స్క్రూటినీ అసెస్‌మెంట్‌కు సిద్ధమేనా?
ఇంకొక నెల రోజుల సమయం ఉంది. ట్యాక్స్ ఆడిట్స్, రిటర్న్స్, రిపోర్ట్స్ మూడింటి దాఖలుకూ ఈ నెల 31తో గడువు తీరుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక పెద్ద పర్వం సమాప్తమవుతోంది. అయితే ఇంతలోనే 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్క్రూటినీ నోటీసుల జారీ ప్రక్రియ మొదలైంది.
2013-14 ఆర్థిక సంవత్సరం లావాదేవీలు
2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ మీరు మీ ఆదాయ పన్ను రిటర్నులను సకాలంలోనే వేసి ఉంటారు. దీనికి సంబంధించిన రిఫండ్ కూడా వచ్చే ఉంటుంది. అయినా కూడా ఆదాయ పన్ను శాఖ వారు కొన్ని కేసులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికను కంప్యూటర్ ద్వారా చేస్తారు. ఇలా చేయటాన్ని కంప్యూటర్ అసిస్టెడ్ స్క్రూటినీ సెలెక్షన్ (సీఏఎస్‌ఎస్) అంటారు. కొన్ని ప్రాతిపదికల ఆధారంగా ఈ ప్రక్రియ ఉం టుంది. ఎంపిక చేసిన తర్వాత అధికారులు నోటీసులు పంపుతారు.
మీకు స్క్రూటినీ నోటీసు వచ్చిందా?
మీ కేసు స్క్రూటినీకి ఎంపికయితే ఇప్పటికే నోటీసు మీ చేతికి వచ్చి ఉంటుంది. వచ్చిన నోటీసులను స్వీకరిం చండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించొద్దు. అలా తిరస్కరించటం వల్ల నాలుగు రోజులు వృథా అవుతుందే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.
నోటీసుకి సమాధానమివ్వండి...
మీకు వచ్చిన నోటీసులో మీరు కానీ, మీ అనుమతి పొందిన వ్యక్తి కానీ అధికారుల్ని ఎప్పుడు కలవాలనే విషయం ఉంటుంది. దీంతోపాటు నోటీసులో వారు అడిగిన సమాచారం, లెక్కలు, సాక్ష్యాలు ఇవ్వమని ఉంటుంది. ఇవ్వన్నీ కూడా ఆయా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీల గురించే. మీరు సంబంధిత అధికారులను స్వయంగా కానీ, మీ అనుమతి పొందిన వ్యక్తిని పంపించి కానీ విషయాన్ని తెలుసుకోవచ్చు. అవసరమైతే వారు అడిగిన అన్ని వివరాలను ఇవ్వడానికి సమయాన్ని అడగవచ్చు. ఇలా మొదటి నోటీసుకు సమాధానమిస్తే అధికారుల దృష్టిలో మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీరు చట్టానికి సహకరించిన వారు అవుతారు. దీంతో వారు మీరు అడిగినంత సమయాన్ని ఇవ్వడమే కాకుండా మీకు సహకరిస్తారు.
తర్వాతేంటి?
ఆ తర్వాత మొదలౌతుంది అసెస్‌మెంట్ ప్రక్రియ. ఈ లోపల మీరు గతంలో దాఖలు చేసిన రిటర్ను నఖళ్లన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆదాయ లెక్కింపుల్లో వేతనం, ఇంటి అద్దె, వ్యాపారం, మూల ధన లాభాలు, ఇతర మార్గాల నుంచి వచ్చిన ఆదాయం అనే ఐదు అంశాలు ఉంటాయి. ఇవి కాకుండా వ్యవసాయం మీద ఆదా యం, డివిడెండ్ వంటి పన్నుకి సంబంధించని ఆదాయాలూ ఉంటాయి. సాధారణంగా అసెస్‌మెంట్ వీటి పరిధిలోనే జరుగుతుంది. అందులో మీరు క్లెయిమ్ చేసిన తగ్గింపులు/మినహాయింపులుంటాయి.
వీటన్నిటికీ సంబంధించిన అన్ని వివరాలు, కాగితాలు, అకౌంట్ పుస్తకాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, బిల్లులు, ముందస్తు పన్ను చలానాలు, టీడీఎస్ పత్రాలు, ఫారమ్ 16/16ఏ ఇలా ఎన్నో వాటిని సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కాకుండా ఇతర వివరాలను అడగవచ్చు. మీరు అధికారులకు ఇచ్చిన ప్రతి డాక్యుమెంట్ నఖలును మీ దగ్గర ఉంచుకోండి. పైవిధంగా సహకరిస్తూ ఉంటే మీ అసెస్‌మెంట్ సజావుగా అవుతుంది.
ట్యాక్సేషన్ నిపుణులు
1. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి
2. కె.వి.ఎన్ లావణ్య