‘రైల్వే’ మందకొడితనం
సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, పాసింజర్ తదితర రైళ్లు నిర్ణీత సమయాన్ని పాటించకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు ఎన్నో రైళ్లు ప్రయాణం చేస్తుంటాయి. ప్రయాణికులను సరైన సమయానికి గమ్యస్థానాలకు చేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. ఎన్నోమార్లు రైల్వే మంత్రిత్వశాఖ నుండి నిర్ణీత సమయాలలో రైలు నడపాలని ఆదేశాలున్నా వాటిని పాటించడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది.
ఒక్కొక్కసారి ఫలానా సమయానికి రైలు వస్తుందని వివిధ స్టేషన్లలో మైక్ ద్వారా అనౌన్స్మెంట్ జరిగిన 2 నుండి 3 గంటల సమయం వరకు రైలురాని పరిస్థితి దాపురించడంతో ప్రయాణికులు రైలు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా రైల్వేశాఖ ఉన్నత అధికారులు నిర్ణీత సమయానికి రైళ్లు నడిపించేలా చర్యలు తీసుకొని ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని మనవి.
- మంకమ్మ తోట, ప్రభుత్వ ఉపాధ్యాయిని, కరీంనగర్