రాహుల్ కోసం ఎవరినైనా చీల్చుతాం!
* మాక్ పార్లమెంటులో సోనియా, మంత్రులపై వ్యంగ్యాస్త్రాలు
* సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల వినూత్న నిరసన
సోనియాగాంధీ గారూ మీ అత్త ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయబోమని తెలుగువారి మేలు కోరితే.. మీరు రాష్ట్రాన్ని చీల్చుతున్నారెందుకని?
మాకు ఓట్లు, సీట్లే ముఖ్యం. నా కొడుకు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావటమే నాకు, మా పార్టీకి ప్రధాన లక్ష్యం. దీని కోసం ఎవరినైనా చీల్చుతాం. ఎవరినైనా కలుపుతాం.’
చిరంజీవి గారూ సామాజిక న్యాయమని ప్రజారాజ్యం పార్టీ పెట్టి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోతుంటే ఏంచేస్తున్నారు?
ఏం చేస్తాను. సోనియాగాంధీ జపం. నాకు ఆమె మంత్రి పదవి ఇచ్చారు. అందుకే మేడంకు విశ్వసనీయుడిగా ఉన్నా. సీమాంధ్ర ప్రజల ఒత్తిడితో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అమ్మను కోరా. నీకు మంత్రి పదవి ఇచ్చా కదా అది ఉండాలా వద్దా అని మేడం అడిగారు. అంతే సెలైంట్‌గా బయటికొచ్చా.’
కావూరి గారూ మీకు మంత్రి పదవితోపాటు సోనియాగాంధీ ఏం ప్యాకేజీ ఇచ్చారు?
నేనిప్పుడు మంత్రి పదివిలో ఉన్నా. ఇప్పుడేమీ మాట్లాడలేను.’
పల్లంరాజు గారూ రాష్ట్రం ముక్కలవుతుంటే పట్టించుకోరా?
మేం ఏం చేయలేం. మంత్రులకు సిగ్గులేదు అని మీరడిగినా మేం ఏమీచేయలేం. ప్రజల క్షేమం మాకు పట్టదు.’
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రుల వ్యవహార శైలిని నిరసిస్తూ సోమవారం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించిన మాక్ పార్లమెంట్లో విసిరిన వ్యంగ్యాస్త్రాలివి. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమిస్తున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను వంచించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ చెవుల్లో పూలు పెట్టుకుని సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ ఎదుట మోకరిల్లారని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీని స్తుతిస్తూ భజనలు, కీర్తనలు ఆలపించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి, సీమాంధ్ర కేంద్ర మంత్రుల చేతగానితనాన్ని ఎండగడుతూ మాక్ పార్లమెంటులో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సచివాలయానికి వచ్చిన మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డిని అడ్డుకున్నారు. రాజీనామాలు చేయకుండా సచివాలయానికి రావద్దని చెప్పినా ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. మంత్రులందరూ రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. మంత్రులంతా ఎంపీలపై ఒత్తిడి తెచ్చి వారి చేత రాజీనామాలు చేయించాలన్నారు.
-సాక్షి, హైదరాబాద్