పాఠశాలల మూసివేతపై ఆందోళనలు
అనంతపురం అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను చేపడతామని దళిత ప్రజా సంఘాల వేదిక సమావేశంలో నాయకులు తీర్మానించారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో దళిత ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నల్లప్ప అధ్యక్షత వహించారు. నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉందని హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేయలనుకోవడం దుర్మార్గపు చర్యన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా పేద దళిత, గిరిజన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. పాఠశాలల మూసివేయడమంటే ఈ వర్గాలను విద్యకు దూరం చేయడమేనన్నారు.
ఒకవైపు వసతి గృహాలను, మరోవైపు పాఠశాలలు మూసివేయడం వల్ల పేదలు నిరక్ష్యరాస్యులగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. సమావేశంలో ప్రజా పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సత్యబోస్, యూటీఎప్ జిల్లా అధ్యక్షుడు ఎం.సుధాకర్, సి.కె.నాగేంద్రబాబు, బీఎస్పీ నాయకులు గద్దల నాగభూషణం, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.శంకర్, మాదిగ దండోరా రాష్ట్ర నాయకుల మధుఉ, ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు రాజగోపాల్, దథిత హక్కుల పోరాట సమితి నాయకులు హరి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సూర్యచంద్రయాదవ్, డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సి.ఆంజనేయులు, కేవీపీఎస్ నాయకులు వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.