ఆటకు వైకల్యం దాసోహం
► దివ్యాంగుల క్రికెట్లో రాణిస్తున్న సయ్యద్ నూరుల్ హుదా
► అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
► గుర్తించని ప్రభుత్వం
అనంతపురం: అనంతపురానికి చెందిన అయూబ్, ఖాతూన్బీ దంపతుల కుమారుడు సయ్యద్ నూరుల్ హుదాకు పుట్టుకతోనే కుడికాలు లోపం ఉంది. చూసేందుకు సాధారణ యువకుడిగా కనిపించినా.. ఎడమకాలి కన్నా కుడికాలు పొట్టిగా ఉండడంతో అందరిలా అతను నడవలేరు. సోదరుడు ఆసిఫ్బాషా సహకారంతో క్రికెట్ ఆడడం ప్రారంభించిన నూరుల్ హుదా... పదో తరగతి పూర్తి అయిన తర్వాత ఐటీఐలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.
2007లో జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 2012లో తండ్రి మరణంతో కొంతకాలం క్రికెట్కు దూరమయ్యారు. తర్వాత ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అందించిన స్ఫూర్తితో తన కెరీర్ను ప్రారంభించి, అతి తక్కువ కాలంలోనే ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ జట్టులో స్థానం పదిలం చేసుకున్నారు. 2016లో జాతీయ జట్టులో, 2017లో భారత జట్టులో బెస్ట్ క్రికెటర్గా రాణించారు.
ఆటలో ప్రతిభ ఇలా..
2013లో బెంగుళూరులో జరిగిన మ్యాచ్లో 30 బంతుల్లో 60 పరుగులు చేయడంతో ప్రత్యేక గుర్తింపు లభించింది. అదే ఏడాది దివ్యాంగుల క్రికెట్ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ముంబయిలోని జింఖానా మైదానంలో నిర్వహించిన మ్యాచ్లో మహారాష్ట్ర జట్టుపై 9 బంతుల్లో 35 పరుగులు చేయడం ద్వారా జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. 2016లో కేరళతో జరిగిన మ్యాచ్లో కేవలం 75 బంతుల్లో 153 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
అదే ఏడాది డిసెంబర్ 20 నుంచి 22 వరకు వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన అంతర్ జిల్లాల దివ్వాంగుల క్రికెట్ టోర్నీలో వైఎస్సార్ కడప జట్టుపై 21 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 81 పరుగులు సాధించారు. గుంటూరులో జరిగిన దివ్యాంగుల టోర్నీలో నాలుగు మ్యాచ్లు ఆడిన నూరల్ హుదా మొత్తం 210 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్నారు.
ప్రభుత్వం గుర్తించడం లేదు..
2007 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఆటగాడిగా గుర్తింపు పొందాను. ఇందుకు ఎన్నో ధ్రువీకరణపత్రాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం గుర్తించకపోవడంతో నేను సాధించిన సర్టిఫికెట్లన్నీ చెత్తకాగితాల్లా మారిపోయాయి. కనీసం ప్రశంసించేవారు కూడా లేరు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నా.. కనీసం ఒక్క సెంట్ స్థలం కూడా ప్రభుత్వం ఇచ్చి ప్రోత్సహించలేదు. కేవలం దివ్యాంగుడిని కావడం వల్లనే ఇంత నిరాదరణ ఎదురవుతోంది.
– సయ్యడ్ నూరుల్ హుదా, క్రికెటర్, అనంతపురం