Nagireddypet
-
ఆఖరి మజిలీకీ అవస్థలే !
సాక్షి, నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): శ్మశానవాటికకు సరైన దారిలేక కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పెద్దఆత్మకూర్, చిన్నఆత్మకూర్ గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా చనిపోతే పాడెను పంటపొలాల ఒడ్లపై నుంచి అవస్థలు పడుతూ శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పెద్దఆత్మకూర్ గ్రామానికి చెందిన నాయికోటి రాములు అలియాస్ దుబాయి రాములు అనారోగ్యంతో గురువారం మృతి అదే పరిస్థితి ఏర్పడింది. మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
విత్తనోత్పత్తి అంతా ఉత్తిదే..!
మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. క్షేత్ర నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఎవుసం మూలనపడుతోంది. ఇక్కడ పనిచేయడం ఇష్టంలేని అధికారులు.. డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో క్షేత్రాన్ని పట్టించుకునేవారు లేకుండాపోయారు. దీంతో సాగు విస్తీర్ణం 400 ఎకరాలనుంచి 60 ఎకరాలకు పడిపోయింది. సాక్షి, కామారెడ్డి: నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో 1965లో విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి 801 ఎకరాల స్థలాన్ని కే టాయించారు. సారవంతమైన నేల కావడం తోపాటు నీటి సౌకర్యం కూడా ఉంది. వరితో పాటు కంది పంటలు సాగు చేస్తారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వ్తితనాన్ని ఫౌండేషన్ సీడ్‌గా అందిస్తారు. సమీపంలో ఉన్న పోచారం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి 30 హెచ్‌పీ మోటార్‌తో నీటిని క్షేత్రానికి ఎత్తిపోస్తారు. దాదాపు వంద ఎకరాలకు సరిపడా నీరు అందుతుంది. క్షేత్రంలో 17 బోర్లు ఉండగా, 11 బోర్లు పని చేస్తున్నాయి. గతంలో ఒక వెలుగు వెలిగిన మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రం.. రానురాను సర్కారు తీరుతో నిర్లక్ష్యానికి గురైంది. సాగు విస్తీర్ణం తగ్గిపోయి ప్రాభవాన్ని కోల్పోయింది. జిల్లాల పునర్విభజనతో.. కామారెడ్డి జిల్లా ఏర్పాటు కావడంతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉండడం, కొత్త జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన సత్యనారాయణ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వ్యవసాయ క్షేత్రానికి నిధులు అందాయి. రెండేళ్ల క్రితం పూర్వవైభవం దిశగా అడుగులు పడ్డాయి. క్షేత్రంలో దాదాపు అన్ని పోస్టులు భర్తీ చేసేలా అప్పటి మంత్రి పోచారం చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ సత్యనారాయణ నెలలో నాలుగైదుసార్లు ఈ క్షేత్రాన్ని సందర్శించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ క్షేత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అధికారులు డిప్యూటేషన్‌పై... మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో అధికారులు, సిబ్బందితో కలిపి 14 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు. ఐదుగురు అధికారులు తమ పలుకుబడితో ఇతర జిల్లాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. కింది స్థాయిలో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఏడీఏ తన పలుకుబడితో హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇద్దరు ఏవోలు ఉండగా.. ఒకరు నల్గొండకు డిప్యూటేషన్‌పై వెళ్లగా, ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ క్షేత్రానికి ఆయనే పెద్ద దిక్కు. సీనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్‌పై వెళ్లారు. నాలుగు ఏఈవో పోస్టులుండగా.. ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఇందులోనూ ఇద్దరు డిప్యూటేషన్ పై వెళ్లడంతో ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు. ఉన్న ఒక్క అటెండర్ పోస్టూ ఖాళీగానే ఉంది. వాచ్‌మన్ ఉన్నారు. ట్రాక్టర్ క్లీనర్ పోస్టులు మూడు ఉండగా.. ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నా రు. రెం డు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టోర్ కీపర్ పోస్టు ఒక్కటి ఉండగా.. అదీ ఖాళీగానే ఉంది. అధికారులు, సిబ్బంది కొరత క్షేత్రాన్ని పీడిస్తుండడంతో పూర్తి స్థాయిలో పంటలు సాగు కావడం లేదు. పదివేల ఎకరాలకు ఫౌండేషన్ సీడ్‌ను అందించే ఈ క్షేత్రం ఇప్పుడు దీనావస్థకు చేరింది. క్షేత్ర పరిశీలన, పర్యవేక్షణ, నిర్వహణ భారంగా మారడంతో ఉన్న నలుగురు ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది. పడిపోయిన సాగు విస్తీర్ణం మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో 2017–18 ఖరీఫ్ సీజన్లో 4 వందల ఎకరాల్లో వరి, కంది పంటలు సాగయ్యాయి. అదే ఏడాది యాసంగిలో వంద ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 2018–19 ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 220 ఎకరాలకు, యాసంగిలో వంద ఎకరాలకు పడిపోయింది. ప్రస్తుతం(ఖరీఫ్) 60 ఎకరాల్లోనే పంటలు సాగు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అధికారులు, సిబ్బంది లేకపోవడమే.. ఇక్కడ పనిచేసే ఏడీఏ పలుకుబడితో హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లగా, ఎల్లారెడ్డి ఏడీఏ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు, సిబ్బంది కొరతతో విత్తన క్షేత్రం ప్రాభవాన్ని కోల్పోతోంది. ఉన్నతాధికారులు స్పందించి, అధికారుల డిప్యూటేషన్లను రద్దు చేసి విత్తనోత్పత్తి క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. -
తండ్రి తప్పుచేశాడని..కూతురిని గెంటేశారు.
సాక్షి, నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్పేట మోడల్‌స్కూల్ హాస్టల్ నుంచి నందిని అనే పదో తరగతి విద్యార్థిని గెంటివేతపై మంగళవారం ఎంఈవో ఎ.వెంకటేశం పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. విద్యార్థిని నందినితోపాటు ఆమె తండ్రి పీర్యాను పాఠశాలకు పిలిపించి మాట్లాడారు. కేర్‌టేకర్ తీరును నిరసిస్తూ తన కూతురిని పాఠశాలకు పంపబోనని, ఈ విషయమై తాను కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తానని విద్యార్థిని తండ్రి పీర్యా ఎంఈవోతో పేర్కొన్నారు. దీంతో హాస్టల్ కేర్‌టేకర్ నిర్మలతో మాట్లాడారు. తండ్రి తప్పుచేయడంతోనే అతని కూతురిని హాస్టల్ నుంచి తీసివేసినట్లు ప్రిన్సిపాల్ శ్రీలత పేర్కొన్నారు. తండ్రి తప్పుచేస్తే కూతురికి శిక్ష వేయడం సరికాదని, నందినికి తిరిగి హాస్టల్లో సీటు కేటాయించాలని ఎంఈవో ఆదేశించారు. సిబ్బంది సంయమనం పాటించాలని సూచించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని పీర్యాకు నచ్చజెప్పి నందినిని హాస్టల్లో ఉంచేందుకు ఎంఈవో ఒప్పించారు. ఆయన వెంట సీఆర్పీ రాజయ్య ఉన్నారు. -
గాలి పటం ఎగురవేస్తూ..
సాక్షి, నాగిరెడ్డిపేట: గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఓ బాలుడు మృతిచెందాడు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ పంచాయతీ పరిధిలో గల అక్కంపల్లికి చెందిన మంత్రి మల్లేశ్, పెంటమ్మ దంపతులు కూలి పనుల కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. వారి కుమారుడు మహేందర్(12) నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేట మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతూ గ్రామంలోనే నానమ్మ వద్ద ఉంటున్నాడు. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ వెళ్లాడు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని భవనంపై శుక్రవారం గాలిపటం ఎగురవేసేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా శనివారం మృతిచెందాడు. చదువులో చురుకుగా ఉండే మహేందర్ మృతితో పాఠశాలలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పోచారం ‘జోన్ల’ విభజన బాగుంది
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు ఆయకట్టును ‘ఏ’,‘బీ’జోన్లుగా విభజించిన విధానం బాగుందని మహారాష్ట్రకు చెందిన ఇంజినీరింగ్ అధికారుల బృందం కితాబుని చ్చింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన నీటి పారుద ల శాఖ చీఫ్ ఇంజినీర్ అవినాష్ షర్వేతోపాటు ఏడుగురు ఎస్ఈలు, నలుగురు ఈఈలు స్టడీ టూర్లో భాగంగా మండలంలోని పోచారం ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. హైదరాబాద్‌లోని వాల ంతరీకి చెందిన ఐడీ అండ్ సీబీ ఎక్స్పర్ట్ ఝాన్సీరాణి, ట్రైనింగ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ వారికి పోచారం ప్రాజెక్టు చరిత్ర, ఆయకుట్ట వివరాలు, ప్రాజెక్టు నీటి వినియోగం తీరును గురించి వివరించారు. అనంతరం అవినాష్ షర్వే స్థానిక విలేకరులతో మాట్లాడా రు. తెలంగాణలోని మైనర్, మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అధ్యయ నం చేయడానికి రెండురోజుల క్రితం తాము హైదరాబాద్‌కు వచ్చామన్నారు. మొదటిరోజు ఇరిగేషన్ అధికారులకు శిక్షణను ఇచ్చే వాలంతరీని, పటాన్‌చెర్వులోని ఇక్రిశాట్ను సందర్శించామన్నారు. రెండోరోజు పోచారం, నిజాంసాగర్ ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చామన్నారు. ప్రాజెక్టుల్లోని సాగునీటిని ప్రజల భాగస్వామ్యంతో వినియోగించుకునే తీరును అధ్యయనం చేస్తున్నామన్నారు. పోచారం ప్రాజెక్టు నీటిని ఖరీఫ్‌లో పూర్తి ఆయకట్టుకు అందించి, రబీలో మాత్రం ‘ఏ’,‘బీ’జోన్లకు అందించడం బాగుందన్నారు. ఈ విధా నం వల్ల ప్రాజెక్టులోని నీరు కొద్దిపాటి ఆయకట్టుకైనా పూర్తిస్థాయిలో అందుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులు సుమారు 3,700 ఉన్నాయని అవినాష్ షర్వే తెలిపారు. తెలంగాణలో వరి సాగుచేసే రైతుల నుం చి ఎకరాకు రూ. 200 చొప్పున నీటితీరువా వసూలు చేస్తుండగా తమ రాష్ట్రంలో ఎకరాకు రూ. 476 నీటిపన్ను వసూలు చేస్తున్నామన్నారు. చెరుకు రైతుల నుంచి ఇక్కడ ఎకరానికి రూ. 350 వసూలు చేస్తుండ గా మహారాష్ర్టలో రూ. 4,500 వసూలు చేస్తున్నామన్నారు. తమ రాష్ట్రంలో రైతుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బు నుంచే ప్రాజెక్టుల నిర్వహణకు కొంతభాగం కేటాయిస్తామని తెలిపారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో మహారాష్ట్రకు చెందిన ఎస్ఈలు పటాక్, గునలే, సంజీవ్ టటు, షాహ్, అజయ్ కోహీర్కర్, సంతోష్ తిరమన్వర్, ఈఈలు అశిశ్ దేవ్ఘడే, బోడ్కే, రాథోడ్, విశ్వకర్మ, బోర్సేతోపాటు కామారెడ్డి ఈఈ మధుకర్‌రెడ్డి, డీఈఈ విజయేందర్‌రెడ్డి ఉన్నారు. నిజాంసాగర్‌లో.. నిజాంసాగర్ : మహారాష్ట్ర ప్రాంత నీటిపారుదలశాఖ ఇంజినీర్లు మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి పంపిణీ తీరును తెలుసుకున్నారు. ప్రాజెక్టు గురించి స్థానిక అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. ఐబీసీబీ నిపుణురాలు ఝాన్సీరాణి, టీం కన్వీనర్ చంద్రశేఖర్ స్థానిక డిప్యూటీ ఈఈ సురేశ్‌బాబు తదితరులున్నారు. ఎక్లాస్‌పూర్‌లో.. కోటగిరి : ఎక్లాస్పూర్ నీటి సంఘం కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం సందర్శించింది. బృంద సభ్యులు నీటి సంఘం ద్వారా చేపట్టిన పనుల వివరాలు తెలుసుకున్నారు. సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తున్నామని సంఘం అధ్యక్షుడు శరత్‌బాబు వారికి వివరించారు. -
పాపం చిన్నారులు
నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి : ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ‘మొహర్రం’ నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లి గ్రామంలో విషాదం నింపింది. మంగళవారం పీర్లను ఊరేగిస్తున్న బృంద స భ్యులు విద్యుదాఘాతానికి గురి కాగా, ఒకరు సజీవ దహనమయ్యారు. 26మంది గాయపడ్డారు. ఇందు లో ఎక్కువ మంది చిన్నారులే ఉండ టం పలువురిని కలిచివేసింది. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో గ్రా మంలోని చిన్నారులు పీర్ల ఊరేగిం పులో ఉత్సాహంగా పాల్గొన్నారు. చి న్నారులంతా పీర్ల ముందు ఆడుతూ, గెంతుతూ గ్రామంలోకి వస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిలో 15 మందికిపైగా 15 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఒళ్లంతా భగ భగమండుతుంటే చిన్నారులు పడుతున్న నరకయాతనను చూడలేక వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గ్రామానికి చెందిన కొందరు మాలోని దూదిపీర్, ఇతంపీర్ను ఎత్తుకొని ఊరేగింపుగా సమీపంలోని ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామానికి వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తుండగా శివారులోని 132 కేవీ హైటెన్షన్వైర్లకు దూదిపీర్ కర్ర తగలడంతో ఊరేగింపు బృందం విద్యుదాఘాతానికి గురై ప్రమాదం నెలకొంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన జింకల చిన్నసాయిలు (32) మృతి చెందాడు. గాయపడ్డవారిని నాగిరెడ్డిపేట జడ్పీటీసీ సభ్యుడు నారాయణ, గ్రామసర్పంచ్ భర్త కృష్ణ, గ్రామస్తులు ప్రమాదంలో బైక్‌లపై, ఆటోల్లో, 108 వాహనాల్లో ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారిన ఏడుగురిని వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఎల్లారెడ్డి ఆసుపత్రిలో తరుణ్, మహేష్, సందీప్, మోహన్, సంపత్, సాజిద్, భాగ్య, శ్రీనివాస్,సాయిలు, వంశీ, ప్రేమ్‌కుమార్, కిరణ్, సాయి, తేజ, నవీన్, సురేష్ కల్పన, సంతు, లోకయ్య చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా : ఎమ్మెల్యే మృతుడు జింక సాయిలు కుటుంబానికి ప్రభుత్వ తరపున ఎక్స్‌గ్రేషియా అందించేలా చూస్తామని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో బాధితులను కలిసి పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాద ఘటన విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వమే పూర్తిగా ఖర్చు భరిస్తుందన్నారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ సైతం చేయిస్తామన్నారు. ఎల్లారెడ్డిలో చికిత్స పొందుతున్న వారికి వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలు అందిస్తారన్నారు. అచ్చాయపల్లి గ్రామంలో నిర్వహించిన సాయిలు అంత్యయ్రల్లోనూ ఎ మ్మెల్యే పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్, నాయకులు గంగాధర్, సాయిలు, కృష్ణాగౌడ్, శ్రీనివాస్, పప్పువెంకటేశం, బాలకిషన్, నారాయణ, ఇబాద్, హబీబ్, రాజు, నాగబూషణం, యూసూఫ్, డీఎంహెచ్ వో గోవింద్వాంగ్మారే, కామారెడ్డి డీఎస్పీ భాస్క ర్, సీఐ రామకృష్ణ, ఎస్సైలు రాజశేఖర్, పూర్ణేశ్వర్ తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డి యంపిపి సంజీ వులు, నాయకులు సంజీవులు తదితరులున్నా రు. ఆస్పత్రిలో క్షతగాత్రులను కామారెడ్డి డీఎస్పీ భాస్కర్, ఆర్డీవో వేంకటేశ్వర్లు పరామర్శించారు. భాదితుల కుటుంభాల సభ్యుల రోధనలతో ఆసుపత్రి దద్దరిల్లిపోయింది. టీఆర్ఎస్,కాంగ్రెస్,టీడీపీ నాయకుల పరామర్శ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమడుగు సురేందర్ బాధితులకు పండ్లు, కొబ్బరి బోండాలను అందజేశారు.టీడీపీ నాయకులు గయాజుద్దీన్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.