గార్డు డ్యూటీల్లో అప్రమత్తంగా ఉండాలి
– ఏపీఎస్పీ కమాండెంట్
కర్నూలు : గార్డు డ్యూటీలు నిర్వహించే వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్పీ రెండో పటాలం కమాండెంట్ విజయ్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మూడో రోజు బుధవారం పెరేడ్ నిర్వహించారు. సిబ్బంది నుంచి కమాండెంట్ గౌరవందనం స్వీకరించారు. అనంతరం సిబ్బందిని సమావేశ పరిచి విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కుటుంబ సంక్షేమం తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పటాలంలో పని చేస్తున్న సిబ్బందికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, వారికి రావాల్సిన రుణాలు, మెడికల్ బిల్లులు, రవాణా భత్యం త్వరితగతిన మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మోటర్ వాహనాల (ఎంటీ) కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆర్ఎస్ఐ (అడ్జుడెంట్) కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంటు కమాండెంట్స్ ఎస్ఎం బాషా, గోపాలకృష్ణ, రిజర్వు ఇన్స్పెక్టర్లు యుగంధర్, బిక్షపతి, సమర్పణరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.