పెన్షన్ ఫండ్స్ ఉన్నాయా..?
నాకు ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. 7 శాతం వరకూ వడ్డీ వస్తుంది. వివిధ పథకాల్లో పొదుపు చేయగా మిగిలిన సొమ్ములను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. డెట్ ఫండ్స్‌కు సంబంధించి పన్నుల్లో మార్పుచేర్పులు జరిగిన నేపథ్యంలో నేను ఇలా చేయడం సరైనదైనా? తగిన సూచనలివ్వండి? - గోపాల్, వరంగల్
మిగులు నిధులను లిక్వ్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదే. ఎప్పుడైనా వాటి నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా రాబడులు కూడా బాగానే వస్తాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కంటే అధికంగానే వస్తాయి. లిక్విడ్ ఫండ్స్‌లో మొదటి ఐదేళ్లలో ఏడాదికి 8 శాతం చొప్పున రాబడులు వస్తాయి. 91 రోజుల మెచ్యూరిటీకి మించిన ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనంలో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టవు.
అందుకనే ఇతర డెట్ ఫండ్స్‌పై వడ్డీరేట్ల హెచ్చుతగ్గుల ప్రభావం ఉన్నట్లుగా లిక్విడ్ ఫండ్స్‌పై ఉండదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో స్థిరమైన రాబడులు వస్తాయి. కానీ కొన్ని ఇబ్బందులుంటాయి. ఉదాహరణకు యెస్ బ్యాంక్ రూ.1 లక్షకు మించిన బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు 7శాతం వడ్డీని ఇస్తోంది. రూ. లక్ష కంటే తక్కువగా ఉంటే 6 శాతం వడ్డీరేటునే ఇస్తోంది. ఈ బడ్జెట్లో లిక్విడ్ ఫండ్స్‌కు సంబంధించి పన్ను విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి.
ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసే వారికే ఈ మార్పులు వర్తిస్తాయి. ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌పై షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంది. వ్యక్తుల ఆదాయపు పన్న స్లాబ్‌ననుసరించి ఈ పన్ను ఉంటుంది. అందుకని మూడేళ్లలోపు మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే, మీరు మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి 10-30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
నేను, మావారు హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ నుంచి చెరొక కోటి రూపాయలకు టర్మ్ బీమా పాలసీలు తీసుకున్నాం. ఇది సరైన టెర్మ్ బీమా ప్లానేనా? ఈ ప్లాన్‌లోనే కొనసాగమంటారా? ఇన్వెస్ట్ చేయడానికి ఉత్తమమైన పెన్షన్ మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి? యాన్యుటీ ఆధారిత ప్లాన్లను ఎంచుకోవడం కరెక్టేనా? - మల్లిక, హైదరాబాద్
హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ అనేది ఉత్తమమైన ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీల్లో ఒకటి. సరైన మొత్తానికి టర్మ్ బీమా పాలసీని తీసుకోవడం సరైన నిర్ణయం. మీరు రిటైరయ్యేవరకూ, లేదా మీ కుటుంబంలో మీ వారసులు సంపాదన పరులయ్యేంత వరకూ ఈ ప్లాన్‌లో కొనసాగండి. రిటైర్మెంట్ ఫండ్స్‌గా పేరున్న రెండు మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. అయితే రిటైరైన తర్వాత ఇవి రెగ్యులర్ పింఛన్‌ను ఆఫర్ చేయడం లేదు. ప్రస్తుతానికైతే మార్కెట్లో స్పెషలైజ్డ్ పెన్షన్ ఫండ్ ఏదీ అందుబాటులో లేదు.
ఇలాంటి ఫండ్స్ గురించి బడ్జెట్లో ప్రస్తావించారు. అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ పెన్షన్ ఫండ్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి రావచ్చు. పెన్షన్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్‌పీపీ), ఎండోమెంట్ పెన్షన్ ప్లాన్స్‌ను పరిశీలించవచ్చని కొందరు చెబుతుంటారు. కానీ ఇది సరికాదు. యూనిట్ లింక్డ్ ప్లాన్స్ ఖరీదైనవే కాకుండా ఇవి ఇచ్చే రిటర్న్‌లు తక్కువగా ఉంటాయి.
ఇక ఎండోమెంట్ పెన్షన్ ప్లాన్ల వ్యయాలు, ఖర్చులు మీ రాబడులను తినేస్తాయి. రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడానికి ఉత్తమమైన వ్యూహం ఒకటుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఈ వ్యూహం. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు బీమా కంపెనీల నుంచి ఇమ్మిడియేట్ యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.
నా వయస్సు 42 సంవత్సరాలు. రానున్న పదేళ్లలో నేను రూ.75 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయగలను. ఒక ప్రైవేట్ బ్యాంక్ 9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. కొంతమంది మిత్రులేమో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. తగిన సూచనలివ్వండి?
- ప్రహ్లాదరావు, విజయవాడ
మీరు పొదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో సగభాగాన్ని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అయితే స్వల్పకాలానికే ఎఫ్డీ తీసుకోండి. మిగిలిన మొత్తాన్ని ఏదైనా బ్యాలెన్స్డ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఒక ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు చేయండి. ఇలాచేయడం వల్ల సిప్ ఎలా పని చేస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్ రాబడులు, ఎఫ్‌డీల రాబడులు, మ్యూచువల్ ఫండ్స్ పనితీరు తదితర అంశాలపై మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక బ్యాలెన్స్డ్ ఫండ్స్ విషయానికొస్తే, ఇవి సురక్షితమైనవి, వృద్ధికి అవకాశం కలవి. ఎఫ్డీలపై వచ్చే రాబడులతో పోల్చితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.