seed production centre
-
విత్తనోత్పత్తి అంతా ఉత్తిదే..!
మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. క్షేత్ర నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఎవుసం మూలనపడుతోంది. ఇక్కడ పనిచేయడం ఇష్టంలేని అధికారులు.. డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో క్షేత్రాన్ని పట్టించుకునేవారు లేకుండాపోయారు. దీంతో సాగు విస్తీర్ణం 400 ఎకరాలనుంచి 60 ఎకరాలకు పడిపోయింది. సాక్షి, కామారెడ్డి: నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో 1965లో విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి 801 ఎకరాల స్థలాన్ని కే టాయించారు. సారవంతమైన నేల కావడం తోపాటు నీటి సౌకర్యం కూడా ఉంది. వరితో పాటు కంది పంటలు సాగు చేస్తారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వ్తితనాన్ని ఫౌండేషన్ సీడ్‌గా అందిస్తారు. సమీపంలో ఉన్న పోచారం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి 30 హెచ్‌పీ మోటార్‌తో నీటిని క్షేత్రానికి ఎత్తిపోస్తారు. దాదాపు వంద ఎకరాలకు సరిపడా నీరు అందుతుంది. క్షేత్రంలో 17 బోర్లు ఉండగా, 11 బోర్లు పని చేస్తున్నాయి. గతంలో ఒక వెలుగు వెలిగిన మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రం.. రానురాను సర్కారు తీరుతో నిర్లక్ష్యానికి గురైంది. సాగు విస్తీర్ణం తగ్గిపోయి ప్రాభవాన్ని కోల్పోయింది. జిల్లాల పునర్విభజనతో.. కామారెడ్డి జిల్లా ఏర్పాటు కావడంతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉండడం, కొత్త జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన సత్యనారాయణ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వ్యవసాయ క్షేత్రానికి నిధులు అందాయి. రెండేళ్ల క్రితం పూర్వవైభవం దిశగా అడుగులు పడ్డాయి. క్షేత్రంలో దాదాపు అన్ని పోస్టులు భర్తీ చేసేలా అప్పటి మంత్రి పోచారం చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ సత్యనారాయణ నెలలో నాలుగైదుసార్లు ఈ క్షేత్రాన్ని సందర్శించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ క్షేత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అధికారులు డిప్యూటేషన్‌పై... మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో అధికారులు, సిబ్బందితో కలిపి 14 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు. ఐదుగురు అధికారులు తమ పలుకుబడితో ఇతర జిల్లాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. కింది స్థాయిలో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఏడీఏ తన పలుకుబడితో హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇద్దరు ఏవోలు ఉండగా.. ఒకరు నల్గొండకు డిప్యూటేషన్‌పై వెళ్లగా, ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ క్షేత్రానికి ఆయనే పెద్ద దిక్కు. సీనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్‌పై వెళ్లారు. నాలుగు ఏఈవో పోస్టులుండగా.. ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఇందులోనూ ఇద్దరు డిప్యూటేషన్ పై వెళ్లడంతో ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు. ఉన్న ఒక్క అటెండర్ పోస్టూ ఖాళీగానే ఉంది. వాచ్‌మన్ ఉన్నారు. ట్రాక్టర్ క్లీనర్ పోస్టులు మూడు ఉండగా.. ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నా రు. రెం డు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టోర్ కీపర్ పోస్టు ఒక్కటి ఉండగా.. అదీ ఖాళీగానే ఉంది. అధికారులు, సిబ్బంది కొరత క్షేత్రాన్ని పీడిస్తుండడంతో పూర్తి స్థాయిలో పంటలు సాగు కావడం లేదు. పదివేల ఎకరాలకు ఫౌండేషన్ సీడ్‌ను అందించే ఈ క్షేత్రం ఇప్పుడు దీనావస్థకు చేరింది. క్షేత్ర పరిశీలన, పర్యవేక్షణ, నిర్వహణ భారంగా మారడంతో ఉన్న నలుగురు ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది. పడిపోయిన సాగు విస్తీర్ణం మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో 2017–18 ఖరీఫ్ సీజన్లో 4 వందల ఎకరాల్లో వరి, కంది పంటలు సాగయ్యాయి. అదే ఏడాది యాసంగిలో వంద ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 2018–19 ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 220 ఎకరాలకు, యాసంగిలో వంద ఎకరాలకు పడిపోయింది. ప్రస్తుతం(ఖరీఫ్) 60 ఎకరాల్లోనే పంటలు సాగు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అధికారులు, సిబ్బంది లేకపోవడమే.. ఇక్కడ పనిచేసే ఏడీఏ పలుకుబడితో హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లగా, ఎల్లారెడ్డి ఏడీఏ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు, సిబ్బంది కొరతతో విత్తన క్షేత్రం ప్రాభవాన్ని కోల్పోతోంది. ఉన్నతాధికారులు స్పందించి, అధికారుల డిప్యూటేషన్లను రద్దు చేసి విత్తనోత్పత్తి క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. -
విత్తన ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ
ఆ దిశగా చర్యలు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి సీఎం దత్తత గ్రామాల్లో పర్యటన జగదేవ్‌పూర్: తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్, వ్యవసాయ అనుబంధ శాఖల కార్యదర్శి పార్థసారథి అన్నారు. మంగళవారం సీఎం దత్తత గ్రామాలైన జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేటలో రాష్ట్ర విత్తన ఉత్పత్తి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళి, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకటరామ్‌రెడ్డిలతో కలిసి సోయాబీన్ పంటను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖీ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ... రాష్ట్రంలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నీటి కుంటల పునరుద్ధరణతోపాటు వివిధ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మొదటిసారిగా దాదాపు 5 లక్షల హెక్టార్లలో పత్తి సాగు నుంచి ఇతర పంటల సాగుకు ప్రోత్సహించినట్టు తెలిపారు. వర్ష ఆధారిత ప్రాంతమైన రాష్ట్రంలో పత్తిసాగును రైతులు తగ్గించి ఉద్యాన సాగు ద్వారా తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. నాణ్యమైన సోయాబీన్ విత్తన ఉత్పత్తి పంట సస్యరక్షణకు క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తల సూచనల మేరకు సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. 2.5 లక్షల హెక్టార్ల పప్పు ధాన్యాలు సాగవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 520 గ్రామాల్లో దాదాపు 10 వేల మంది రైతులు 45 వేల హెక్టార్లలో సోయాబీన్ విత్తన ఉత్పత్తి సాగు చేస్తున్నారని చెప్పారు. వారం పది రోజులుగా వర్షాలు లేక మొక్కజొన్న ఎండిపోతుందని, సోయాబీన్ ఆరిపోతుందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన రాష్ట్రంలో పంటల పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు పార్థసారథి తెలిపారు. రైతులకు పంట రక్షణ కోసం సాంకేతిక సలహాలిస్తామన్నారు. 27 తర్వాత మంచి వర్షాలు ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. సీఎం దత్తత గ్రామాల్లో పంట రక్షణ కోసం బోరుబావి ఉన్న రైతుకు స్ప్రింక్లర్లను అందించాలని ఆదేశించారు. తపాస్‌పల్లి డ్యాం నుంచి రెండు గ్రామాల్లో చెరువు, కుంటలకు నీరు ఇప్పుడు సాధ్యకాదని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం అలోచిస్తుందన్నారు. డబల్ బెడ్రూమ్ ఇళ్లు అద్భుతం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అద్భుతంగా ఉన్నాయని పార్థసారథి అన్నారు. ఎర్రవల్లిలో నమూనా ఇంటిని ఆయన పరిశీలించారు. ఆయన వెంట జేడీఏ మాధవిశ్రీలత, ఉద్యాన శాఖ డీడీ రామలక్ష్మి, ఏడీఏ అశోక్‌కుమార్, గఢా అధికారి హన్మంతరావు, ఏఓ నాగరాజు, ఏఈఓ దామోదర్, సర్పంచ్‌లు భాగ్య, బాల్‌రెడ్డి, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి, కృష్ణ, బాల్‌రాజు, వెంకట్‌రెడ్డి, సత్తయ్య, మల్లేశం రైతులు, మహిళలు పాల్గొన్నారు.