saveera team
-
పదోతరగతి నుంచే మద్యపానం.. ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
సాక్షి, అనంతపురం: పదో తరగతి చదివే సమయం నుంచే ఉన్న మద్యపానం అలవాటు.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మద్యపానం అలవాటైపోయిన ఓ యువకుడికి.. దాని కారణంగా పాంక్రియాస్ (క్లోమం) బాగా పాడైపోయి, కుళ్లిపోయిన స్థితికి చేరుకోవడంతో ప్రాణాపాయం ఏర్పడింది. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో వ్యాపించడంతో శస్త్రచికిత్స చేసినా బతికే అవకాశాలు దాదాపు లేవనే బెంగళూరులోని పలు ఆస్పత్రుల వైద్యులు అసలు కేసు తీసుకునేందుకే ఇష్టపడలేదు. అలాంటి కేసులో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడమే కాక.. రోగి ప్రాణాలను విజయవంతంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్.మహ్మద్ షాహిద్ తెలిపారు.“హిందూపురానికి చెందిన 26 ఏళ్ల లోకేష్‌కు తాను పదోతరగతి చదివే సమయం నుంచి మద్యపానం అలవాటు ఉంది. కొంతమందిలో దానివల్ల మరీ అంత సమస్యలు రాకపోయినా, కొందరికి మాత్రం శరీర తత్వం కారణంగా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. లోకేష్‌కు పాంక్రియాస్ చుట్టూ నీరు చేరి, ఒక గోడలా తయారైపోవడమే కాక.. బాగా చీముపట్టి విపరీతమైన ఇన్ఫెక్షన్ (నెక్రోసిస్)కు దారితీసింది. అతడు బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ చదువుతూ వైద్యరంగంలోనే ఉన్నాడు. సమస్య వచ్చిన మొదట్లో ఇక్కడ చూపించుకున్నప్పుడు మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మనోజ్‌కు చూపించారు. ఆయన కొన్ని మందులు ఇచ్చి, శస్త్రచికిత్స అవసరం అవుతుందని చెప్పారు. దాంతో రోగి, అతడి బంధువులు బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ మూడు నాలుగు పెద్దపెద్ద ఆస్పత్రులకు తిరిగారు. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేయకపోతే బతికే అవకాశాలు దాదాపు ఉండవు. ఒకవేళ చేసినా, 60-70శాతం మంది చనిపోతారు. బతికేవారిలో కూడా జీవితాంతం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉండటంతో బెంగళూరు ఆస్పత్రులలో వైద్యులెవరూ ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉండటంతో పాటు గుండె రేటు కూడా గణనీయంగా పెరిగిపోయింది. రక్తపోటు పడిపోయింది. క్లోమం పూర్తిగా పాడైపోవడంతో దాన్ని తొలగించక తప్పలేదు. ఇన్ఫెక్షన్ ప్రేగులకు కూడా విస్తరించడంతో ముందు జాగ్రత్తగా స్టోమా చేశాం. దీన్ని మరో రెండు మూడు నెలల తర్వాత మళ్లీ లోపల పెట్టేస్తాం.ఈ శస్త్రచికిత్స తర్వాత లోకేష్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాంక్రియాస్‌ను తొలగించడం వల్ల భవిష్యత్తులో అతడికి కచ్చితంగా మధుమేహం వస్తుంది. ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ నియంత్రణకు టాబ్లెట్లు గానీ, ఇన్సులిన్ గానీ వాడాల్సి ఉంటుంది. మద్యపానానికి పూర్తిగా దూరం కావాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలి” అని డాక్టర్ మహ్మద్ షాహిద్ వివరించారు. -
కిమ్స్ సవీరాలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
సాక్షి, అనంతపురం: రాయలసీమలో అందులోనూ అనంతపురం ప్రాంతంలో అత్యున్నత వైద్యసేవలు అందిస్తామన్న తమ హామీని నిలబెట్టుకుంటూ.. కిమ్స్ సవీరాలోని వైద్యులు సమీప గ్రామం నుంచి వచ్చిన 58 ఏళ్ల హృద్రోగికి ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ)ని అమర్చి, అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇది ఈ ప్రాంతంలో అమర్చిన మొట్టమొదటి ఐసీడీ కావడం విశేషం. వెంట్రిక్యులర్ అరిథమియాస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి కారణంగా ఉన్నట్టుండి గుండె ఆగిపోయే ముప్పు ఉన్న రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ పరికరాన్ని ఉపయోగిస్తారు. కిమ్స్ సవీరాలోని గుండె వైద్యుల బృందంలోని కన్సల్టెంట్ ఇన్వేజివ్ కార్డియాలజిస్టు డాక్టర్ వి.రాకేష్ నాయక్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఈ పరికరాన్ని తమ నైపుణ్యం, అత్యంత కచ్చితత్వంతో అమర్చారు. కుమార్(58) అనే బాధితుడు తరచు తనకు మైకం కమ్ముతోందని చూపించుకోడానికి కిమ్స్ సవీరా ఆసుపత్రికి వచ్చారు. గతంలో అనేక చోట్ల వైద్యం చేయించుకున్నా.. మెదడుకు ఎంఆర్ఐ, ఈఈజీ వంటి పరీక్షలు చేసినా ఏమీ తేలలేదు. దాంతో చివరకు కిమ్స్ సవీరా ఆసుపత్రిని సంప్రదించగా.. ఆయనకు హైపర్ ట్రాఫిక్ అబ్ స్ట్రక్టివ్ కార్డియోమయోపతీ అనే వ్యాధి వల్ల గుండె కండరాలు (మయోకార్డియమ్) బాగా మందంగా అయిపోయినట్లు తేలింది. దానివల్ల గుండె రక్తాన్ని సరఫరా చేయడం కష్టం అయిపోతుంది. దీనివల్ల ఉన్నట్టుండి మరణం సంభవించే ప్రమాదం ఉండటంతో దాన్ని అరికట్టేందుకు ఐసీడీ అమర్చాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కిమ్స్ సవీరా ఆసుపత్రిలోని కన్సల్టెంట్ ఇన్వేజివ్ కార్డియాలజిస్టు డాక్టర్ వి.రమేష్ నాయక్ మాట్లాడుతూ.. గుండెవైద్యంలో కిమ్స్ సవీరా ఆసుపత్రి మంచి పురోగతిని సాధిస్తోంది. అనంతపురంలో ఐసీడీ అమర్చడం ఇదే తొలిసారి కావడంతో, ఇలా ఉన్నట్టుండి మరణం సంభవించే ప్రమాదమున్న చాలామంది రోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశంలో ఇలా ఉన్నట్టుండి గుండె ఆగి మరణించడం చాలా పెద్ద ప్రజారోగ్య సమస్య. పరుగు తీసేటప్పుడు, ఫుట్ బాల్ ఆడేటప్పుడు కూడా కొందరు ఉన్నట్టుండి మరణించడానికి ఇదే కారణం. ఇలాంటి రోగులకు డీఫిబ్రిలేటర్లను అమర్చడమే సరైన పరిష్కారం. ఇలాంటి మరణాలను అది చాలా సమర్థంగా తగ్గిస్తుంది' అని ఆయన వివరించారు. ఇదే కేసు గురించి కిమ్స్ సవీరా ఆసుపత్రిలోని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈ సమస్యను గుర్తించగానే రోగిని ముందుగా లూప్ ఈసీజీ పర్యవేక్షణలో ఉంచాం. అక్కడ 5 రోజుల పాటు ఆయన ఈసీజీని రికార్డు చేశాం. ఈ రోజుల్లో ఆయన తన రోజువారీ పనులు మామూలుగానే చేసుకున్నారు. ఈ పరీక్ష ఫలితాల్లో ఆయనకు వెంట్రిక్యులర్ టాకీకార్డియా (గుండె వేగంగా కొట్టుకోవడం - నిమిషానికి 280 సార్లు) 12 సెకండ్లపాటు ఉంటోందని గుర్తించాం. అందుకే ఆయనకు ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ అమర్చాలని నిర్ణయించాం. ఈ రోగికి డ్యూయల్ ఛాంబర్ ఐసీడీ అమరికను విజయవంతంగా పూర్తిచేశాం' అని తెలిపారు. కుటుంబ సభ్యుల ధన్యవాదాలు: రోగి కోలుకోవడంతో ఆయన కుటుంబసభ్యులు చాలా సంతోషించారు. మా నాన్నకి కొత్త జీవితాన్ని అందించినందుకు కిమ్స్ సవీరా వైద్య బృందానికి ధన్యవాదాలు. ఇంతకుముందు ఇలాంటి చికిత్స బెంగళూరు లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఉండేది. ఇప్పుడు అనంతపురంలోనూ ఈ చికిత్స అందుబాటులోకి రావడంతో, విలువైన కాలంతో పాటు బోలెడంత ఖర్చు కూడా రోగులకు ఆదా అవుతుంది అని బాధితుని కుమారుడు చెప్పారు. చికిత్సకు సంబంధించిన వివరాలకు 9963445785 మొబైల్ నెంబర్లో సంప్రదించవచ్చని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. -
సవీరా జట్టు ఘన విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురం నగర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఉద్యోగుల క్రికెట్ టోర్నీలో సవీరా జట్టు విజయం సాధించింది. ఆదివారం స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సవీరా , జేఎన్టీయూ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సవీరా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులో ఓపెనర్లు చంద్రశేఖర్ 55, నరేంద్ర 54 పరుగులతో రాణించారు. జేఎన్టీయూ జట్టు బౌలర్లలో రవి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన జేఎన్టీయూ జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. సవీరా జట్టు బౌలర్ బిస్మిల్లా 3 వికెట్లు సాధించాడు. దీంతో సవీరా జట్టు 112 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ క్రీడా పోటీలను అనంతపురం నగర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి విజయరాజు పర్యవేక్షించారు. ఈ నెల 13న మునిసిపాలిటీ జట్టు, మెడికల్, హెల్త్ జట్లు తలపడతాయని ఆయన చెప్పారు.