బక్కచిక్కిన భద్రత | the gunman reduced to representatives of the public | Sakshi
Sakshi News home page

బక్కచిక్కిన భద్రత

Published Fri, Sep 12 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

the gunman reduced to representatives of the public

ఒంగోలు క్రైం : ప్రజాప్రతినిధులు, తాజామాజీ ప్రజాప్రతినిధులకు గన్‌మెన్ల ద్వారా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీస్‌శాఖపై ఉంది. అయితే, ఇటీవల నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) సమావేశంలో ప్రజాప్రతినిధులు, తాజామాజీ ప్రజాప్రతినిధులకు మొత్తం గన్‌మెన్ల సంఖ్యను సగానికి కుదించడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల గన్‌మెన్ల సంఖ్య కూడా సగానికి తగ్గిపోయింది.

 అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధులతో పాటు తాజామాజీ ప్రజాప్రతినిధులకు సైతం గన్‌మెన్లను తొలగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 గన్‌మెన్ల తగ్గింపు ఇలా...
 జిల్లాలోని పశ్చిమ ప్రకాశం నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకూ 2+2 అంచెల భద్రత ఉండేది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి ఎమ్మెల్యేలకు ఆ స్థాయిలో భద్రత కల్పించేవారు. అయితే, ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం జిల్లాలో లేదని పోలీసు ఉన్నతాధికారులు భావించడంతో పాటు సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పశ్చిమ ప్రకాశం ఎమ్మెల్యేలకు గన్‌మెన్లను 1+1కు కుదించారు. ఆయా ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మాజీ, తాజామాజీ ప్రజాప్రతినిధులకు గన్‌మెన్లను పూర్తిగా తొలగించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం గన్‌మెన్లను తొలగించారు. దీంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 మంత్రికి మినహా ఎమ్మెల్యేలందరికీ 1+1 భద్రత...
 జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి శిద్దా రాఘవరావుకు 2+2 గన్‌మెన్లను ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కేటాయించారు. అందులో ఒక ఏఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన పోలీసులు కూడా ఉంటారు. మంత్రికి మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరికీ 1+1 భద్రతను మాత్రమే కల్పించారు.

ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి జిల్లా పోలీసు యంత్రాంగం ఇద్దరు గన్‌మెన్లను కేటాయించగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరో ఇద్దరిని ఏర్పాటు చేసింది. నెల్లూరు, బాపట్ల ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రిలకు కూడా అదేస్థాయిలో భద్రత కల్పించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావుకు కూడా గన్‌మెన్లను కేటాయించారు.

 నూకసానికి భద్రత కోసం  ప్రభుత్వానికి లేఖ...
 జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీకి భద్రత కల్పించే విషయమై జిల్లా పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

 సాధారణంగా జిల్లా పరిషత్ చైర్మన్‌గా నేరుగా ఎన్నికైన వారికి ప్రొటోకాల్‌లో భాగంగా వెంటనే గన్‌మెన్లను కేటాయిస్తారు. అయితే, చైర్మన్‌గా ఉన్న ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడటంతో వైస్ చైర్మన్‌గా ఉన్న నూకసాని చైర్మన్ హోదాకు వెళ్లారు. దీంతో ఆయన తనకు గన్‌మెన్లను కేటాయించాలని జిల్లా పోలీసు అధికారులకు లేఖ రాయాల్సి ఉంది. అందులో భాగంగా ఇటీవల ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌కు నూకసాని లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆయనకు గన్‌మెన్లను కేటాయించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement