దొంగబుద్ధి ఉన్నవ్యక్తికి సెక్యూరిటీ బాధ్యతలా !
బ్లాక్మెయిలింగ్ ముఠాలో కీలక వ్యక్తి అయిన జాటోతు కృష్ణ యూనివర్సిటీ ఆస్తులను రక్షించే సెక్యూరిటీ విభాగానికి చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తుండడం గమనార్హం. బ్లాక్మెయిలింగ్తోనే ఇతడు మొదటి నుంచి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నతాధికారులను తన గుప్పిట్లో ఉంచుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవల హెచ్ఆర్ఎం విభాగానికి చెందిన ఓ పార్టటైం లెక్చరర్ తన బైక్ పాడైందని ఎస్డీఎల్సీఈ ఆవరణలో పార్క చేయగా ఆ బైక్ను కృష్ణ ఎత్తుకెళ్లాడు. ఆ బైక్ రూపురేఖలను మార్చి దర్జాగా తిరుగుతుండగా సదరు లెక్చరర్ స్నేహితుడొకరు చూసి అతడికి సమాచారమిచ్చాడు. దీంతో అతడిని పిలిచి నిలదీయగా బైక్ వదిలేసి వెళ్లిపోయిన ఘటన కూడా ఇటీవల క్యాంపస్లో చర్చనీయాంశమైమంది.
యూనివర్సిటీలో సుమారు 30 మంది సెక్యూరిటీ గార్డులు విధులకు హాజరుకాకున్నా వారితో రిజిష్టర్లలో సంతకాలు చేయించి, జీతాల బిల్లు చేయిస్తూ అందులో సగం ఇతడే స్వాహా చేస్తున్నట్లు తెలిసింది. రోజూ విధులకు హాజరయ్యే సెక్యూరిటీ గార్డుల వద్ద కూడా వేతనం తీసుకునే సమయంలో రూ.1000 నుంచి రూ.2 వేల వరకు కమీషన్ల రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా అతడి జీతం రూ.30 వేలు పోనూ నెలకు సుమారు రూ.లక్షన్నరకు పైగా ఇతడు అక్రమంగా సంపాదిస్తున్నట్లు పలువురు సెక్యూరిటీ గార్డులు వాపోయారు. ఇతడి వ్యవహారంపై యూనివర్సిటీ ఉన్నతాధికారికి పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినా ఆయన మౌనంగా ఉంటూ కాపాడుతూ రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోమారు కృష్ణను విచారిస్తే మరిన్ని అంశాలు వెలుగుచూసే అవకాశం ఉంది.