Scrutiny Assessment
-
స్క్రూటినీ అసెస్మెంట్లో బ్యాంక్ వ్యవహారాలూ కీలకమే..
స్క్రూటినీ అసెస్మెంట్ సమయంలో అధికారులకు ఎన్నో వివరాలు అందించాల్సి ఉంటుంది. అధికారులు ముఖ్యంగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు వివరాలను అడుగుతారు. అందులో ముఖ్యంగా జీతం ద్వారా వచ్చే ఆదాయం, ఇంటి మీద వచ్చే అద్దె, వ్యాపారం/ వృత్తి మీద వచ్చే లాభనష్టాలు, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు అనే ఐదు అంశాలు ఉంటాయి. ఇవి కాకుండా పన్నుకి సంబంధం లేని అంశాల వివరాలను కూడా అడగొచ్చు. వీటిల్లో వ్యవసాయం మీద వచ్చే ఆదాయం, డివిడెండ్లు, భవిష్య నిధి వసూళ్లు, ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ సందర్భంలో వచ్చే ప్రయోజనాలు, జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ, బహుమతులు వంటి అంశాలు ఉంటాయి. ఆదాయానికి సంబంధించని వివరాలను కూడా అడగొచ్చు. ఇందులో రుణాల వసూళ్లు, విదేశాల నుంచి మీ కుటుంబ సభ్యులు పంపిన మొత్తం, అప్పులు, రుణాలు, చిట్‌ఫండ్ కంపెనీల్లో పాడగా వచ్చిన మొత్తం ఇలా ఎన్నో ఉంటాయి. అందుకనే అధికారులు మీ బ్యాంకు అకౌంట్ వివరాలను అడుగుతారు. ఆర్థిక సంవత్సరం మొదలు చివరి వరకు అన్ని రోజుల్లో జరిగిన వ్యవహారాలకు మీరు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారుల దగ్గరకు వెళ్లేసరికి మీరు ఏ ఏ బ్యాంకుల్లో మీకు అకౌంట్లు ఉన్నాయి, వాటి నంబర్లు, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, జరిగిన ట్రాన్సాక్షన్లు వంటి అంశాలపై కసరత్తు చేయాలి. ఒక్కో బ్యాంక్ అకౌంట్లోని ట్రాన్సాక్షన్లను విశ్లేషించండి. ప్రతి దానికి వివరణ తయారు చేసుకోండి. అది ఆదాయం అయితే ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో చెప్పండి. ఇది వరకే ఆదాయాన్ని డిక్లేర్ చేసి ఉంటే పర్లేదు. లేకపోతే ఇప్పుడు వివరణ ఇవ్వండి. ఆదాయంలో కలపండి. పన్ను భారం చెల్లించండి. వడ్డీ పడొచ్చు. సాధారణంగా చాలా మంది వారి బ్యాంక్ అకౌంట్లలో వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న వడ్డీకి రూ.10,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. అన్ని బ్యాంక్ అకౌంట్లలో వచ్చిన వడ్డీని కూడా ఆదాయం కింద ప్రకటించండి. ప్రతి ట్రాన్సాక్షన్‌కి వివరణ ఇవ్వాలి. అది జమ అయినా.. చెల్లింపు అయినా. సరైన వివరణ ఇవ్వకపోతే ఆ మొత్తాన్ని ఆదాయంగా పరిగణించే ప్రమాదం ఉంది. జమ విషయంలో వ్యవహారం జరిగి ఉండాలి. అలాగే ఇచ్చిన వ్యక్తి నిజమైన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చే సామర్థ్యం ఉండాలి. ఇక చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అబద్దపు చెల్లింపులను ఖర్చులుగా పరిగణించరు. ఈ మేరకు ఆదాయం పెరిగినట్లే. లాభం తగ్గించుకోవడానికి లేనిపోని ఖర్చులను రాసుకోవద్దు. వాటిని అధికారులు ఒప్పుకోరు. జమల విషయంలో పన్ను చెల్లిస్తాం కదా అని సరిపెట్టుకుంటే సరిపోదు. డెబిట్ల విషయంలో ఆదాయం ఏర్పడవచ్చు. ఉదాహరణకు లక్ష రూపాయల జమకి సరైన వివరణ ఇచ్చారనుకోండి. సరిపోతుంది. అలా కాకుండా ఆ లక్ష రూపాయలు డెబిట్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లకు వెళ్లిందనుకోండి. దీని మీద ఆదాయం పన్నుకి గురి అవుతుంది. మీరు ఉదాహరణకు మీ అబ్బాయి అమెరికా నుంచి పంపిన కోటి రూపాయలతో ఇల్లు కొన్నారనుకోండి. ఆ ఇళ్లు అద్దెకిస్తే ఆదాయం వస్తుంది కదా... ఇలా బ్యాంక్ ఖాతాలోని ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఆలోచించి వివరణ ఇవ్వండి. స్క్రూటినీ వ్యవహారాల్లో బ్యాంక్ వ్యవహారాలు ముఖ్యమైనవి. -
స్క్రూటినీ అసెస్మెంట్కు సిద్ధమేనా?
ఇంకొక నెల రోజుల సమయం ఉంది. ట్యాక్స్ ఆడిట్స్, రిటర్న్స్, రిపోర్ట్స్ మూడింటి దాఖలుకూ ఈ నెల 31తో గడువు తీరుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక పెద్ద పర్వం సమాప్తమవుతోంది. అయితే ఇంతలోనే 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్క్రూటినీ నోటీసుల జారీ ప్రక్రియ మొదలైంది. 2013-14 ఆర్థిక సంవత్సరం లావాదేవీలు 2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ మీరు మీ ఆదాయ పన్ను రిటర్నులను సకాలంలోనే వేసి ఉంటారు. దీనికి సంబంధించిన రిఫండ్ కూడా వచ్చే ఉంటుంది. అయినా కూడా ఆదాయ పన్ను శాఖ వారు కొన్ని కేసులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికను కంప్యూటర్ ద్వారా చేస్తారు. ఇలా చేయటాన్ని కంప్యూటర్ అసిస్టెడ్ స్క్రూటినీ సెలెక్షన్ (సీఏఎస్ఎస్) అంటారు. కొన్ని ప్రాతిపదికల ఆధారంగా ఈ ప్రక్రియ ఉం టుంది. ఎంపిక చేసిన తర్వాత అధికారులు నోటీసులు పంపుతారు. మీకు స్క్రూటినీ నోటీసు వచ్చిందా? మీ కేసు స్క్రూటినీకి ఎంపికయితే ఇప్పటికే నోటీసు మీ చేతికి వచ్చి ఉంటుంది. వచ్చిన నోటీసులను స్వీకరిం చండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించొద్దు. అలా తిరస్కరించటం వల్ల నాలుగు రోజులు వృథా అవుతుందే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. నోటీసుకి సమాధానమివ్వండి... మీకు వచ్చిన నోటీసులో మీరు కానీ, మీ అనుమతి పొందిన వ్యక్తి కానీ అధికారుల్ని ఎప్పుడు కలవాలనే విషయం ఉంటుంది. దీంతోపాటు నోటీసులో వారు అడిగిన సమాచారం, లెక్కలు, సాక్ష్యాలు ఇవ్వమని ఉంటుంది. ఇవ్వన్నీ కూడా ఆయా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీల గురించే. మీరు సంబంధిత అధికారులను స్వయంగా కానీ, మీ అనుమతి పొందిన వ్యక్తిని పంపించి కానీ విషయాన్ని తెలుసుకోవచ్చు. అవసరమైతే వారు అడిగిన అన్ని వివరాలను ఇవ్వడానికి సమయాన్ని అడగవచ్చు. ఇలా మొదటి నోటీసుకు సమాధానమిస్తే అధికారుల దృష్టిలో మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీరు చట్టానికి సహకరించిన వారు అవుతారు. దీంతో వారు మీరు అడిగినంత సమయాన్ని ఇవ్వడమే కాకుండా మీకు సహకరిస్తారు. తర్వాతేంటి? ఆ తర్వాత మొదలౌతుంది అసెస్మెంట్ ప్రక్రియ. ఈ లోపల మీరు గతంలో దాఖలు చేసిన రిటర్ను నఖళ్లన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆదాయ లెక్కింపుల్లో వేతనం, ఇంటి అద్దె, వ్యాపారం, మూల ధన లాభాలు, ఇతర మార్గాల నుంచి వచ్చిన ఆదాయం అనే ఐదు అంశాలు ఉంటాయి. ఇవి కాకుండా వ్యవసాయం మీద ఆదా యం, డివిడెండ్ వంటి పన్నుకి సంబంధించని ఆదాయాలూ ఉంటాయి. సాధారణంగా అసెస్మెంట్ వీటి పరిధిలోనే జరుగుతుంది. అందులో మీరు క్లెయిమ్ చేసిన తగ్గింపులు/మినహాయింపులుంటాయి. వీటన్నిటికీ సంబంధించిన అన్ని వివరాలు, కాగితాలు, అకౌంట్ పుస్తకాలు, బ్యాంక్ స్టేట్మెంట్స్, బిల్లులు, ముందస్తు పన్ను చలానాలు, టీడీఎస్ పత్రాలు, ఫారమ్ 16/16ఏ ఇలా ఎన్నో వాటిని సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కాకుండా ఇతర వివరాలను అడగవచ్చు. మీరు అధికారులకు ఇచ్చిన ప్రతి డాక్యుమెంట్ నఖలును మీ దగ్గర ఉంచుకోండి. పైవిధంగా సహకరిస్తూ ఉంటే మీ అసెస్మెంట్ సజావుగా అవుతుంది. ట్యాక్సేషన్ నిపుణులు 1. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి 2. కె.వి.ఎన్ లావణ్య