school calendar
-
వినూత్నంగా స్కూల్ క్యాలెండర్
సాక్షి, అమరావతి: విద్యార్థులను పాఠ్యాంశాలతోపాటు పాఠ్యేతర అంశాల్లోనూ తీర్చిదిద్దేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఓ సరికొత్త అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తోంది. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి బాటలువేసే పలు వినూత్న కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. విద్యార్థుల్లో ప్రమాణాల పెంపు విషయంలో టీచర్లతో పాటు తల్లిదండ్రులు, స్థానిక సంస్థలు, కమ్యూనిటీలకు భాగస్వామ్యం ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, నైతిక, ఆధ్యాతి్మక పరంగా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఇందులో పలు అంశాలను వివరించారు. అలాగే, విద్యార్థుల రోజువారీ ప్రణాళికల్లో రంగోత్సవం, కళా ఉత్సవ్, దీక్షా యాప్ వినియోగం, యూత్, ఎకో క్లబ్ యాక్టివిటీ, స్కూల్ మ్యాగజైన్ నిర్వహణ వంటి కార్యక్రమాలనూ నిర్వహించాల్సి ఉంటుంది. స్కూల్ పెర్ఫార్మెన్సు రిజిస్టర్ల ఏర్పాటు ప్రతి స్కూలులో అకడమిక్ పెర్ఫార్మెన్స్ రిజిస్టర్లను నిర్వహించాలి. పరీక్ష వివరాలు, విద్యార్థుల మార్కులను అందులో నమోదుచేయాలి. విద్యార్థుల సంఖ్య, పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలతో ప్రత్యేక రికార్డులు నిర్వహించాలి. టీచర్లు ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. పాఠ్యబోధన ఎలా సాగుతోందో తెలుసుకునేలా క్లాస్ అబ్జర్వేషన్ రిజిస్టర్ పెట్టాలి. స్కూలుకు సందర్శకులు వస్తే వారి అభిప్రాయాలు నమోదు చేయాలి. స్కూలులోని మౌలిక సదుపాయాలు, వాటి స్థితిగతులపైనా రికార్డులు నిర్వహించాలి. నిర్ణీత బరువులోనే స్కూల్ బ్యాగ్ విద్యార్థి పుస్తకాల బ్యాగ్ బరువు నిరీ్ణత ప్రమాణాల్లోనే ఉండాలి. అవి పెరగకుండా చర్యలు తీసుకోవాలి. 1, 2 తరగతుల వారికి 1.5 కిలోలు.. 3–5 తరగతుల వారికి 2–3 కిలోలు.. 6–8 తరగతుల వారికి 4 కిలోలు.. 8–9 తరగతుల వారికి 4.5 కిలోలు.. 10వ తరగతి వారికి 5 కిలోలు మాత్రమే బ్యాగు బరువు ఉండాలని ఎస్సీఈఆర్టీ సూచిస్తోంది. ఉపాధ్యాయుల పాత్ర ఇలా.. తరగతి గదిలో విద్యార్థులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేలా బోధన సాగించాలి. మూల్యాంకన పద్ధతులను అనుసరించి విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో గుర్తించి వారికి తగిన సహకారం అందించాలి. పేరెంట్స్ కమిటీలను సమావేశపరిచి వారికి విద్యార్థుల స్థితిగతులను, జిల్లాస్థాయిలోని ప్రమాణాల గురించి వివరించాలి. విద్యార్థులు అంతకుముందు తరగతుల అంశాలను వినకపోయి ఉంటే వాటిని ప్రత్యేకంగా బోధించాలి. తల్లిదండ్రుల పాత్ర ఇలా.. విద్యార్థులకు ఇచ్చే హోంవర్క్, వాట్సప్ పాఠాలు, ఇతర ప్రక్రియలను ఇంటి నుంచి చేసేలా సహకరించాలి. దీక్షా యాప్ ద్వారా బోధనాంశాలపై అవగాహన పెంచుకునేలా చేయాలి. ఆటపాటలు, పుస్తక పఠనం వంటి పాఠ్యేతర అంశాలనూ చేయించాలి. ఇక స్థానిక పంచాయతీ, మున్సిపాలీ్ట, తదితర సంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలనూ క్యాలెండర్లో వివరించారు. కమ్యూనిటీ యాక్టివిటీల కింద రీడింగ్ మేళాలు వంటివి నిర్వహించాలి. -
పలు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలు తర్వాత పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. 9,10, ఇంటర్మీడియెట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు కోవిడ్ నిబంధనల ప్రకారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌లో 21 నుంచి ఇక సర్కార్ బడుల టీచర్లు 50 శాతం మంది హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు సగం మంది చొప్పున రోజు మార్చి రోజు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కంటైన్మెంట్ జోన్లలో పాఠశాలలు మూసే ఉంటాయి. (చదవండి: కేసుల కంటే రికవరీలే ఎక్కువ) దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తరువాత మార్చి 25 నుంచి దేశంలోని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డ సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, గత 24 గంటల్లో 92,605 కొత్త కేసులతో దేశంలో కరోనా వైరస్ కేసులు 54 లక్షలను అధిగమించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. -
ఉద్యమానికి ఉపాధ్యాయులు సై
ఏలూరు సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ క్యాలెండర్‌ను విస్మరించి సొంత అజెండాతో ఉపాధ్యాయులపై పనిభారం మోపుతూ ఇష్టారాజ్యంగా జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు వ్యవహరిస్తున్నారంటూ 12 ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాయి. వేలాది మంది ఉపాధ్యాయులతో గురువారం స్థానిక డీఈవో కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉపాధ్యాయులు డీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలు డీఈవోతో జరిపిన చర్చల్లో జేఏసీ ఇచ్చిన నోటీసులో పేర్కొన్న 8 అంశాల్లో 7 అంశాలపై డీఈవో సానుకూలంగా స్పందించారు. బేస్మెంట్ పరీక్ష విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. బేస్మెంట్ పరీక్షను రద్దు చేయాలని ఉపాధ్యాయులు పట్టుబట్టగా డీఈవో ససేమీరా అన్నారు. మరోదఫా జరిపిన చర్చలతో జేఏసీ నాయకులు డీఈవోను ఒప్పించారు. ధర్నా శిబిరం వద్ద డిమాండ్లను ఒప్పుకున్నట్టుగా ప్రకటించేందుకు జేఏసీ నేతలు డీఈవోను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బడిగంటల కార్యక్రమంపై ఉపాధ్యాయులు మరోసారి పట్టుబట్టడంతో డీఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేజి నుంచి దిగివెళ్లిపోయారు. చర్చలు విఫలం కావడంతో ఉద్యమానికి సిద్ధపడుతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు. 2న జిల్లాలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో పనిచేయాలని, 3 నుంచి రిలే నిరాహారదీక్షలు, 7 నుంచి నిరవధిక నిరాహారదీక్షలు చేస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. డీఈవోతో జరిగిన చర్చల్లో ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి, జాక్టో చైర్మన్ ఎం.కమలాకర్, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్వీ సాగర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎస్ హరనా«ద్, కార్యదర్శి సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ధర్నా శిబిరానికి బి.గోపీమూర్తి, పి.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ధర్నాలో ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అధికారుల మెప్పు కోసం రకరకాల కార్యక్రమాలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయటం సమంజసం కాదన్నారు. డీఈవో వైఖరిపై శాసనమండలిలో విద్యశాఖ కమిషనర్‌తో చర్చిస్తామని తెలిపారు. ఏపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు బాపిరాజు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్‌సాబ్జీ, పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి పి.ఆంజనేయులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ సుబ్బారావు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌వీవీఎం శ్రీనివాస్, గుగ్గులోతు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ రామకృష్ణ, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.సుధీర్, డీటీఎఫ్ నాయకులు కె.నరహరి, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.