ఓట్ల లెక్కింపును పర్యవేక్షించిన కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్ : నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో సోమవారం నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును కలెక్టర్ లోకేష్‌కుమార్ పర్యవేక్షించారు. ఉదయం 8 గంటలకే కలెక్టర్‌తోపా టు ఎస్పీ సెంథిల్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ విజయేందిర కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల నుంచి లెక్కింపు కేంద్రాలకు తరలించడం, ఓట్ల లెక్కింపు, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సీటింగ్ బారికేడ్, రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన చేపట్టేలా ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
గెలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారుల ద్వారా ఫారం-20లో డిక్లరేషన్ అందించడం, ఫలితాల నివేదికలను ఎన్నికల కమిషన్‌కు పంపించడం తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్, జేసీ, జెడ్పీ సీఈఓ ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లను కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి చేశారు. రౌండ్ల వారీగా వచ్చిన ఫలితాలను సమాచారశాఖ ఏడీ వెంకటేశ్వర్లు, డీపీఆర్వో తిమ్మప్పలు ఎప్పటికప్పుడు వార్డుల వారీగా ఏర్పాటు చేసిన బోర్డులో నమోదు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. కౌంటింగ్ విజయవంతంగా సాగేందుకు సహకరించిన అభ్యర్థులకు, పార్టీలకు, ఏజెంట్లకు, మీడియాకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.