Secunderabad Visakhapatnam
-
Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్ల సక్సెస్ మాటేమోగానీ.. అధిక టికెట్ ధరలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండడంతో నెమ్మదిగా సాధారణ ప్యాసింజర్ రైళ్లకు ప్రయాణికులు దూరమైపోతున్నారు. అయినప్పటికీ వందే భారత్ రైళ్లనే ప్రమోట్ చేసేందుకే భారతీయ రైల్వేస్ మొగ్గు చూపిస్తోంది. ఈ క్రమంలో.. వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ ధరల్ని తగ్గించాలని నిర్ణయించింది. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. తక్కువ దూరం ఉండే మార్గాల్లో నడిచే రైళ్లలో టికెట్ ధరలు తగ్గించాలని భారతీయ రైల్వేస్ భావిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల రూట్లకు ఇది వర్తించబోదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇండోర్-భోపాల్ వందే భారత్ రైలు ప్రయాణ సమయం మూడు గంటలు. జూన్ నెలలో 29 శాతం ఆక్యుపెన్సీతోనే నడిచింది ఈ రైలు. అలాగే.. భోపాల్-ఇండోర్ రూట్లో 21 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. అందుకే ఈ తరహా తక్కువ దూరం ఉన్న రూట్లో టికెట్ ధరల్ని తగ్గించాలని.. తద్వారా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని భావిస్తోంది రైల్వేస్. ఇక ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లల్లో మాత్రం టికెట్ ధరలు యథాతధంగా కొనసాగించాలనుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లకు ఆదరణ బాగుందని అధికారులు చెబుతున్నారు. దీంతో, టికెట్ ధరల తగ్గింపు ప్రతిపాదనలు ఈ రైళ్లకు లేవని స్పష్టత ఇచ్చేశారు. ఇదిగాక.. త్వరలోనే విజయవాడ - చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. వచ్చే నెలలో మరో వందేభారత్ సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆయా రూట్లలోనూ టికెట్ ధరలు అధికంగానే ఉండొచ్చని ఇప్పటికే అధికారులు సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇదీ చదవండి: ఇంతకీ కట్టప్ప ఎవరు? బాహుబలి ఎవరు? -
గుంటూరు మీదుగా బై వీక్లీ రైళ్లు
సంగడిగుంట(గుంటూరు): ప్రయాణికుల రద్దీ కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య గుంటూరు, నల్గొండ మీదుగా 2014 డిసెంబరు, 2015 జనవరి నెలల్లో బై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.శ్రీరాములు శుక్రవారం తెలిపారు. 08505 నంబరుతో నడిచే రైలు విశాఖపట్నంలో 21.45 గంటలకు బుధ, శనివారాల్లో బయలుదేరి 05.30/35 గంటలకు గుంటూరు మీదుగా ప్రయాణించి గురు, ఆదివారాల్లో 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది. ఈ రైలు 2014 డిసెంబరు 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31 తేదీల్లో, 2015 జనవరి 3, 7, 10, 14, 17, 21, 24, 28, 31 తేదీల్లోను నడపనున్నారు. 08506 నంబరుతో సికింద్రాబాద్లో గురు, ఆదివారాల్లో 19.45 గంటలకు బయలుదేరి 2014 డిసెంబరు 4, 7, 11, 14, 18, 21, 25, 28 తేదీల్లోను, 2015 జనవరి 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29 తేదీల్లో నడపనున్నారు. ఈ రైళ్లు మార్గంమధ్యలోని మౌలాలి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాల్సిందిగా శ్రీరాములు కోరారు.