన ముగ్గురూ.. వె ంకటేశ్వరరావును అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో 11వ తేదీన వెంకటేశ్వరరావుకు, వారికి మధ్య మరలా ఘర్షణ జరిగింది. చుట్టుపక్కల వారు వచ్చి సర్దిచెప్పినా వెంకటేశ్వరరావు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో అరుణ ఇంట్లోకి వెళ్లి పచ్చడిబండ తీసుకువచ్చింది. దుర్గారావు దానిని తీసుకుని తండ్రి తలపైన బలంగా పలుమార్లు కొట్టాడు. ఆ సమయంలో తల్లి, సోదరి అతడికి సహకరించారు. తలకు తీవ్రమైన గాయమై వెంకటేశ్వరరావు ఇంటి వరండాలోనే మృతి చెందాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత దుర్గారావు, అరుణ, భవాని అక్కడినుంచి పారిపోయారు. అనంతరం అక్కడకి చేరుకున్న మృతుడి మరో కుమారుడు గోపి ఈ ఘటన గురించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారు కేసు నమోదు చేశారు. నింది తులు ముగ్గురిని మంగళవారం సాయంత్రం రైల్వేస్టేషన్ సమీపంలో సెంట్రల్ జోన్ ఏసీపీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ పర్యవేక్షణలో సత్యనారాయణపురం సీఐ ఎం.సత్యనారాయణ అరెస్టు చేశారు. వారి వద్దనుంచి హత్యకు ఉపయోగించిన పచ్చడి బండను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.