Sedition row
-
దేశద్రోహ చట్టంపై స్టే
న్యూఢిల్లీ: బ్రిటిష్ జమానా నాటి దేశద్రోహం చట్టం విషయంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం వెలువరించింది. చట్టం అమలుపై స్టే విధించింది. కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసుల విచారణ కూడా నిలిపేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు తమ తదుపరి ఉత్తర్వుల దాకా కొనసాగుతాయని పేర్కొంది. దీనిపై జూలై మూడో వారంలో తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. ‘‘ఆలోపు దేశద్రోహ చట్టం కింద కొత్త కేసులు పెట్టడం వంటివి జరిగితే బాధితులు సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చు. మా ప్రస్తుత ఆదేశాలకు అనుగుణంగా ఆయా కోర్టులకు వారికి తగిన ఊరట కల్పించాలి’’ అని సూచించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఉన్నారు. ఈ కాలానికి నప్పదు ‘‘దేశద్రోహ చట్టం (124ఏ) ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదు. దేశ భద్రతకు, సమగ్రతకు సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళన కూడా అర్థం చేసుకోదగినదే. కానీ ప్రభుత్వ ప్రయోజనాలు, పౌరుల ప్రయోజనాల మధ్య సమతుల్యత అవసరం. కష్టమే అయినా దాన్ని సాధించడం తప్పనిసరి’’ అంటూ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం పునఃసమీక్షకు కేంద్రానికి అనుమతిస్తున్నట్టు పేర్కొంది. ‘‘ఆలోపు కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ దేశద్రోహ చట్టం కింద ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లూ నమోదు చేయవని, ఇప్పటికే నమోదైన కేసుల్లో విచారణ కొనసాగించబోవని ఆశిస్తున్నాం. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును గత విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ మా ముందుంచారు. హనుమాన్ చాలీసా కేసు వంటి పలు ఉదాహరణలను మా దృష్టికి తెచ్చారు. అందుకే పునఃసమీక్ష ముగిసేదాకా ఈ చట్టాన్ని ప్రయోగించకుండా ఉండటమే సరైందని భావిస్తున్నాం’’ అని జస్టిస్ రమణ తన తీర్పులో పేర్కొన్నారు. చట్టంపై స్టే విధించే బదులు దేశద్రోహ చట్టం కింద నమోదైన కేసుల విచారణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ఎస్పీ ర్యాంకు పోలీసు అధికారిని నియమించాలని కేంద్రం సూచించగా ధర్మాసనం అంగీకరించలేదు. ఇది కేసు పెట్టదగిన నేరాలకు సంబంధించిన చట్టం గనుక దాని కింద ఎఫ్ఐఆర్ల నమోదును నిరోధించలేమని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. 1962లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా దేశద్రోహ చట్టాన్ని సమర్థించిందని గుర్తు చేశారు. కేంద్రం లేవనెత్తిన ఈ అంశంపై సంప్రదింపుల నిమిత్తం విచారణను ధర్మాసనం కాసేపు నిలిపేసింది. అనంతరం తిరిగి విచారణ చేపట్టింది. ‘‘కేంద్రం లేవనెత్తిన అంశాన్ని కూలంకషంగా పరిశీలించాం. సదరు చట్టాన్ని (సుప్రీంకోర్టు వంటి) సాధికార ఫోరం సమీక్షించవచ్చని కేంద్రం కూడా నాటి విచారణ సందర్భంగా అంగీకరించింది’’ అని వ్యాఖ్యానించింది. అన్ని అంశాలనూ లోతుగా పరిశీలించిన తర్వాతే దేశద్రోహ చట్టం అమలుపై స్టే విధించాలని నిర్ణయానికి వచ్చినట్టు వివరించింది. ఇతరత్రా కూడా ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిందిగా రాష్ట్రాలకు సూచనలిచ్చేందుకు కేంద్రానికి అనుమతిచ్చింది. 10 పేజీల తీర్పును జస్టిస్ రమణ రాశారు. ప్రధాని మోదీ కూడా ఇటీవల దేశద్రోహ చట్టాన్ని ప్రస్తావిస్తూ, ‘పౌర స్వేచ్ఛను, మానవ హక్కులను పరిరక్షించాల్సిన అవసరముంది’ అని వ్యాఖ్యానించారని తీర్పులో ఆయన ప్రస్తావించారు. స్టే సరికాదు: కేంద్రం దేశద్రోహ చట్టంపై పునఃసమీక్ష జరిగేదాకా కేసుల విచారణను, దానికింద కొత్త కేసుల నమోదును నిలిపేస్తారా అని మంగళవారం విచారణ సందర్భంగా కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించడం, 24 గంటల్లోగా వైఖరి తెలిపాలని పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం అభిప్రాయాలతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించారు. స్టే విధింపుకు కేంద్రం వ్యతిరేకమని తెలిపారు. ఈ చట్టం కింద పెండింగులో ఉన్న కేసుల్లో బెయిల్ అభ్యర్థనలను ఆరోపణల తీవ్రతకు అనుగుణంగా వీలైనంత త్వరగా పరిష్కరించవచ్చన్నది కేంద్రం ఉద్దేశమన్నారు. ‘‘ఎందుకంటే ఆ కేసుల్లో ఉగ్రవాద, మనీ లాండరింగ్ వంటి కోణాలు కూడా ఇమిడి ఉండొచ్చు. ఏమైనా దేశద్రోహ చట్టం కింద పెండింగ్ కేసులన్నీ కోర్టుల ముందే ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానాలపై నమ్మకముంచాలి’’ అని మెహతా వ్యాఖ్యానించారు. లక్ష్మణరేఖ దాటొద్దు: కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు న్యూఢిల్లీ: రాజ్యాంగ వ్యవస్థలు లక్ష్మణరేఖ దాటకూడదని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై బుధవారం మీడియా ప్రశ్నలకు బదులిస్తూ ఆయన ఈ మేరకు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టులు ప్రభుత్వాన్ని, శాసన వ్యవస్థను గౌరవించాలి. ప్రభుత్వం కూడా కోర్టులను గౌరవించాలి. ఈ మేరకు స్పష్టమైన లక్ష్మణరేఖను రాజ్యాంగం ఎప్పుడో నిర్దేశించి ఉంచింది. దాన్ని ఎవరూ మీరకూడదు’’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలగని రీతిలో దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పారు. దీన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. చట్టాలు చేయడం ప్రభుత్వ బాధ్యతన్నారు. పార్టీల స్పందనలు సత్యం కోసం నినదించే గళాలను ఎంతోకాలం తొక్కిపెట్టలేరని సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మరోసారి రుజువైంది. నిజం చెప్పడం దేశభక్తే తప్ప దేశద్రోహం కాదు. వాస్తవాలను చెవికెక్కించుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ప్రశ్నించే గొంతుకలను అణిచేయడం అహంకారం. – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తామన్న కేంద్రం సూచనకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 1,500కు పైగా కాలం చెల్లిన చట్టాలను మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా రద్దు చేసింది. – బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ దేశంలో విభజన తీసుకొచ్చేందుకు 2014 నుంచీ దేశద్రోహ చట్టాన్ని మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోంది. అందుకే కేంద్ర పునఃసమీక్ష దాకా ఆగకుండా దాన్ని సుప్రీంకోర్టే పూర్తిగా రద్దు చేయాలి – సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీం ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. దేశద్రోహ చట్టం రద్దు కోసం 2011లోనే రాజ్యసభలో ప్రైవేట్ సభ్యుల బిల్లు పెట్టాం – సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మోదీ సర్కారుపై గళమెత్తిన వారందరిపైనా దేశద్రోహ చట్టం ప్రయోగిస్తున్నారు. ఈ పోకడకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్ చదవండి👉Bangalore: కోటి వాహనాల ఐటీ సిటీ -
దేశద్రోహ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేస్తారా?
న్యూఢిల్లీ: ‘‘బ్రిటిష్ వలస కాలం నుంచి అమల్లో ఉన్న దేశద్రోహ (సెక్షన్ 124ఏ) చట్టాన్ని పునఃసమీక్షిస్తారా? ఆ చట్టం కింద కేసులు నమోదైన పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా అప్పటిదాకా పెండింగ్ కేసులన్నింటినీ పక్కన పెడతారా? పునఃసమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా?’’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందిగా సూచించింది. వీటిపై కేంద్రం వైఖరేమిటో బుధవారంలోగా తమకు చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. దాన్నిబట్టి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ చట్టం తరచూ దుర్వినియోగానికి గురవుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ఇందుకు తక్షణం అడ్డుకట్ట పడాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అందుకోసం అవసరమైతే పునఃసమీక్ష పూర్తయేదాకా చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేయాలని సూచించింది. చట్టాన్ని సమీక్షించేలోగా పెండింగ్‌లో ఉన్న, ఇకపై నమోదయ్యే కేసుల విచారణను నిలిపివేయాలంటూ వస్తున్న సూచనలపై స్పందించాలని కేంద్రానికి సూచించింది. కేంద్రంతో చర్చించి బుధవారం కోర్టుకు తెలియజేస్తానని తుషార్ మెహతా చెప్పారు. ‘‘దేశద్రోహ చట్టం దుర్వినియోగమవుతోందని కేంద్రమే ఆందోళన చెందుతుంటే ఇక పౌరుల హక్కులను ఎలా కాపాడతారు? ఈ చట్టం కింద ఇప్పటికే పలువురు జైళ్లలో ఉన్నారు. ఇంకా ఎందరి మీదనో ఈ చట్టం కింద అభియోగాలు మోపనున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పునఃసమీక్షకు ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించింది. ఇంతకాలమని ఇదమిత్థంగా చెప్పలేమని తుషార్ మెహతా బదులిచ్చారు. అలాంటప్పుడు సమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహ చట్టం అమలును పక్కన పెట్టాల్సిందిగా రాష్ట్రాలకు సూచించలేరా అని ధర్మాసనం ప్రశ్నించింది. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న దేశద్రోహం చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లెక్కకు మించి పిటిషన్లు దాఖలయ్యాయి. దీన్ని పునఃసమీక్షిస్తామని, అంతవరకు పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దని కేంద్రం సోమవారం సుప్రీంను కోరింది. దేశద్రోహ చట్టం కింద 2015–20 మధ్య దేశవ్యాప్తంగా 356 కేసులు నమోదయ్యాయి. మైనార్టీలను గుర్తించే అధికారం ఎవరిది? మైనార్టీలను గుర్తించడంలో పలు రాష్ట్రాల్లో కేంద్రం అనుసరిస్తున్న భిన్న వైఖరులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందువులు సహా మైనార్టీలుగా ఉన్నవారిని గుర్తించడంపై రాష్ట్ర ప్రభుత్వాలతో మూడు నెలల్లోగా సంప్రదింపులు జరపాలని జస్టిస్ కౌల్, జస్టిస్ సుందరేశ్‌లతో కూడిన∙బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. అల్ప సంఖ్యాకులైన హిందువులు, ఇతర వర్గాలకు మైనార్టీ హోదాను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని కేంద్రం మార్చిలో పేర్కొంది. కానీ మైనార్టీ హోదా ఇవ్వడంపై కేంద్రానికే సర్వాధికారాలు న్నాయని సోమవారం కోర్టుకు నివేదించింది. -
అమ్నెస్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూత
అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ, భారత్‌లో తన ఆఫీసులను తాత్కాలికంగా మూసివేసింది. బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై ఆఫీసులను మూసివేయడంతో పాటు, తమ ఈవెంట్లను పోస్ట్పోను చేస్తున్నట్టు వెల్లడించింది. స్వచ్ఛంద నిరసనకారులు తమపై దేశ ద్రోహ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు అమ్నెస్టీ నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో కశ్మీర్ అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేశారనే ఆరోపణలతో అమ్నెస్టీపై దేశ ద్రోహ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రోత్సహించారనే ఆరోపిస్తూ.. కొందరు రాజకీయ కార్యకర్తలు ఈ సంస్థ హక్కులపై వ్యతిరేకంగా మంగళవారం, బుధవారం ప్రదర్శనలు కూడా చేపట్టారు. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు మేరకు, అమ్నెస్టీ ఏర్పాటుచేసిన చర్చా కార్యక్రమంలో దేశ ద్రోహ నినాదాలు జరిగాయా..అనే దానిపై విచారణ చేపట్టామని పోలీసులు చెప్పారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, బెంగళూరు సెమినార్‌కు హాజరైన కొంతమంది ప్రజలు కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని మాత్రమే కోరుకుంటూ నినాదాలు చేశారని ఆ సంస్థ తెలిపింది. అమ్నెస్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రాతిపదికన లేకుండా కేసును నమోదుచేశారని చారిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ కార్యక్రమం అందరినీ ఆహ్వనించదగినదని, ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. కానీ సంస్థకు చెందిన ఎవరు దీనిలో పాల్గొనలేదని వివరించారు. జమ్ము కశ్మీర్‌లోని బాధితులకు న్యాయం చేసేందుకే తాము చర్చా కార్యక్రమం నిర్వహించామని అమ్నెస్టీ స్ఫష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను అమ్నెస్టీ పోలీసులకు సమర్పించింది. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్లు దీనిపై విచారణ చేపడతారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. -
మళ్లీ అఫ్జల్ గురు ప్రకంపనలు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ జాతీయ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఉగ్రవాది అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడం.. వివాదం నెలకొంది. దేశద్రోహం ఆరోపణలపై కన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహి అఫ్జల్ గురుకు అనుకూలంగా కార్యక్రమం నిర్వహించి.. జాతి వ్యతిరేక నినాదాలు చేశారంటూ ఈ వ్యవహారంపై బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తోంది. పార్లమెంట్‌పై దాడికి పురికొల్పి, పలువురిని బలిగొన్న ఉగ్రవాదికి అనుకూలంగా యూనివర్సిటీలో కార్యక్రమాలు చేపట్టడం దారుణమని ఏబీవీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలు సాఫీగా సాగిపోతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని, జెఎన్యూ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్ర హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ కూడా త్రీవంగా స్పందించారు. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి నేత అరెస్టు కావడం, వర్సిటీ హాస్టల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిచండం చోటుచేసుకున్నాయి. అసలేం జరిగింది! ఈ నెల 9న జేఎన్‌యూలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. అందులో అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అఫ్జల్‌గురును పొగుడుతూ, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. యూనివర్సిటీ మాజీ అధ్యాపకుడు కూడా అఫ్జల్‌గురును ప్రశంసిస్తూ నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఉదంతమే ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశద్రోహికి మద్ధతు పలికినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు శుక్రవారం ఇండియా గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ వ్యవహారంలో కన్నయ్య కుమార్, సహా పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మాజీ అధ్యాపకుడు ఎస్ఏఆర్ గిలానీపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్రమంత్రి కిరణ్ రిజీజూ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం దారుణమని రిజీజు మండిపడ్డారు.