Security Review Committee
-
సచిన్‌కు భద్రతను కుదించిన ప్రభుత్వం
సాక్షి, ముంబై : క్రికెట్ దేవుడు, భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు ఉన్న ఎక్స్ కేటగిరీ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అంటే ఇప్పటి నుంచి సచిన్‌కు 24 గంటల సెక్యూరిటీ ఉండదు. కానీ ఎస్కార్ట్ సదుపాయం ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రేకు మాత్రం భద్రతను పెంచారు. ఆదిత్యకు ఇప్పుడున్న వై ప్లస్ సెక్యూరిటీ నుంచి జెడ్ ప్లస్‌కు పెంచారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆయా వ్యక్తులకున్న ముప్పును పరినణనలోకి తీసుకొన్న తర్వాత ఈ విషయంపై ఏర్పాటైన కమిటీ బుధవారం సమావేశమై ఈ నిర్ణయాలను తీసుకొంది. బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సేకు ఉన్న వై సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. ఇకపై ఆయనకు ఎలాంటి భద్రత ఉండదు. మరో బీజేపీ నేత, ఉత్తర ప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్‌కు జెడ్ ప్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి మార్చారు. కాగా మహారాష్ట్రలో 97 మందికి ఇలాంటి భద్రతా సదుపాయాలు ఉండగా, 29 మందికి భద్రతా కేటగిరీలో మార్పులు చేశారు. -
విప్పు.. నిప్పు
చింతమనేనికి పైలట్ బందోబస్తుతో పోలీసు అధికారుల మధ్య అంతరం రోజుకో ఎస్సై ఎస్కార్ట్‌తో ఏలూరు పోలీసుల అవస్థలు సాక్షి ప్రతినిధి, ఏలూరు :ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు గత కొద్దిరోజులుగా పోలీసు ఉన్నతాధికారులు కల్పిస్తున్న పైలట్ బందోబస్తు పోలీసువర్గాల్లోనే చర్చనీయాంశమైంది. ఏలూరు నగరంలోని ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి రోజుకో ఎస్సై చొప్పున, ఒకరిద్దరు కానిస్టేబుళ్లు జీపుతో ఆయన వాహనానికి ముందు సైరన్ మోతతో ఎస్కార్ట్‌గా వెళుతున్న వ్యవహారం ఇప్పుడు ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ప్రభుత్వ విప్‌కు కూడా ఎమ్మెల్యే మాదిరిగానే ఇద్దరు గన్మన్లను ప్రభుత్వం బందోబస్తుగా నియమిస్తుంది. వివిధ కారణాల రీత్యా ఎవరైనా సెక్యూరిటీ కోరిన పక్షంలో ఉన్నతస్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) సమీక్షించి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఆర్నెల్లకోసారి జరిగే ఎస్ఆర్సీ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అత్యవసర సందర్భాల్లో పోలీస్ ఉన్నతాధికారులు తమ విచక్షణాధికారం మేరకు అర్హులైన వారికి బందోబస్తు సౌకర్యం కల్పిస్తుంటారు. ఇప్పుడు హఠాత్తుగా చింతమనేనికి ఇంతటి బందోబస్తు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఒకవేళ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన సెక్యూరిటీ కోరినా, ఆ మేరకు ఎస్ఆర్సీ సిఫార్సు చేసినా ఏఆర్ పోలీసులనే ఎక్కువగా బందోబస్తు విధులకు పంపాలి. కానీ ఇప్పుడు చింతమనేనికి రోజుకో లా అండ్ ఆర్డర్ ఎస్సైను పైల టింగ్‌కు పంపడం పోలీసువర్గాల్లో చర్చకు తెరలేపింది. ఎనిమిది నెలల కిందట ఇలాగే.. వాస్తవానికి చింతమనేని ప్రభుత్వ విప్ అయిన కొత్తలో సబ్ డివిజనల్‌స్థాయి అధికారులు ఇదేవిధంగా పైలట్ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకే బందోబస్తు ఇవ్వండి అని అప్పటి పోలీస్ ఉన్నతాధికారులు సూచించడంతో వెంటనే ఎస్కార్ట్‌ను తొలగించారు. మళ్లీ గత కొద్దిరోజులుగా చింతమనేనికి పైలట్ ఎస్కార్ట్ కేటాయించడం కిందిస్థాయి పోలీసువర్గాలనే ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీస్‌స్టేషన్‌పై దాడి, ఎస్సైపై దాడి వంటి కేసులతో సహా 34 కేసులు చింతమనేనిపై పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఎక్కడైతే చింతమనేనిపై రౌడీషీట్ ఉందో అదే పోలీస్‌స్టేషన్ ఎస్సై ఇప్పుడు ఆయన వెంట ఎస్కార్ట్‌గా వెళుతుండటం గమనార్హం. వాస్తవానికి ఓ పోలీస్ పెద్దాయన్ను మొహమాటపెట్టి పెలైట్ ఎస్కార్ట్ సౌకర్యం పొందారని, అయితే ఇదే విషయమై మరో పోలీస్ అధికారి ఒకింత అసంతృప్తిగా ఉన్నారని పోలీసువర్గాల నుంచే వచ్చిన విశ్వసనీయ సమాచారం. జూనియర్ అసిస్టెంట్‌గా ఆ కానిస్టేబులే ఇక అనుచరుడిలా తన వెంటే నిత్యం తిరిగే ఓ కానిస్టేబుల్‌ను ఆయన ఆఫీస్ సబ్ఆర్టినేట్గా నియమించుకోవడం కూడా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశ మైంది. మహిళా పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఎప్పుడు చూసినా విధులకు గైర్హాజరై చింతమనేని వెంటే తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే కానిస్టేబుల్‌ను తన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ప్రజాప్రతినిధులకు పోలీసేతర రెవెన్యూ విభాగాల్లోని సిబ్బందినే ఆఫీస్ సబ్‌ఆర్డినేట్లుగా నియమిస్తుంటారు. కానీ తొలిసారి చింతమనేని ఓ పోలీసు ఉద్యోగిని తన కార్యాలయ సబ్ఆర్టినేట్గా నియమించుకోవడం పోలీసు వర్గాల్లోనే ఆసక్తిని రేపుతోంది. -
బక్కచిక్కిన భద్రత
ఒంగోలు క్రైం : ప్రజాప్రతినిధులు, తాజామాజీ ప్రజాప్రతినిధులకు గన్మెన్ల ద్వారా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీస్‌శాఖపై ఉంది. అయితే, ఇటీవల నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) సమావేశంలో ప్రజాప్రతినిధులు, తాజామాజీ ప్రజాప్రతినిధులకు మొత్తం గన్మెన్ల సంఖ్యను సగానికి కుదించడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల గన్మెన్ల సంఖ్య కూడా సగానికి తగ్గిపోయింది. అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధులతో పాటు తాజామాజీ ప్రజాప్రతినిధులకు సైతం గన్మెన్లను తొలగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గన్మెన్ల తగ్గింపు ఇలా... జిల్లాలోని పశ్చిమ ప్రకాశం నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకూ 2+2 అంచెల భద్రత ఉండేది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి ఎమ్మెల్యేలకు ఆ స్థాయిలో భద్రత కల్పించేవారు. అయితే, ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం జిల్లాలో లేదని పోలీసు ఉన్నతాధికారులు భావించడంతో పాటు సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పశ్చిమ ప్రకాశం ఎమ్మెల్యేలకు గన్మెన్లను 1+1కు కుదించారు. ఆయా ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మాజీ, తాజామాజీ ప్రజాప్రతినిధులకు గన్మెన్లను పూర్తిగా తొలగించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం గన్మెన్లను తొలగించారు. దీంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి మినహా ఎమ్మెల్యేలందరికీ 1+1 భద్రత... జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి శిద్దా రాఘవరావుకు 2+2 గన్మెన్లను ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కేటాయించారు. అందులో ఒక ఏఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన పోలీసులు కూడా ఉంటారు. మంత్రికి మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరికీ 1+1 భద్రతను మాత్రమే కల్పించారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి జిల్లా పోలీసు యంత్రాంగం ఇద్దరు గన్మెన్లను కేటాయించగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరో ఇద్దరిని ఏర్పాటు చేసింది. నెల్లూరు, బాపట్ల ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రిలకు కూడా అదేస్థాయిలో భద్రత కల్పించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావుకు కూడా గన్మెన్లను కేటాయించారు. నూకసానికి భద్రత కోసం ప్రభుత్వానికి లేఖ... జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీకి భద్రత కల్పించే విషయమై జిల్లా పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సాధారణంగా జిల్లా పరిషత్ చైర్మన్‌గా నేరుగా ఎన్నికైన వారికి ప్రొటోకాల్‌లో భాగంగా వెంటనే గన్మెన్లను కేటాయిస్తారు. అయితే, చైర్మన్‌గా ఉన్న ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడటంతో వైస్ చైర్మన్‌గా ఉన్న నూకసాని చైర్మన్ హోదాకు వెళ్లారు. దీంతో ఆయన తనకు గన్మెన్లను కేటాయించాలని జిల్లా పోలీసు అధికారులకు లేఖ రాయాల్సి ఉంది. అందులో భాగంగా ఇటీవల ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌కు నూకసాని లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆయనకు గన్మెన్లను కేటాయించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది.