ఇన్వెస్టర్ల అప్రమత్తతకు సెబీ విస్తృత ప్రచారం
న్యూఢిల్లీ: మోసాల బారిన పడకుండా ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించడానికి, బోగస్ స్కీముల పట్ల అప్రమత్తం చేయటానికి మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ విస్తృత మీడియా ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా రేడియో, టీవీ, పత్రికా ప్రకటనల ద్వారా ఇన్వెస్టర్ల కోసం కొన్ని అవగాహన కార్యక్రమాల్ని చేపట్టనుంది. ముఖ్యంగా ‘ఇన్వెస్టర్ల సమస్యల పరిష్కార యంత్రాంగం’, ‘కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు’ వంటి వాటి ప్రచారంపై దృష్టి కేంద్రీకరించనుంది.
అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి అవకాశాలపై ఇన్వెస్టర్లలో అవగాహన పెంచనుందని సెబీ అధికారి చెప్పారు. సెబీ ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఎలాంటి వదంతులను నమ్మవద్దని, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందటం వంటి విషయాలపై అప్రమత్తంగా ఉండాలని మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది.