'రాష్ట్రానికి సాయం చేస్తామని అమిత్ షా హామీ'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి ఏపీకి అన్నివిధాలా సాయం చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హామీ ఇచ్చారని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో అమిత్ షాతో సుజనాచౌదరి భేటీ అయ్యారు. అనంతరం సుజనాచౌదరి విలేకర్లతో మాట్లాడుతూ... విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అమిత్ షాను కోరినట్లు సుజనాచౌదరి వివరించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన సాధారణ ఆర్థిక బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా, అధిక నిధులు తదితర అంశాలు లేకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం, వివిధ పార్టీల నాయకులతోపాటు ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
ఏపీ ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్కొన్న బీజేపీ నాయకులు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడంతోపాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధానికి నిధులు తీసుకురావడంపై కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు.