ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్త!
ముంబై: ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా మెలగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచించింది. ప్రత్యేకించి తన పేరుతో క్రెడిట్ కార్డులకు సంబంధించి జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, విదేశీ మారకపు నిధుల సేకరణ-నిల్వ లేదా ఇతర బ్యాంకింగ్ సేవల విషయంలో ఆర్‌బీఐ నేరుగా వినియోగదారులతో ఎటువంటి లావాదేవీలూ నిర్వహించదని, ఈ విషయంలో తన పేరుతో వచ్చే ఎటువంటి ఆఫర్లనూ విశ్వసించవద్దని ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
అటువంటి ఆఫర్లను విశ్వసిస్తే, తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతారని సైతం సూచించింది. ఒకసారి ఆయా ఆఫర్లకు సంబంధించి లావాదేవీలు జరిపితే... మోసపోయిన డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలకు సంబంధించి ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీస్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కి ఫిర్యాదు చేయాలని సూచించింది.