భారం.. దారుణం
కడప అగ్రికల్చర్ : మూలిగే నక్కపై తాటి కాయ పడిందన్న చందంగా ప్రభుత్వాలు రైతులపై మోయలేని భారం మోపుతున్నాయి. కంపెనీలకు మేలు చేస్తూ రైతు నడ్డి విరుస్తున్నాయి. సరైన సమయంలో వర్షం పడక ఖరీఫ్‌లో ప్రధాన పంటలు సాగు కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు కొంత మంది రైతులు చిరు ధాన్యాల పంటలు వేసుకున్నారు. మరికొందరు రబీ సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎరువుల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించడంతో ఇదే అవకాశంగా ఆయా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పదిహేను శాతం పెంచేశారు.
50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1270 నుంచి రూ.1302కు చేరింది. కాంప్లెక్స్ ఎరువులు బస్తాపై అదనంగా రూ.32 నుంచి 63 రూపాయలకు పెంచారు. అన్ని ఎరువులపై సరాసరి రూ.15 నుంచి రూ.70 వరకు పెరిగాయి. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకుగాను డీఏపీ 30 వేల మెట్రిక్ టన్నులు, కాంపెక్స్ ఎరువులు 62 వేల మెట్రిక్ టన్నులు తెప్పించారు. ఖరీఫ్, రబీ సీజన్లకుగాను రైతులు డీఏపీ ఎరువులకు రూ.72 కోట్లు, కాంప్లెక్స్ ఎరువుపై రూ.124 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన పెరిగిన ఎరువుల ధర జిల్లా మొత్తంగా రైతులపై రూ.9.2 కోట్లు పడనుంది. ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు పెరుగుతున్నా తమ పంటకు మద్దతు ధర మాత్రం పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు ధర పెంచాలి
ఏటా ఎరువుల ధరలు పెరుగుతున్నా పండించిన పంటకు మాత్రం ధరలు పెరగడం లేదు. రైతులను నట్టేట ముంచుతూ ఎరువుల కంపెనీలకు మేలు చేస్తారా.. ప్రభుత్వాలకు తగదిది. ఎరువుల కంపెనీలకు భయపడి రైతులకు ఇక్కట్లు కల్పించడం భావ్యం కాదు.
- జయకుమార్‌రెడ్డి, రైతు, చింతకొమ్మదిన్నె
ఎరువుల ధరలు పెరగకుండా చూడాలి
ప్రతిసారీ ఎరువుల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. రైతులకు మేలు చేయకుండా కంపెనీలతో కుమ్మక్కై మోసం చేయడం దారుణం. ధరలు పెంచకుండా ప్రభుత్వమే కంపెనీలకు సబ్సిడీ పెంచితే సరిపోతుంది కదా?
- ఇమామ్ సాహెబ్, రైతు, ఐఎస్ కొట్టాల, వేముల మండలం.
ఆందోళన చేస్తాం
ఎరువుల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఏటా ఎరువుల ధరలతోపాటు పంటకు మద్దతు ధరలు కూడా పెంచాలి. ఎరువుల ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.
- రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం