అడుగడుగునా అమానుషాలే!
పేగు బంధాన్నీ మర్చిపోతున్న కిరాతకులు
కన్న బిడ్డలపైనా కత్తికడుతున్న వైనం
‘‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు... మచ్చుకైనా లేడు చూడు మనసున్న వాడు... అనుబంధ ఆత్మీయత అంతా ఒక బూటకం... ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం...’’ ఏనాడో కవుల కలాల నుంచి జాలువారిన ఈ పాటలు ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చినిజాలవుతున్నాయి. పేగుబంధాన్ని సైతం మర్చిపోతున్న కిరాతకులు కన్న, కడుపున పుట్టిన వారినీ అంతం చేస్తున్నారు. ఈ ఘాతుకాల వెనుక అనేక కారణాలు ఉంటున్నా... ప్రధానంగా మానసిక రుగ్మతలు, పరిపక్వత లేని ఆలోచనలతో పాటు ఆర్థికాంశాలు, క్షణికావేశాలే కారణం. తాజాగా నేరేడ్మెట్ పరిధిలో నివసించే పూర్ణిమ 23 రోజుల వయస్సున్న కన్న బిడ్డను హతమార్చడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ధోరణి పెరగడానికి యాంటీ సోషల్ పర్సనాలిటీ, కొన్ని రకాలైన డిజార్డర్స్ కారణమని మానసిక నిపుణులు చెప్తుండగా... చట్టమంటే భయం... వ్యవస్థ పట్ల గౌరవం లేకపోవడమే కారణమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -సాక్షి, సిటీబ్యూరో
ఆర్థిక కారణాలే అధికం...
హార్థిక సంబంధాలను మర్చిపోయి తన వారినే పగవారుగా చూసే ధోరణికి ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలే కారణమవుతున్నాయి. ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదాలు, ఉమ్మడి వ్యాపారంలో వచ్చిన స్పర్థలు సొంత వారి మధ్యే చిచ్చుపెడుతన్నాయి. దీనికి ఈర్ష్యాద్వేషాలు తోడు కావడంతో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆనంద్‌నగర్ కాలనీలో సొంత అన్నను చంపించిన తమ్ముడు, పంజగుట్ట పరిధిలో చోటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘సిసోడియాల’ కేసు ఈ కోవలోకే వస్తాయి. కొన్ని సందర్భాల్లో నమ్మకమే పెట్టుబడిగా విదేశాల్లో ఉన్న బంధువుల సొమ్ముకాజేస్తున్న దగాకోరులు లెక్కలు చెప్పాల్సి వచ్చేసరికి కర్కశంగా మారిపోతున్నారు. సికింద్రాబాద్‌లోని ఆర్ఏకే లాడ్జ్‌లో జరిగిన ఎన్ఆర్ఐ కుటుంబం దారుణ హత్య ఇలాంటి కారణాల నేపథ్యంలోనే జరిగింది. కేవలం హత్యలే కాకుండా అనేక కిడ్నాప్‌లు, దాడులు సైతం నిత్యం నగరంలో వెలుగులోకి వస్తూనే ఉంటున్నాయి.
చనిపోతూ చంపేస్తున్నారు...
తల్లిదండ్రులు చేసిన అనాలోచిత నిర్ణయా లు, ఆర్థిక లావాదేవీలు సైతం పసిబిడ్డల పాలిటి శాపంగా మారుతున్నాయి. వ్యక్తిగత, వ్యాపార కారణాలతో చేస్తున్న అప్పులు తీరే మార్గం లేక... తట్టుకుని నిలబడి, ప్రత్యామ్నాయ మార్గాల్లో సంపాందిచే మానసిక స్థైర్యం లేని వారు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారు. తమతో పాటే తమ వారసులూ ‘రావాలన్న’ ఉద్దేశంతోనో, తామే లేకపోతే తమ వారిని ఎవరు చూస్తారనే భయంతోనే ఆత్మహత్యకు ముందు కడుపున పుట్టిన వారినీ కడతేర్చేస్తున్నారు. హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించిన భార్యాభర్తలు బాలరాజ్, సురేఖ ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. చనిపోయే ముందు 13 నెలల వయస్సున్న కవలలు మేథ, మేఘనల ఉసురుతీశారు. బోరబండ వినాయక్‌నగర్‌కు చెందిన సరిత సైతం ఆత్మహత్య చేసుకుంటూ కడుపున పుట్టిన మూడేళ్ల ప్రత్యుష, తొమ్మిది నెలల శరణ్యలను చంపేసింది.
మానసిక రుగ్మతలతో మరో ప్రమాదం...
పేగుబంధాలను నిర్ధాక్షణ్యంగా తెంపేస్తున్న ఉదంతాల్లో ఈ ఘాతుకానికి ఒడిగడుతున్న వారి మానసిక రుగ్మతలు మరో ప్రధాన కారణంగా ఉంటున్నాయి. తాము ఊహించుకున్న, భావించిన అంశాలనే నిజాలుగా నమ్ముతూ కన్న వారి ఉసురుతీస్తున్నారు. ఆనక పోలీసుల విచారణలో ఘాతుకానికి ఒడిగట్టిన వారి అనుమానాలు వాస్తవాలు కాదని తేలుతున్నా... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలో నివసించే పద్మ మానసిక స్థితి సరిగ్గా లేనికారణంగా కడుపున పుట్టిన అక్షర, సహస్రల్ని సంపులో పడేసి అంతం చేసింది. ఈ ఘటనతో ఆ కుటుంబం మొత్తం తీవ్రమైన షాక్‌లోకి వెళ్లిపోయింది. ఈస్ట్‌మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీలో నివసించే రజని అకారణంగా తన భర్తనే ‘అనుమానించింది’. కుమార్తెలు తివిష్క, అశ్వికల్ని గొంతుకోసి చంపేసింది. ఇంతటి ఘోరం చేసిన తర్వాత కూడా పోలీసుల ఎదుట బిడ్డలకు ‘విముక్తి’ కల్పించానంటూ చెప్పుకొచ్చింది. ఈ తరహా ఉదంతాల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా నిందితులుగా మారుతున్నారని పోలీసులు చెప్తున్నారు.
కనిపించని కిరాతకులెందరో...
ఇవన్నీ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరో సమాజానికి తెలిసే ఉదంతాలు. అలాకాకుండా చేయాల్సిన ‘పని’ చేసేసి... సమాజం దృష్టిలో మాత్రం గుట్టుగా బతికేస్తున్నా వారూ ఎందరో ఉంటున్నారు. లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో ఓ ఆడశిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవపంచనామా నేపథ్యంలోనే ఆ శిశువుకు ఉరివేసి, గుండెపై ఏదో వస్తువుతో బాది చంపేసినట్లు తేలింది. ఇలాంటి మృతదేహాలు నిత్యం నగరంలో ఏదో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. వీటిలోనూ కొన్ని కన్నవారు చేసినవే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారెవరో గుర్తించడం సాధ్యం కాక మిన్నకుండిపోవాల్సి వస్తోందంటున్నారు.
యాంటీ సోషల్ పర్సనాలిటీయే కారణం
ఈ తరహా విపరీత ధోరణులకు మనుషుల్లో పెరుగుతున్న యాంటీ సోషల్ పర్సనాలిటీ ప్రధాన కారణం. మరికొందరిలో ఉంటున్న మానసిక రుగ్మతలు (డిజార్డర్స్) సరైన సమయానికి గుర్తించలేకపోవడం, గుర్తించినా అవసరమైన స్థాయిలో వైద్యం, శ్రద్ధ తీసుకోని కారణంగా విపరీత చర్యలు జరుగుతున్నాయి. మీడియా, సినిమాల ప్రభావంతోనూ కొందరు స్త్రీలు పేగుబంధాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. - డాక్టర్ రాజశేఖర్, మానసిక నిపుణులు