2019 నాటికి రెండో స్థానానికి అమెజాన్!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఆన్లైన్ రిటైల్ పోర్టల్ ‘అమెజాన్’ 2019 నాటికి భారత్‌లో రెండో అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా అవతరిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా వేసింది. అలాగే అమెజాన్‌కు అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ అవుతుందని అభిప్రాయపడింది. ‘గడచిన రెండు నెలల్లో అమెజాన్ ఇండియా స్థూల అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ కన్నా (మింత్రా మినహా) ఎక్కువగా ఉన్నాయి.
2015లో 21 శాతంగా ఉన్న అమెజాన్ జీఎంవీ (గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యు) మార్కెట్ వాటా 2019 నాటికి 37 శాతానికి పెరగొచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్ కన్నా కొంత తక్కువ’ అని వివరించింది. ఇక 2025 నాటికి అమెజాన్ ఇండియా జీఎంవీ విలువ 81 బిలియన్ డాలర్లకు, ఆపరేటింగ్ ప్రాఫిట్ 2.2 బిలియన్ డాలర్లకు చేరొచ్చని తెలిపింది. ఇక దేశీ ఈ-కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ అగ్రస్థానంలో కొనసాగుతోందని పేర్కొంది.