seed quality
-
ఏకరీతిగా విత్తన నాణ్యత
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన నాణ్యత ప్రమాణాలపై జర్మనీలో ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఫిబ్రవరి 8 నుంచి 16 వరకు జర్మనీలోని ప్రీసింగ్లో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఇస్టా గవర్నింగ్ బోర్డ్ మెంబర్, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు హాజరయ్యారు. ఈ సమావేశంలో విత్తన పరీక్ష పద్ధతులు, ప్రమాణాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన విత్తన నాణ్యత ప్రమాణాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో విత్తన ఎగుమతులకు అవకాశం ఉం టుందని సమావేశం అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో జూన్‌లో జరగబోయే అంతర్జాతీయ విత్తన సదస్సు కార్యక్రమాలను కార్యనిర్వాహక కమిటీ ఖరారు చేసింది. ఈ సదస్సు నిర్వహణకు సంబంధించి జూన్ 20న ఇస్టా కార్యనిర్వాహక కమిటీ రానుంది. జూన్ 23న ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రిని ఈ కమిటీ సభ్యులు కలవనున్నారు. జూలై 3 వరకు పలు సమావేశాలను నిర్వ హించాలని కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. జూన్ 22 నుంచి 25 వరకు హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేశవులు తెలిపారు. ఆసియా ఖండంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ సదస్సు జరగనున్నందున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించినట్లు కేశవులు తెలిపారు. ఐరాసకు చెందిన ఎఫ్ఏవో విత్తన ప్రముఖులతో సమావేశం, ఆసియా–ఆఫ్రికా దేశాల మధ్య సౌత్–సౌత్ కోఆపరేషన్ కింద పరస్పర విత్తన సాంకేతిక పరిజ్ఞాన సహకారం, విత్తన ఎగుమతులు, దిగుమతులు, మార్కెటింగ్ అనుసంధానం కోసం వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. కార్యనిర్వాహక సమావేశంలో 2019–25 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళికతో పాటు దేశాల మధ్య విత్తన ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించి, విత్తన వాణిజ్యాన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఒకేరకమైన విత్తన నాణ్యత ప్రమాణాలు ఉండాలని నిర్ణయించారు. విత్తన ఎగుమతులు చేసేటప్పుడు లేబిలింగ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలి? విత్తన పాకెట్‌పై ఉండే లేబుల్‌పై బార్‌కోడెడ్ పద్ధతి ద్వారా ఏయే విత్తన ప్రమాణాలు అందులో ఉంచాలనే అంశంపై కూడా చర్చ జరిపారు. సమావేశంలో ఇస్టా అధ్యక్షుడు క్రేగ్ మెక్‌గిల్ (న్యూజిలాండ్), ఉపాధ్యక్షుడు స్టీవ్ జోన్స్ (కెనడా), జోయెల్ లెచపే (ఫ్రాన్స్), ఇగ్నాషియో అరన్సింగా(అర్జెంటీనా), కున్సోత్ కేశవులు (ఇండియా) తదితరులు పాల్గొన్నారు. -
‘విత్తన నాణ్యతలో రాజీ పడొద్దు’
తనకల్లు : ఖరీఫ్‌లో రైతులకు సబ్సిడీతో పంపిణీ చేసే విత్తన వేరుశనగ నాణ్యతలో రాజీ పడొద్దని వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ జేడీఏ జయచంద్ర పేర్కొన్నారు. మండల పరిధిలోని గందోడివారిపల్లిలో ఉన్న మన విత్తన కేంద్రాన్ని పలువురు అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకీ అనుమతులు వచ్చాయన్నారు. ఏపీ సీడ్స్‌కు 34 మండలాలు, ఆయిల్‌ఫెడ్‌కు 15 మండలాలు, మార్క్‌ఫెడ్‌కు 13 మండలాలు, వాసన్ ఎన్జీఓకు తనకల్లు మండలం విత్తన సేకరణ బాధ్యతల్ని అప్పగించామన్నారు. త్వరలోనే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో విత్తన పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తనకల్లు మండలంలో ఇప్పటి వరకు ఎంత విత్తన వేరుశనగ సేకరించారని ఏఓ రాంసురేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. 6500 క్వింటాళ్లుకు గానూ ఇంతవరకు 2,880 క్వింటాళ్లు సేకరించామని ఏఓ సమాధానమిచ్చారు. మిగిలిన వాటిని 15వ తేది లోపల పూర్తీ చేస్తామన్నారు. ఆయన వెంట వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సంపత్‌కుమార్, ఏడీఏ పీపీ విద్యావతి, ఏఓ ప్రసాద్, ఏపీ సీడ్స్ డీఎం రెడ్డెప్పరెడ్డి, ఆయిల్ ఫెడ్ పరుశురామయ్య, ఏఈఓ వెంకటేష్, జేజే సిబ్బంది ఉన్నారు. -
విత్తనం పొలంలో..నాణ్యత గాలిలో!
అనంతపురం అగ్రికల్చర్ : అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నా నాసిరకం విత్తన వేరుశనగ అంటగడుతున్నారంటూ రెతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విత్తన నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. రాయితీ విత్తన పంపిణీలో భాగంగా ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా, ఏపీ సీడ్స్ ద్వారా నెల రోజుల కిందట నుంచి వివిధ జిల్లాల నుంచి కే-6 రకం విత్తన వేరుశనగ సేకరించి సరఫరా చేస్తున్నారు. వంద శాతం సర్టిఫైడ్ సీడ్ అంటూ ట్యాగ్ తగిలించి సరఫరా చేస్తున్నా, అందులో నాసిరకం కాయలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న విషయం గతంలోనూ, ఇపుడు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విత్తన నాణ్యతా ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకున్న తరువాత రైతులకు పంపిణీ చేయాల్సివుంటుంది. అందుకోసం జిల్లా కేంద్రంలో విత్తన పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. వేరుశనగతో పాటు ఇతరత్రా అన్ని రకాల విత్తనాలు రైతులకు పంపిణీ చేసేలోగా జిల్లాకు సరఫరా అయిన వెంటనే లాట్ల వారీగా బస్తాల నుంచి యాక్ట్, అండ్ సర్వీసు ఇలా రెండు రకాల నమూనాలు (శ్యాంపిల్స్) సేకరించి యాక్ట్ శ్యాంపిల్స్ హైదరాబాద్ లేదా తాడేపల్లిగూడెం లాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రయోగశాలలకు పంపాలనే నిబంధన ఉంది. సర్వీసు శ్యాంపిల్స్ ఇక్కడే ఉన్న విత్తన పరీక్షా కేంద్రానికి పంపి రైతులు పంట విత్తుకునే లోగా నాణ్యత గురించి తెలియజేయాల్సివుంటుంది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న విత్తన పరీక్షా కేంద్రానికి ప్రస్తుత 2015-16 సంవత్సరానికి 600 విత్తన శ్యాంపిల్స్ పరీక్షించాలని టార్గెట్ కూడా ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఉన్న వాటిని రైతులకు పంపిణీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విత్తనాన్ని తక్షణం వెనక్కిపంపడమే కాకుండా సరఫరా చేసిన ఏజెన్సీలు లేదా సంస్థలపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేయాల్సివుంటుంది. అయితే జిల్లాకు వచ్చిన విత్తనకాయల నుంచి శ్యాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపడంలో మండల వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే 63 మండలాల పరిధిలో 1.26 లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు పంపిణీ చేశారు. అయితే మండలాల నుంచి విత్తన శ్యాంపిల్స్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రయోగశాలకు చేరడం లేదు. ఇప్పటివరకు కొన్ని మండలాల నుంచి 175 నమూనాలు మాత్రమే వచ్చాయి. తక్కిన 42 మండలాల నుంచి ఒక్కటంటే ఒక్క సర్వీసు శ్యాంపిల్ రాకపోవడం విశేషం. ఈ పరిస్థితుల్లో నాణ్యతా ప్రమాణాలు తేల్చేలోగా దాదాపు విత్తుకునే కార్యక్రమం పూర్తీ అయ్యే అవకాశం ఉంది. విత్తుకున్న తరువాత నాణ్యత లేదని తేలితే రైతుకు జరిగే నష్టం ఎవరు భరిస్తారో అర్థం కావడం లేదు. గతంలో జిల్లా కలెక్టర్‌గా జనార్థన్‌రెడ్డి ఉన్న సమయంలో విత్తన నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి ఏజెన్సీలు, అధికారుల్లో గుబులు పుట్టించారు. ఇపుడు అలాంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు.