సత్యపాల్‌రెడ్డి ఆదర్శప్రాయుడు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
జనగామ : కమ్యూనిస్టు నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గంగసాని సత్యపాల్ రెడ్డి ఆదర్శప్రాయుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.
పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాలులో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సత్యపాల్‌రెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికి సైతం వెనకాడని కుటుంబమని చెప్పారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు నాయకుడిగా ఎగిదిన సత్యపాల్‌రెడ్డి అకుంఠిత దీక్షతో జనసేవాదళ్ స్థాపించి పార్టీకి పటిష్టమైన సైన్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. క్రమశిక్షణకు మారు పేరైన ఆయన హైదరాబాద్‌లోని మగ్దుం భవనానికి తన జీవితాన్ని ధారపోశాడన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం పేరు వింటేనే జగనామ గుర్తు కు వస్తుందని అన్నారు. ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొని, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల పక్షాన నిలిచిన సత్యపాల్‌రెడ్డి అందరి హృదయాల్లో నిలిచి పోతాడని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చిరుపల్లి సీతారాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు జి.రాములు, ఆముదాల మల్లారెడ్డి, కనకయ్య, తొర్రం సత్యం, బర్ల శ్రీరాములు, మంగళ్లపల్లి జనార్దన్ , ఎండ్రు వైకుంఠం, సుద్దాల యాదగిరి పాల్గొనానరు.