కమీషన్‌కు బ్యాంకు క్యాషియర్ కక్కుర్తిపడి..
చామరాజనగర్: ప్రజలు కరెన్సీ కోసం క్యూలలో గంటల తరబడి నిల్చుని కష్టాలు పడుతుంటే.. కొందరు బ్యాంకు అధికారులు కమీషన్‌కు కక్కుర్తిపడి అడ్డదారుల్లో నోట్ల మార్పిడి చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా కొల్లెగల్ ఎస్బీఎం బ్రాంచ్ క్యాషియర్ పరశివమూర్తి దాదాపు కోటి రూపాయల విలువైన పాతనోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇచ్చాడు. ఇందుకు 30 శాతం కమీషన్ అంటే 30 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడు.
గత ఆదివారం సాయంత్రం ఆయన బ్యాంకుకు వచ్చి అక్రమాలకు పాల్పడ్డాడు. బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో క్యాషియర్‌ను సస్పెండ్ చేశారు. తప్పు చేసినట్టు పరశివమూర్తి ఉన్నతాధికారుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. పోలీసులు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని, విచారణ చేస్తున్నారు.