సెక్షన్ 30 కాపుల ఉద్యమానికేనా?
సర్కారుకు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి ప్రశ్న
రిజర్వేషన్ల కోసం దశలవారీ ఉద్యమం
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
దేశంలో ఎక్కడా లేనట్టు రాష్ట్ర ప్రభుత్వం నెలల తరబడి అమలు చేస్తున్న సెక్షన్ 30 కేవలం కాపుల కోసమేనా అని జిల్లా కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభించారన్నారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలు ఇప్పటి వరకూ చీకట్లోనే ఉన్నాయని, రిజర్వేషన్ ఫలితం పొందడం లేదని చెప్పారు. కాపు ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని అధికారం, పోలీసు బలగంతో అణచివేయాలని చూస్తోందని నిరసించారు. రిజర్వేషన్ల కోసం దశల వారీగా ఉద్యమించనున్నట్టు తెలిపారు.
13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో తమ వర్గీయులు ఐక్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ప్రధాన కూడళ్లలో మూతికి నల్లగడ్డలు కట్టుకుని ఆకలి కేక పేరుతో కంచం మీద గరిటె వాయింపు, 30న 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేత, జనవరి 9న సాయంత్రం అన్ని ప్రధాన కూడళ్లల్లో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన, 30న రావులపాలెం నుంచి అమలాపురం మీదుగా అంతర్వేదికి సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యాత్రకు అనుమతి ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలు, చైతన్య యాత్రలకు ఎవరూ అనుమతి తీసుకోలేదన్నారు. మిగిలిన వారికి లేని అనుమతి తమ యాత్రకు అవసరం లేదని చెప్పారు. అయితే అనుమతి కోసం దరఖాస్తు చేస్తామన్నారు. జేఏసీ నేతలు గన్నాబత్తుల మహేష్, ఆకుల లక్ష్మి, కొత్తపేట రాజా, సందీప్, వెంట్రప్రగడ ఉమామహేశ్వరి, బొరుసు శ్రీను, కొల్లిమళ్ళ రఘు, వడ్డి మురళీకృష్ణ, అడపా భాస్కర్ పాల్గొన్నారు.