ఉద్యమానికి ఉపాధ్యాయులు సై | teachers agitation | Sakshi
Sakshi News home page

ఉద్యమానికి ఉపాధ్యాయులు సై

Published Fri, Sep 2 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

ఉద్యమానికి ఉపాధ్యాయులు సై

ఉద్యమానికి ఉపాధ్యాయులు సై

ఏలూరు సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ క్యాలెండర్‌ను విస్మరించి సొంత అజెండాతో ఉపాధ్యాయులపై పనిభారం మోపుతూ ఇష్టారాజ్యంగా జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు వ్యవహరిస్తున్నారంటూ 12 ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాయి. వేలాది మంది ఉపాధ్యాయులతో గురువారం స్థానిక డీఈవో కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉపాధ్యాయులు డీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలు డీఈవోతో జరిపిన చర్చల్లో జేఏసీ ఇచ్చిన నోటీసులో పేర్కొన్న 8 అంశాల్లో 7 అంశాలపై డీఈవో సానుకూలంగా స్పందించారు. బేస్‌మెంట్‌ పరీక్ష విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. బేస్‌మెంట్‌ పరీక్షను రద్దు చేయాలని ఉపాధ్యాయులు పట్టుబట్టగా డీఈవో ససేమీరా అన్నారు. మరోదఫా జరిపిన చర్చలతో జేఏసీ నాయకులు డీఈవోను ఒప్పించారు. ధర్నా శిబిరం వద్ద డిమాండ్లను ఒప్పుకున్నట్టుగా ప్రకటించేందుకు జేఏసీ నేతలు డీఈవోను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బడిగంటల కార్యక్రమంపై ఉపాధ్యాయులు మరోసారి పట్టుబట్టడంతో డీఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేజి నుంచి దిగివెళ్లిపోయారు. చర్చలు విఫలం కావడంతో ఉద్యమానికి సిద్ధపడుతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు. 2న జిల్లాలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో పనిచేయాలని, 3 నుంచి రిలే నిరాహారదీక్షలు, 7 నుంచి నిరవధిక నిరాహారదీక్షలు చేస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. డీఈవోతో జరిగిన చర్చల్లో ఫ్యాప్టో చైర్మన్‌ పి.బాబురెడ్డి, జాక్టో చైర్మన్‌ ఎం.కమలాకర్, ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్‌వీ సాగర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరనా«ద్, కార్యదర్శి సీహెచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ధర్నా శిబిరానికి బి.గోపీమూర్తి, పి.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ధర్నాలో ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అధికారుల మెప్పు కోసం రకరకాల కార్యక్రమాలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయటం సమంజసం కాదన్నారు. డీఈవో వైఖరిపై శాసనమండలిలో విద్యశాఖ కమిషనర్‌తో చర్చిస్తామని తెలిపారు. ఏపీయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు బాపిరాజు, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి షేక్‌సాబ్జీ, పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి పి.ఆంజనేయులు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ సుబ్బారావు, ఏపీటీఎఫ్‌ 1938 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌వీవీఎం శ్రీనివాస్, గుగ్గులోతు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ రామకృష్ణ, వైఎస్సార్‌ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జి.సుధీర్, డీటీఎఫ్‌ నాయకులు కె.నరహరి, ఎన్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement