విత్తనోత్పత్తి అంతా ఉత్తిదే..! | Malthummeda Seed Production Center Is Under Negligence | Sakshi
Sakshi News home page

విత్తనోత్పత్తి అంతా ఉత్తిదే..!

Published Mon, Aug 5 2019 1:28 PM | Last Updated on Mon, Aug 5 2019 1:28 PM

Malthummeda Seed Production Center Is Under Negligence - Sakshi

విత్తనోత్పత్తి క్షేత్రంలో సాగు పనులు(ఫైల్‌)

మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. క్షేత్ర నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఎవుసం మూలనపడుతోంది. ఇక్కడ పనిచేయడం ఇష్టంలేని అధికారులు.. డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో క్షేత్రాన్ని పట్టించుకునేవారు లేకుండాపోయారు. దీంతో సాగు విస్తీర్ణం 400 ఎకరాలనుంచి 60 ఎకరాలకు పడిపోయింది.

సాక్షి, కామారెడ్డి: నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో 1965లో విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి 801 ఎకరాల స్థలాన్ని కే టాయించారు. సారవంతమైన నేల కావడం తోపాటు నీటి సౌకర్యం కూడా ఉంది. వరితో పాటు కంది పంటలు సాగు చేస్తారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వ్తితనాన్ని ఫౌండేషన్‌ సీడ్‌గా అందిస్తారు. సమీపంలో ఉన్న పోచారం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ నుంచి 30 హెచ్‌పీ మోటార్‌తో నీటిని క్షేత్రానికి ఎత్తిపోస్తారు. దాదాపు వంద ఎకరాలకు సరిపడా నీరు అందుతుంది. క్షేత్రంలో 17 బోర్లు ఉండగా, 11 బోర్లు పని చేస్తున్నాయి. గతంలో ఒక వెలుగు వెలిగిన మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రం.. రానురాను సర్కారు తీరుతో నిర్లక్ష్యానికి గురైంది. సాగు విస్తీర్ణం తగ్గిపోయి ప్రాభవాన్ని కోల్పోయింది.

జిల్లాల పునర్విభజనతో..
కామారెడ్డి జిల్లా ఏర్పాటు కావడంతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉండడం, కొత్త జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన సత్యనారాయణ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వ్యవసాయ క్షేత్రానికి నిధులు అందాయి. రెండేళ్ల క్రితం పూర్వవైభవం దిశగా అడుగులు పడ్డాయి. క్షేత్రంలో దాదాపు అన్ని పోస్టులు భర్తీ చేసేలా అప్పటి మంత్రి పోచారం చర్యలు తీసుకున్నారు. కలెక్టర్‌ సత్యనారాయణ నెలలో నాలుగైదుసార్లు ఈ క్షేత్రాన్ని సందర్శించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ క్షేత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.

అధికారులు డిప్యూటేషన్‌పై...
మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో అధికారులు, సిబ్బందితో కలిపి 14 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు. ఐదుగురు అధికారులు తమ పలుకుబడితో ఇతర జిల్లాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. కింది స్థాయిలో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఏడీఏ తన పలుకుబడితో హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇద్దరు ఏవోలు ఉండగా.. ఒకరు నల్గొండకు డిప్యూటేషన్‌పై వెళ్లగా, ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ క్షేత్రానికి ఆయనే పెద్ద దిక్కు. సీనియర్‌ అసిస్టెంట్‌ డిప్యూటేషన్‌పై వెళ్లారు. నాలుగు ఏఈవో పోస్టులుండగా.. ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఇందులోనూ ఇద్దరు డిప్యూటేషన్‌ పై వెళ్లడంతో ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు.

ఉన్న ఒక్క అటెండర్‌ పోస్టూ ఖాళీగానే ఉంది. వాచ్‌మన్‌ ఉన్నారు. ట్రాక్టర్‌ క్లీనర్‌ పోస్టులు మూడు ఉండగా.. ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నా రు. రెం డు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టోర్‌ కీపర్‌ పోస్టు ఒక్కటి ఉండగా.. అదీ ఖాళీగానే ఉంది. అధికారులు, సిబ్బంది కొరత క్షేత్రాన్ని పీడిస్తుండడంతో పూర్తి స్థాయిలో పంటలు సాగు కావడం లేదు. పదివేల ఎకరాలకు ఫౌండేషన్‌ సీడ్‌ను అందించే ఈ క్షేత్రం ఇప్పుడు దీనావస్థకు చేరింది. క్షేత్ర పరిశీలన, పర్యవేక్షణ, నిర్వహణ భారంగా మారడంతో ఉన్న నలుగురు ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది.

పడిపోయిన సాగు విస్తీర్ణం
మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో 2017–18 ఖరీఫ్‌ సీజన్‌లో 4 వందల ఎకరాల్లో వరి, కంది పంటలు సాగయ్యాయి. అదే ఏడాది యాసంగిలో వంద ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 2018–19 ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 220 ఎకరాలకు, యాసంగిలో వంద ఎకరాలకు పడిపోయింది. ప్రస్తుతం(ఖరీఫ్‌) 60 ఎకరాల్లోనే పంటలు సాగు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అధికారులు, సిబ్బంది లేకపోవడమే.. ఇక్కడ పనిచేసే ఏడీఏ పలుకుబడితో హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లగా, ఎల్లారెడ్డి ఏడీఏ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు, సిబ్బంది కొరతతో విత్తన క్షేత్రం ప్రాభవాన్ని కోల్పోతోంది. ఉన్నతాధికారులు స్పందించి, అధికారుల డిప్యూటేషన్లను రద్దు చేసి విత్తనోత్పత్తి క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement