Seed Capital Plan
-
సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్
రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సీడ్ కేపిటల్ ప్రణాళికను సమర్పించేందుకు రాజమండ్రి వచ్చిన సింగపూర్ బృందానికి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది. ఇక్కడి విశేషాలు వారికి చూపించేందుకు పుష్కర యాత్రికులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. తొలుత ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికార యంత్రాంగం వారికి వంగివంగి సలాములు చేస్తూ స్వాగతం పలికారు. సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ నేతృత్వంలోని 29 మంది సభ్యుల బృందాన్ని రాజమండ్రికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఆ విమానంలో మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన బృందానికి స్వయంగా సీఎం ఎదురెళ్లి స్వాగతం పలికారు. పలువురు మంత్రులు ఆయన వెంట ఉండి బృంద సభ్యులకు ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి ఈశ్వరన్, ముఖ్య సభ్యులను సీఎం హెలికాప్టర్లో 45 నిమిషాలపాటు ఏరియల్ వ్యూ ద్వారా గోదావరి నది, ఘాట్లు, అక్కడికొచ్చిన జనాన్ని చూపిం చారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలోని హెలిప్యాడ్‌లో దిగి సీడ్ కేపిటల్ సమర్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశానికి స్వయంగా తీసుకెళ్లారు. మిగిలిన బృంద సభ్యులను విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో మంత్రులు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ హోటల్‌కు తీసుకెళ్లారు.విలేకరుల సమావేశంలోనూ సీఎం చంద్రబాబు.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్, బృంద సభ్యుల పనితీరును మెచ్చుకుంటూ పొగడడానికి ఉత్సాహం చూపించారు. విలేకరుల సమావేశాన్ని సమన్వయపరిచిన పరకాల ప్రభాకర్ పలుమార్లు ఈశ్వరన్‌ను హిజ్ ఎక్సెలెన్సీ అంటూ సంభోదించడం ఆశ్చర్యపరిచింది. అనంతరం ఈశ్వరన్‌ను సీఎం తన కారులో ఎక్కించుకుని పుష్కరఘాట్‌లో జరిగే నిత్యహారతి కార్యక్రమానికి తీసుకెళ్లారు. ఇందుకోసం హోటల్ షెల్టన్ నుంచి ఘాట్‌కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. లక్షల సంఖ్యలో పుష్కర యాత్రికులు రోడ్లపై ఉన్నా వారిని ఇబ్బంది పెట్టే రీతిలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.పుష్కరాల ప్రారంభం రోజున చంద్రబాబు, వాహనశ్రేణి వల్ల ఇబ్బంది ఏర్పడిన విషయం తెలిసిందే. బృంద సభ్యుల కోసం తమ బుగ్గ కార్లను వదిలి మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ తదితరులు బస్సులో ఎక్కడం గమనార్హం. -
ప్రజల దృష్టి మరల్చడానికే!
రాజమండ్రిలో ఏపీ ‘రాజధాని’ ఆవిష్కరణ ముందుగా నిర్ణయించిన ప్రకారం జరగాల్సింది హైదరాబాద్‌లో.. వరుస ఘటనలతో మసకబారిన ఏపీ ప్రభుత్వ పనితీరు హైదరాబాద్: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతికి దారితీసిన సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఏపీ సీఎం చంద్రబాబు.. రాజధాని కథను రాజమండ్రి కేంద్రంగా నడిపించా రా? అంటే అందరినోటా అవుననే వినిపిస్తోంది. సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన సీడ్ కేపిటల్ ప్రణాళిక విడుదల కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయించడంలోని ఆంతర్యమిదేనని అంటున్నారు. మే 25న మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం అందించింది. కచ్చితంగా జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ ప్లాన్ అందిస్తామని అప్పట్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మీడియా ఎదుట ప్రకటించారు. దీని ప్రకారం ఈ నెల 14న రాజమండ్రిలో సీఎం చంద్రబాబు పుష్కరాలు ప్రారంభించి 15వ తేదీకి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చేతుల మీదుగా సీడ్ కేపిటల్ ప్లాన్ అందుకుని ఆ తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహిం చాల్సి ఉంది. అయితే 14న పుష్కరాల ప్రారంభం రోజున చంద్రబాబు ప్రచార యావకు 29 మంది బలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జాతీయ, అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది. తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. జాతీయ మీడియా సైతం బాబు తీరును తప్పుపట్టింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టులో పౌరహక్కు ల సంఘాలు వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో మొత్తం వ్యూహాన్ని మార్చారు. ఆ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు పుష్కరాలు పూర్తయ్యే వరకు రాజమండ్రిలోనే ఉంటానని వ్యూహాత్మకంగా ప్రకటించారు. కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై భౌతిక దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం, మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె, పుష్కరఘాట్‌లో తొక్కిసలాట వంటి ఘటనలతో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు పూర్తిగా మసకబారింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో.. సిం గపూర్ సంస్థలు తుది ప్రణాళికను సమర్పించకముం దే రాజధాని ఇలా ఉండబోతోందంటూ నాలుగు ఊహా చిత్రాలను విడుదల చేసి ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేశారు. తాజాగా సోమవారం సింగపూర్ నుంచి వచ్చిన ప్రతినిధి బృందాన్ని నేరుగా రాజమండ్రి రప్పించి అక్కడే సీడ్ కేపిటల్ ప్లాన్ అందజేసే ఏర్పాట్లు చేశారని విమర్శలొస్తున్నాయి. -
సీడ్ కేపిటల్ ప్లాన్‌లో అంశాలివే..
హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతి స్మార్ట్, హరిత, విపత్తులను తట్టుకునే సామర్థ్యం గల నగరంగా అభివృద్ధి చెందేందుకు సింగపూర్ ప్రభుత్వం అందించిన సీడ్ కేపిటల్ ప్లాన్ (ప్రధాన రాజధాని ప్రణాళిక) మార్గనిర్దేశం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి సింగపూర్ ప్రభుత్వం సీడ్ కేపిటల్ ప్లాన్‌ను సోమవారం రాజమండ్రిలో అందించింది. ఏపీ ప్రభుత్వ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉజ్వలమైన, విభిన్నమైన, సమ్మిళితమైన, అధునాతనమైన నగరంగా కొత్త రాజధాని రూపొందించాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రణాళిక తయారైందని హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అద్భుత నగరాల ఆరంభాలు ఈ విధంగానే మొదలవుతాయి. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించటం అనే చిన్న పనిలో భాగం పంచుకోవడం సింగపూర్‌కు గర్వకారణంగా ఉందని’ ఆ దేశ పరిశ్రమల మంత్రి షణ్ముగం పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. కొత్త రాజధాని నగర అభివృద్ధికి సహకరించటంలో ఇక్కడి నుంచే ఏపీ ప్రభుత్వంతో తమ భాగస్వామ్యం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. అమరావతి అభివృద్ధిలో తమ సహకారం ఇకపైనా కొనసాగిస్తామన్నారు. సీడ్ కేపిటల్ ప్లాన్‌లో ప్రధానాంశాలు ►వ్యాపారం, నివాసాలకు వీలుగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్(సీబీడీ) సృష్టించటమే సీడ్ కేపిటల్ ఏరియా ఉద్దేశం. ►సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మాస్టర్ ప్లాన్‌లో డెవలప్మెంట్ కారిడార్లను పొందుపరిచారు. దీన్ని ఐదు దశల్లో అభివృద్ధి చేస్తారు. ►వివిధ జోన్లలో సీబీడీ, రెసిడెన్షియల్ టౌన్ షిప్‌లు, వివిధ సంస్థలు, పార్కులు, ఉద్యానవనాలు, సరస్సులు, వినోద ప్రాంతాలు, వాటర్‌ఫ్రంట్ తదితరాలుంటాయి. ►రాజధాని నగరం తరహాలోనే సమగ్రాభివృద్ధి సూత్రాల ప్రకారమే ప్రణాళికలు తయారు చేశారు. ►పౌరులకు విసృ్తత రవాణా సదుపాయాల కల్పనలో భాగంగా మెట్రో రైల్ వర్క్ 12 కి.మీ., బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం 15 కి.మీ., డౌన్‌టౌన్ రోడ్ 7 కి.మీ., ఆర్టీరియల్ రోడ్లు, సబ్ ఆర్టీరియల్ రోడ్లు 27 కి.మీ., కలెక్టర్ రోడ్లు 53 కి.మీ., అత్యున్నత రవాణా వ్యవస్థను ఈ ప్లాన్‌లో ప్రస్తావించారు. ►సుస్థిరమైన అభివృద్ధి సూత్రాలపై నగర ప్రణాళిక రూపొందించారు. పట్టణ పర్యావరణ వ్యవస్థకు అదనపు బలం చేకూర్చారు. విసృ్తతమైన, విశాలమైన బహిరంగ హరిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సుందర శోభిత ఆకర్షణీయ జనావాసాలతో కొత్త రాజధాని నగరాన్ని ఈ ల్యాండ్ స్కేప్ ఆవిష్కరిస్తోంది. ►కన్వెన్షన్, కల్చరల్ సెంటర్, సిటీ గేట్ వే, ప్రభుత్వ సముదాయాలు తదితర ప్రతిష్టాత్మక నిర్మాణాలు పొందుపరిచారు. ►అత్యుత్తమ నగర పర్యావ రణ వ్యవస్థ ప్రస్తుత రాజధాని ప్రాంతం రూపొందేందుకు సీడ్ కేపిటల్ ఏరియాను సమీకృతం చేస్తుంది. ►ఉపాధి కల్పన, పెట్టుబడుల భాగస్వామిని ఎంపిక చేశాక పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో సీడ్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తారు. ►సీడ్ కేపిటల్ ఏరియాను సుమారు 3 లక్షల మంది నివాసం ఉండేలా రూపొందించారు. ఉజ్వలమైన బిజినెస్ హబ్‌గా రూపొందే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు సహా వివిధ రంగాలలో దాదాపు ఏడు లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని అంచనా. ►వాహన రహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూ 25 కి.మీ. పైబడి విసృ్తతమైన నడక మార్గాలు, సైకిల్‌పై కార్యాలయాలకు వెళ్లి వచ్చేలా రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కసరత్తు చేశారు. ►వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ధి పునర్వినియోగానికి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసి సురక్షిత, ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పేందుకు ప్రతిపాదనలు ఈ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు. -
రైతుల వాటా భూములెక్కడ?
సీడ్ క్యాపిటల్ ప్లాన్‌ను నేడు సీఎంకు అందించనున్న సింగపూర్ బృందం * రైతులకు స్థలాలు ఎక్కడ వస్తాయో చెప్పలేమంటున్న అధికారులు * సొంత గ్రామాల్లో ఇవ్వడం కష్టమేనని స్పష్టీకరణ * ఆందోళనలో రాజధాని ప్రాంత అన్నదాతలు సాక్షి, హైదరాబాద్: ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సేవలను మరిచిపోలేం. వారికిచ్చే వాటా భూముల కింద రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్ల స్థలాలను సొంత గ్రామాల్లోనే ఇచ్చేటట్లు చూస్తాం. రాజధాని మాస్టర్ ప్లాన్ తర్వాతే ఎక్కడ స్థలాలు ఇస్తామో చెబుతాం’’.... రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ పలుమార్లు చేసిన ప్రకటనలు ఇవీ. కానీ, ఆచరణలోకి మాత్రం రావడం లేదు. సీడ్ క్యాపిటల్ ప్లాన్ కూడా అందుతున్న తరుణంలో రైతుల వాటా భూములపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ ప్లాన్‌ను అందిస్తుండడంతో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్రణాళికలు దాదాపు సిద్ధమైనట్లే. అయితే, సర్కారు మాత్రం రైతుల వాటా భూములు ఎక్కడుంటాయో మాత్రం చెప్పడం లేదు. రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అందిన తర్వాతే రైతుల వాటా భూములు ఎక్కడ వస్తాయో వెల్లడిస్తామని సీఆర్డీఏ వర్గాలు పలుమార్లు ప్రకటించాయి. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ అందించి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం ఇవ్వనున్న సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌తో రాజధాని నిర్మాణానికి అన్ని రకాల ప్రణాళికలు అందించే ప్రక్రియ పూర్తయినట్లే. రాష్ట్ర ప్రభుత్వం ఇక స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికపై దృష్టి సారించనుంది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఏయే ప్రాంతాల్లో కమర్షియల్, రెసిడెన్షియల్ స్థలాలు వస్తాయన్నది చెప్పలేమని సీఆర్డీఏ అధికారులు అంటుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ గ్రామానికి చెందిన రైతులకు ఆ గ్రామంలోనే స్థలాలు ఇవ్వడం కష్టమని అధికారులు తేల్చి చెబుతున్నారు. మొత్తం 33 వేల ఎకరాలకు పైగా భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు 25,200 ఎకరాలకు మాత్రమే రైతులు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. మిగిలిన 8 వేల ఎకరాలకు గాను ఒప్పందాలు చేసుకునేందుకు రైతులు ముందుకు రాకపోవడం గమనార్హం. హైదరాబాద్‌కు చేరుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సీడ్ క్యాపిటల్ ప్లాన్ అందించేందుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తన బృందంతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సింగపూర్ బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకోనుంది. ఈ బృందానికి గోదావరి పుష్కర సాన్నాలు చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పుష్కర స్నానాల అనంతరమే సీడ్ క్యాపిటల్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని విస్తీర్ణం పెంపు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెంచింది. తొలుత సిటీ విస్తీర్ణాన్ని 212 చదరపు కిలోమీటర్ల మేరకే పరిమితం చేస్తూ సింగపూర్ కంపెనీలు క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. అయితే తాజాగా ప్రభుత్వ సూచనల మేరకు క్యాపిటల్ సిటీ పరిధిని అదనంగా 162 చదరపు కిలోమీటర్ల మేరకు సింగపూర్ కంపెనీలు పెంచాయి. ఈ పెంపుతో మొత్తం రాజధాని నగర విస్తీర్ణం 212 చదరపు కిలోమీటర్ల నుంచి 374 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. కృష్ణా నది అవతలి ఒడ్డు తొలుత క్యాపిటల్ సిటీలో లేదు. ఇప్పుడు పరిధి పెంచడం ద్వారా కృష్ణా నది అవతలి ఒడ్డును కూడా సిటీ మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. కృష్ణా నది అవతలి ఒడ్డులో 30 చదరపు కిలోమీటర్లను నగర పరిధిలోకి తీసుకొచ్చారు.