ఉద్రిక్తతల మధ్య మలి విడత పోలింగ్
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో శుక్రవారం రెండో విడత పోలింగ్ ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పలు చోట్ల ఘర్షణలు, ఓటర్ల నిరసనలు, పోలీసుల లాఠీచార్జీలు తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి.
గరివిడి మండలం తోండ్రంగిలో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మెరకముడిదాం మండలం రామాయవలస, గాతాడలలో ఓట్లు తారుమారవడంతో పోలింగ్ నిలిచిపోయింది. 19 జెడ్పీటీసీ, 317 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగగా, మొదట్లో మందకొడిగా సాగిన ఓటింగ్ తరువాత పుంజుకుంది.
మొత్తం 8,05,532 ఓట్లకు గాను జెడ్పీటీసీ అభ్యర్థులకు 6,94,204, ఎంపీటీసీలకు 6,91,844ఓట్లు పోలయ్యాయి. జెడ్పీటీసీలకు 86.43 శాతం, ఎంపీటీసీకు 86.35 పోలింగ్ శాతం నమోదైంది. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి బ్యాలెట్ల పెట్టెలను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. 2,538 బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది.
ఎస్.కోట మండలం రేవళ్లపాలెంలో చిన్న సందులో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 18 గిరిజన గ్రామాలకు చెందిన నాలుగువేల మంది ఓటర్లు ఇక్కడ సందులోనే ఓటు వేయాల్సి వచ్చింది.
గజపతినగరం మండలం జిన్నాం గ్రామంలో పోలీసులు జులుం ప్రదర్శించడంతో ఆగ్రహించిన స్థానికులు పోలింగ్‌ను గంటపాటు నిలిపి వేశారు.
విజయనగరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండే పర్యటించి పోలింగ్ తీరును గమనించారు. ఎక్కడయినా చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించారు.
డివిజన్లోని ధర్మవరం, అలమండ, గంట్యాడ, కొత్తవలస, బొద్దాం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఆయన పర్యటించారు.