కుమారుడే కడతేర్చాడు
- భార్య, కుమార్తె సహకరించారు
- వ్యక్తి హత్య కేసులో ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
- హతుడి వేధింపులు భరించలేకే..
సత్యనారాయణపురం : ఇటీవల శ్రీనగర్ కాలనీలో జరిగిన పగిడిపల్లి వెంకటేశ్వరరావు హత్యకేసులో నిందితులు ముగ్గురిని సత్యనారాయణపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్‌జోన్ ఏసీపీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. శ్రీనగర్ కాలనీ నాలుగో లైన్‌లో వెంకటేశ్వరరావు నివాసం ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
మద్యానికి బానిసైన వెంకటేశ్వరరావు నిత్యం కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో ఘర్షణ పడేవాడు. ఈ నేపథ్యంలో అతడి కుమార్తె భవానికి కొత్తగూడేనికి చెందిన వ్యక్తితో ఈనెల ఏడో తేదీన నిశ్చితార్థం జరిగింది. వెంకటేశ్వరరావుకు ఇష్టం లేకపోయినా ఈ కార్యక్రమానికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఈ విషయమై భార్య అరుణ, కుమారుడు దుర్గారావు, కుమార్తె భవానితో ఘర్షణపడ్డాడు. నిశ్చితార్థం తర్వాత పలుమార్లు వారితో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన ముగ్గురూ.. వె ంకటేశ్వరరావును అడ్డు తొలగించుకోవాలనుకున్నారు.
ఈ నేపథ్యంలో 11వ తేదీన వెంకటేశ్వరరావుకు, వారికి మధ్య మరలా ఘర్షణ జరిగింది. చుట్టుపక్కల వారు వచ్చి సర్దిచెప్పినా వెంకటేశ్వరరావు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో అరుణ ఇంట్లోకి వెళ్లి పచ్చడిబండ తీసుకువచ్చింది. దుర్గారావు దానిని తీసుకుని తండ్రి తలపైన బలంగా పలుమార్లు కొట్టాడు. ఆ సమయంలో తల్లి, సోదరి అతడికి సహకరించారు. తలకు తీవ్రమైన గాయమై వెంకటేశ్వరరావు ఇంటి వరండాలోనే మృతి చెందాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత దుర్గారావు, అరుణ, భవాని అక్కడినుంచి పారిపోయారు. అనంతరం అక్కడకి చేరుకున్న మృతుడి మరో కుమారుడు గోపి ఈ ఘటన గురించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు వారు కేసు నమోదు చేశారు. నింది తులు ముగ్గురిని మంగళవారం సాయంత్రం రైల్వేస్టేషన్ సమీపంలో సెంట్రల్ జోన్ ఏసీపీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ పర్యవేక్షణలో సత్యనారాయణపురం సీఐ ఎం.సత్యనారాయణ అరెస్టు చేశారు. వారి వద్దనుంచి హత్యకు ఉపయోగించిన పచ్చడి బండను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.