సీడ్ కేపిటల్ ప్లాన్‌లో అంశాలివే..
హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతి స్మార్ట్, హరిత, విపత్తులను తట్టుకునే సామర్థ్యం గల నగరంగా అభివృద్ధి చెందేందుకు సింగపూర్ ప్రభుత్వం అందించిన సీడ్ కేపిటల్ ప్లాన్ (ప్రధాన రాజధాని ప్రణాళిక) మార్గనిర్దేశం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి సింగపూర్ ప్రభుత్వం సీడ్ కేపిటల్ ప్లాన్‌ను సోమవారం రాజమండ్రిలో అందించింది. ఏపీ ప్రభుత్వ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉజ్వలమైన, విభిన్నమైన, సమ్మిళితమైన, అధునాతనమైన నగరంగా కొత్త రాజధాని రూపొందించాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రణాళిక తయారైందని హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘అద్భుత నగరాల ఆరంభాలు ఈ విధంగానే మొదలవుతాయి. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించటం అనే చిన్న పనిలో భాగం పంచుకోవడం సింగపూర్‌కు గర్వకారణంగా ఉందని’ ఆ దేశ పరిశ్రమల మంత్రి షణ్ముగం పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. కొత్త రాజధాని నగర అభివృద్ధికి సహకరించటంలో ఇక్కడి నుంచే ఏపీ ప్రభుత్వంతో తమ భాగస్వామ్యం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. అమరావతి అభివృద్ధిలో తమ సహకారం ఇకపైనా కొనసాగిస్తామన్నారు.
సీడ్ కేపిటల్ ప్లాన్‌లో ప్రధానాంశాలు
►వ్యాపారం, నివాసాలకు వీలుగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్(సీబీడీ) సృష్టించటమే సీడ్ కేపిటల్ ఏరియా ఉద్దేశం.
►సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మాస్టర్ ప్లాన్‌లో డెవలప్‌మెంట్ కారిడార్‌లను పొందుపరిచారు. దీన్ని ఐదు దశల్లో అభివృద్ధి చేస్తారు.
►వివిధ జోన్లలో సీబీడీ, రెసిడెన్షియల్ టౌన్ షిప్‌లు, వివిధ సంస్థలు, పార్కులు, ఉద్యానవనాలు, సరస్సులు, వినోద ప్రాంతాలు, వాటర్‌ఫ్రంట్ తదితరాలుంటాయి.
►రాజధాని నగరం తరహాలోనే సమగ్రాభివృద్ధి సూత్రాల ప్రకారమే ప్రణాళికలు తయారు చేశారు.
►పౌరులకు విసృ్తత రవాణా సదుపాయాల కల్పనలో భాగంగా మెట్రో రైల్ వర్క్ 12 కి.మీ., బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం 15 కి.మీ., డౌన్‌టౌన్ రోడ్ 7 కి.మీ., ఆర్టీరియల్ రోడ్లు, సబ్ ఆర్టీరియల్ రోడ్లు 27 కి.మీ., కలెక్టర్ రోడ్లు 53 కి.మీ., అత్యున్నత రవాణా వ్యవస్థను ఈ ప్లాన్‌లో ప్రస్తావించారు.
►సుస్థిరమైన అభివృద్ధి సూత్రాలపై నగర ప్రణాళిక రూపొందించారు. పట్టణ పర్యావరణ వ్యవస్థకు అదనపు బలం చేకూర్చారు.
విసృ్తతమైన, విశాలమైన బహిరంగ హరిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సుందర శోభిత ఆకర్షణీయ జనావాసాలతో కొత్త రాజధాని నగరాన్ని ఈ ల్యాండ్ స్కేప్ ఆవిష్కరిస్తోంది.
►కన్వెన్షన్, కల్చరల్ సెంటర్, సిటీ గేట్ వే, ప్రభుత్వ సముదాయాలు తదితర ప్రతిష్టాత్మక నిర్మాణాలు పొందుపరిచారు.
►అత్యుత్తమ నగర పర్యావ రణ వ్యవస్థ ప్రస్తుత రాజధాని ప్రాంతం రూపొందేందుకు సీడ్ కేపిటల్ ఏరియాను సమీకృతం చేస్తుంది.
►ఉపాధి కల్పన, పెట్టుబడుల భాగస్వామిని ఎంపిక చేశాక పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో సీడ్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తారు.
►సీడ్ కేపిటల్ ఏరియాను సుమారు 3 లక్షల మంది నివాసం ఉండేలా రూపొందించారు. ఉజ్వలమైన బిజినెస్ హబ్‌గా రూపొందే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు సహా వివిధ రంగాలలో దాదాపు ఏడు లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని అంచనా.
►వాహన రహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూ 25 కి.మీ. పైబడి విసృ్తతమైన నడక మార్గాలు, సైకిల్‌పై కార్యాలయాలకు వెళ్లి వచ్చేలా రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కసరత్తు చేశారు.
►వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ధి పునర్వినియోగానికి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసి సురక్షిత, ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పేందుకు ప్రతిపాదనలు ఈ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు.