సహారా ఆస్తుల అమ్మకంలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ సంస్థల సాయం!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా... సహారా ఆస్తుల అమ్మకంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ- ఎస్బీఐ క్యాప్, హెచ్డీఎఫ్సీ రియల్టీ సహాయాన్ని తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. అమ్మకానికి సంబంధించి ఆస్తుల గుర్తింపు, వాటికి విలువ కట్టడం, అమ్మకం ప్రక్రియ వంటి అంశాల్లో సెబీకి ఎస్బీఐ క్యాప్, హెచ్డీఎఫ్సీ రియల్టీ సహాయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. బుధవారం ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు తదుపరి విచారణకు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు వెలువడ్డం గమనార్హం.
సహారా డిపాజిట్ చేసిన ఆస్తుల టైటిల్ డీడ్స్ ఆదారంగా వాటి అమ్మకపు ప్రక్రియను ప్రారంభించాలని గత నెల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ అగర్వాల్ పర్యవేక్షణలో ఈ కార్యకలాపాలు జరగాలని పేర్కొంది. అవసరమైతే సంబంధిత నిపుణత సంస్థల సహాయాన్నీ తీసుకోవచ్చని సూచించింది. ఇన్వెస్టర్ల సొమ్ము తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రస్తుతం జస్టిస్ అగర్వాల్ సమీక్షిస్తున్నారు. సహారా దాదాపు 86 ప్రోపర్టీల టైటిల్ డీడ్స్‌ను సెబీకి డిపాజిట్ చేసింది.