కార్పొరేట్, కాషాయ శక్తుల నుంచి విద్యారంగాన్ని కాపాడాలి
‘విద్యా పోరాట యాత్ర’ సభలో వక్తలు
హైదరాబాద్: ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కాషాయీకరణ నుంచి విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు. విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో అఖిల భారత విద్యా పోరాట యాత్ర నిర్వహించారు. అనంతరం నిజాం కళాశాల గ్రౌండ్లో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు కె. నారాయణ, సీపీఎం శాసన సభానేత సున్నం రాజయ్య, న్యూ డెమోక్రసీ నేత వెంకటరామయ్య, విద్యావేత్త చుక్కారామయ్య, విరసం నేత వరవరరావు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
సీపీఐ నేత కె.నారాయణ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కార్పొరేట్ సంస్థలను బతికించడానికే దోహదపడుతుందని విమర్శించారు. ఈ పథకం లేకుంటే సగం కళాశాలలు మూతపడేవన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, 108 పథకాలతో విద్య, వైద్య రంగాలు నిర్వీర్యమయ్యాయని విరసం నేత వరవరరావు అన్నారు. కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాల్లో చొరబడుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక విద్యాసంస్థల అధిపతికి మంత్రి పదవి ఇవ్వడమే ఇందుకు ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యాపరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్ష వర్గం సభ్యులు ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుండే మాట్లాడుతూ.. శాస్త్రీయ విద్యా విధానం కోసం తాము పోరాటం చేస్తుంటే మోదీ ప్రభుత్వం కాషాయీకరణను వేగవంతం చేస్తుందని విమర్శించారు.