అనంతపురం అగ్రికల్చర్ : అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నా నాసిరకం విత్తన వేరుశనగ అంటగడుతున్నారంటూ రెతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విత్తన నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. రాయితీ విత్తన పంపిణీలో భాగంగా ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా, ఏపీ సీడ్స్ ద్వారా నెల రోజుల కిందట నుంచి వివిధ జిల్లాల నుంచి కే-6 రకం విత్తన వేరుశనగ సేకరించి సరఫరా చేస్తున్నారు. వంద శాతం సర్టిఫైడ్ సీడ్ అంటూ ట్యాగ్ తగిలించి సరఫరా చేస్తున్నా, అందులో నాసిరకం కాయలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న విషయం గతంలోనూ, ఇపుడు కూడా వెలుగు చూస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో విత్తన నాణ్యతా ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకున్న తరువాత రైతులకు పంపిణీ చేయాల్సివుంటుంది. అందుకోసం జిల్లా కేంద్రంలో విత్తన పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. వేరుశనగతో పాటు ఇతరత్రా అన్ని రకాల విత్తనాలు రైతులకు పంపిణీ చేసేలోగా జిల్లాకు సరఫరా అయిన వెంటనే లాట్‌ల వారీగా బస్తాల నుంచి యాక్ట్, అండ్ సర్వీసు ఇలా రెండు రకాల నమూనాలు (శ్యాంపిల్స్) సేకరించి యాక్ట్ శ్యాంపిల్స్ హైదరాబాద్ లేదా తాడేపల్లిగూడెం లాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రయోగశాలలకు పంపాలనే నిబంధన ఉంది.
సర్వీసు శ్యాంపిల్స్ ఇక్కడే ఉన్న విత్తన పరీక్షా కేంద్రానికి పంపి రైతులు పంట విత్తుకునే లోగా నాణ్యత గురించి తెలియజేయాల్సివుంటుంది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న విత్తన పరీక్షా కేంద్రానికి ప్రస్తుత 2015-16 సంవత్సరానికి 600 విత్తన శ్యాంపిల్స్ పరీక్షించాలని టార్గెట్ కూడా ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఉన్న వాటిని రైతులకు పంపిణీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విత్తనాన్ని తక్షణం వెనక్కిపంపడమే కాకుండా సరఫరా చేసిన ఏజెన్సీలు లేదా సంస్థలపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేయాల్సివుంటుంది.
అయితే జిల్లాకు వచ్చిన విత్తనకాయల నుంచి శ్యాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపడంలో మండల వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే 63 మండలాల పరిధిలో 1.26 లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు పంపిణీ చేశారు. అయితే మండలాల నుంచి విత్తన శ్యాంపిల్స్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రయోగశాలకు చేరడం లేదు. ఇప్పటివరకు కొన్ని మండలాల నుంచి 175 నమూనాలు మాత్రమే వచ్చాయి. తక్కిన 42 మండలాల నుంచి ఒక్కటంటే ఒక్క సర్వీసు శ్యాంపిల్ రాకపోవడం విశేషం.
ఈ పరిస్థితుల్లో నాణ్యతా ప్రమాణాలు తేల్చేలోగా దాదాపు విత్తుకునే కార్యక్రమం పూర్తీ అయ్యే అవకాశం ఉంది. విత్తుకున్న తరువాత నాణ్యత లేదని తేలితే రైతుకు జరిగే నష్టం ఎవరు భరిస్తారో అర్థం కావడం లేదు. గతంలో జిల్లా కలెక్టర్‌గా జనార్థన్‌రెడ్డి ఉన్న సమయంలో విత్తన నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి ఏజెన్సీలు, అధికారుల్లో గుబులు పుట్టించారు. ఇపుడు అలాంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు.
విత్తనం పొలంలో..నాణ్యత గాలిలో!
Published Fri, Jun 12 2015 1:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement