షరపోవాకు ‘చెక్’
సఫరోవా సంచలనం
* డిఫెండింగ్ చాంపియన్‌పై గెలుపు
* శ్రమించి నెగ్గిన సెరెనా ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: వరుసగా నాలుగో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరాలని ఆశించిన రెండో సీడ్ మరియా షరపోవాకు చుక్కెదురైంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ షరపోవా 6-7 (3/7), 4-6తో 13వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది.
గత ఐదేళ్లలో షరపోవాపై ఒక్కసారి కూడా నెగ్గలేకపోయిన సఫరోవా అన్ని ఓటములకు ఈ ఒక్క విజయంతో లెక్క సరిచేసింది. ఇటీవల కాలంలో సఫరోవాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మూడు సెట్లలో నెగ్గి ఊపిరి పీల్చుకున్న షరపోవా ఈసారి మాత్రం వరుస సెట్లలోనే చేతులెత్తేసింది.
గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సఫరోవా రెండు సెట్లలోనూ తొలుత ఆధిక్యంలో నిలిచి ఆ తర్వాత తడబడి మళ్లీ పుంజుకోవడం విశేషం. తొలి సెట్ ఆరంభంలోనే 3-1తో ఆధిక్యంలోకి వెళ్లిన సఫరోవా ఆ తర్వాత తన సర్వీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. కీలకమైన టైబ్రేక్‌లో సఫరోవా చెలరేగి 6-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి అదే ఊపులో సెట్‌ను దక్కించుకుంది.
రెండో సెట్ కూడా ఇంచుమించు తొలి సెట్ మాదిరిగానే సాగింది. తొలుత సఫరోవా 3-0తో ముందంజ వేసి ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు కోల్పోయింది. 3-3తో స్కోరు సమమైన దశలో షరపోవా, సఫరోవా తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. సఫరోవా 5-4తో ఆధిక్యంలో ఉన్నపుడు పదో గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
క్వార్టర్ ఫైనల్లో 21వ సీడ్ ముగురుజా (స్పెయిన్)తో సఫరోవా ఆడుతుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగురుజా 6-3, 6-4తో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)పై గెలిచింది. తొలి సెట్లో 0-2తో, రెండో సెట్లో 1-4తో వెనుకబడిన దశ నుంచి ముగురుజా విజయాన్ని అందుకోవడం విశేషం. గతేడాది ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను ఓడించి ముగురుజా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
లెక్క సరిచేసిన చెల్లి
టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ మరోసారి కష్టపడి గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా 1-6, 7-5, 6-3తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. ఈ గెలుపుతో తొలి రౌండ్లో తన అక్క వీనస్ విలియమ్స్‌ను ఓడించి స్టీఫెన్స్‌తో సెరెనా లెక్క సరిచేసింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా తొలి సెట్‌కే కేవలం 23 నిమిషాల్లో కోల్పోయింది. రెండో సెట్లో కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను కాచుకొని కీలకదశలో స్టీఫెన్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌లో నిలి చింది. మూడో సెట్లో రెండుసార్లు స్టీఫెన్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా గట్టెక్కింది. మరో మ్యాచ్‌లో సారా ఎరాని (ఇటలీ) 6-2, 6-2తో జూలియా (జర్మనీ)పై గెలిచింది.
క్వార్టర్స్‌లో ‘ఆ నలుగురు’
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), ఆరో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్ 6-1, 6-2, 6-3తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై నెగ్గగా... ఫెడరర్ 6-3, 4-6, 6-4, 6-1తో 13వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలిచాడు.
ఆండీ ముర్రే 6-4, 3-6, 6-3, 6-2తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై, నాదల్ 6-3, 6-1, 5-7, 6-2తో జాక్ సాక్ (అమెరికా)పై, ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-2, 6-2, 6-4తో తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించారు. క్వార్టర్స్‌లో జొకోవిచ్‌తో నాదల్; వావ్రింకా (స్విట్జర్లాండ్)తో ఫెడరర్; నిషికోరి (జపాన్)తో సోంగా (ఫ్రాన్స్), ఫెరర్‌తో ముర్రే ఆడతారు.
నేటి క్వార్టర్స్ సా. గం. 5.30 నుంచి నియో ప్రైమ్‌లో లైవ్