సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్ | Entrepreneurs, Singapore experts invited for meet on AP | Sakshi
Sakshi News home page

సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్

Published Tue, Jul 21 2015 1:05 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్ - Sakshi

సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్

రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సీడ్ కేపిటల్ ప్రణాళికను సమర్పించేందుకు రాజమండ్రి వచ్చిన సింగపూర్ బృందానికి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది. ఇక్కడి విశేషాలు వారికి చూపించేందుకు పుష్కర యాత్రికులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. తొలుత ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికార యంత్రాంగం వారికి వంగివంగి సలాములు చేస్తూ స్వాగతం పలికారు. సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ నేతృత్వంలోని 29 మంది సభ్యుల బృందాన్ని రాజమండ్రికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.

ఆ విమానంలో మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన బృందానికి స్వయంగా సీఎం ఎదురెళ్లి స్వాగతం పలికారు. పలువురు మంత్రులు ఆయన వెంట ఉండి బృంద సభ్యులకు ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి ఈశ్వరన్, ముఖ్య సభ్యులను సీఎం హెలికాప్టర్‌లో 45 నిమిషాలపాటు ఏరియల్ వ్యూ ద్వారా గోదావరి నది, ఘాట్లు, అక్కడికొచ్చిన జనాన్ని చూపిం చారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలోని హెలిప్యాడ్‌లో దిగి సీడ్ కేపిటల్ సమర్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశానికి స్వయంగా తీసుకెళ్లారు.

మిగిలిన బృంద సభ్యులను విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో మంత్రులు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ హోటల్‌కు తీసుకెళ్లారు.విలేకరుల సమావేశంలోనూ సీఎం చంద్రబాబు.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్, బృంద సభ్యుల పనితీరును మెచ్చుకుంటూ పొగడడానికి ఉత్సాహం చూపించారు. విలేకరుల సమావేశాన్ని సమన్వయపరిచిన పరకాల ప్రభాకర్ పలుమార్లు ఈశ్వరన్‌ను హిజ్ ఎక్సెలెన్సీ అంటూ సంభోదించడం ఆశ్చర్యపరిచింది. అనంతరం ఈశ్వరన్‌ను సీఎం తన కారులో ఎక్కించుకుని పుష్కరఘాట్‌లో జరిగే నిత్యహారతి కార్యక్రమానికి తీసుకెళ్లారు.

ఇందుకోసం హోటల్ షెల్టన్ నుంచి ఘాట్‌కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. లక్షల సంఖ్యలో పుష్కర యాత్రికులు రోడ్లపై ఉన్నా వారిని ఇబ్బంది పెట్టే రీతిలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.పుష్కరాల ప్రారంభం రోజున చంద్రబాబు, వాహనశ్రేణి వల్ల ఇబ్బంది ఏర్పడిన విషయం తెలిసిందే. బృంద సభ్యుల కోసం తమ బుగ్గ కార్లను వదిలి మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ తదితరులు బస్సులో ఎక్కడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement